బస్సును చుట్టుముట్టిన అగ్నికీలలు
అప్రమత్తతతో 40 మంది ప్రయాణికులు సురక్షితం
జార్ఖండ్‌లో ఘటన
రాంచీ: రెండూ బస్సు అగ్ని ప్రమాదాలే. రెండు బస్సులను రహదారులపై అగ్నికీలలు చుట్టుముట్టాయి. ఒక ఘటనలో బస్సు బుగ్గిపాలై 19 మందిని బలితీసుకుంటే మరో ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరక్కుండా ప్రమాదఘటన సుఖాంతంగా ముగిసింది. ఒకటి కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంకాగా మరోటి జార్ఖండ్‌లోది. డ్రైవర్ అప్రమత్తత, రెప్పపాటులో ప్రతిస్పందనలతో ఎలాంటి పెను ప్రమాదం నుంచైనా అవలీలగా తప్పించుకోవచ్చని జార్ఖండ్ బస్సు అగ్నిప్రమాదం ఘటన నిరూపించింది. రెండు బస్సుల్లోనూ దాదాపు ఒకే సంఖ్యలో ప్రయాణికులు ఉండటం గమనార్హం.
అసలేం జరిగిందంటే?
జార్ఖండ్‌లోని రాంచీలో శనివారం సాయంత్రం అత్యంత వేగంగా రహదారిపై పరుగుల తీస్తున్న బస్సు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది రాంచీ–లోహార్‌దగా జాతీయరహదారిపై మందార్ బజార్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఘటన జరిగినప్పుడు బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సులో మంటలు అంటుకోగానే డ్రైవర్ రెప్పపాటుకాలంలో బస్సును ఆపేశాడు.
ప్రయాణికులు అందర్నీ అప్రమత్తంచేసి అందర్నీ కిందకు దింపేశారు. విషయం తెల్సుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటల్ని ఆర్పేశారు. వీళ్లకు స్థానిక దుకాణదారులు సైతం సాయపడి తమ వంతుగా నీళ్లు, ఇసుక చల్లారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటన వివరాలను మందార్ పోలీస్‌స్టేషన్ ఆఫీసర్–ఇన్‌చార్జ్ మనోజ్ కర్మాలీ వెల్లడించారు.
‘‘బస్సులో అక్రమంగా రసాయన పదార్థాలను తరలిస్తున్నారు. దాంతో అవి హఠాత్తుగా మండి బ్యాటరీబాక్స్ సమీపంలో షాట్ సర్క్యూట్‌కు కారణమయ్యాయి. దీంతో అగ్గిరాజుకొని బస్సును చుట్టుముట్టాయి. ఘటన తర్వాత బస్సును పోలీస్‌స్టేషన్ ప్రాంగణానికి తీసుకొచ్చాం. ప్రయాణికులందర్నీ తమతమ గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేశాం. బస్సులో అగ్నిమాపక ఉపకరణాలు లేవు. దీనిపై విచారణకు హాజరురావాలని బస్సు యజమానికి సమన్లు జారీచేశాం’’అని మనోజ్ కర్మాలీ చెప్పారు. అప్రమత్తత ఎలాంటి పెనువిషాదం నుంచైనా కాపాడుతుందని జార్ఖండ్ బస్సు అగ్నిప్రమాద ఘటన రుజువుచేసిందని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానించారు.


