పేలింది బాంబు కాదు: పోలీసులు

Police Confirmed Not The Bomb That Exploded In Renigunta - Sakshi

సాక్షి, రేణిగుంట (చిత్తూరు జిల్లా): రేణిగుంట–కోడూరు రైల్వే మార్గంలో రైలు పట్టాలపై రసాయన వ్యర్థాల వల్ల పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలివీ.. రేణిగుంట తారకరామానగర్‌కు చెందిన శశికళ (35) మంగళవారం గ్రామ శివారులో ఆవులను మేపుతోంది. ఆవులు రైలు పట్టాలపైకి వెళ్లడంతో వాటిని పక్కకు తోలేందుకు పట్టాలపైకి వెళ్లింది. రైలు పట్టాలపై ఓ బాక్స్‌ ఆమెకు అనుమానాస్పదంగా కనిపించడంతో చేతిలో ఉన్న గొడుగు సాయంతో బాక్స్‌ను కదిపింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో బాక్స్‌ పేలింది. దీంతో ఆమె చేతులు, కాళ్లు, ముఖానికి తీవ్ర రక్త గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో ఆమెను తిరుపతి రుయాకు తరలించారు. రైలు పట్టాలపై ఆ బాక్స్‌ ఉన్న సమయంలో రైళ్ల రాకపోకలు జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బాంబ్‌ స్క్వాడ్‌ నిపుణులు అక్కడకు చేరుకుని పేలుడు అవశేషాలను సేకరించారు.

రసాయన వ్యర్థాల వల్లే పేలుడు
రసాయన వ్యర్థాలతో కూడిన డబ్బాను నిర్లక్ష్యంగా రైలు పట్టాలపై పడేయడం వల్లే ఈ పేలుడు ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని తిరుపతి అర్బన్‌ ఎస్పీ రమేష్‌రెడ్డి తెలిపారు. ఇనుప కడ్డీలను వేడి చేసేందుకు ఉపయోగించే మిథైల్‌ ఇథైల్‌ కీటో పెరాక్సైడ్‌ అనే రా మెటీరియల్‌తో కూడిన డబ్బాను స్థానికంగా ఉన్న బాలాజి వెల్డింగ్‌ షాపు నుంచి తెచ్చి ఇక్కడ పడేసినట్లు విచారణలో గుర్తించామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన షాపు యాజమాన్యంపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. (చదవండి: స్నానం చేస్తుంటే వీడియో తీసి.. ఆపై)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top