బుద్గాంలో ఎన్‌సీకి మొట్టమొదటి పరాజయం
నగ్రోటాలో డిపాజిట్ గల్లంతు
రాజస్తాన్‌లో సీటు గెలుచుకున్న కాంగ్రెస్
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లోని 8 నియోజకవర్గాలకు ఈనెల 11వ తేదీన జరిగిన ఉప ఎన్నికల్లో నాలుగింటిని అధికార పక్షాలు దక్కించుకున్నాయి. బీజేపీ పాలిత రాజస్తాన్‌లో కాంగ్రెస్ ఒక సీటును గెలుచుకోగా, జమ్మూకశ్మీర్‌లోని బుద్గాం స్థానం అధికార నేషనల్ కాన్ఫరెన్స్ మొట్టమొదటిసారిగా ఓటమి పాలైంది. ఇక్కడ పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ(పీడీపీ)అభ్యర్థి విజయం సాధించారు. జమ్మూకశ్మీర్‌లోని నగ్రోటా సీటును బీజేపీ నిలబెట్టుకుంది. మిజోరంలో ప్రధాన ప్రతిపక్షం మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్‌ఎఫ్) డంపా సీటును, పంజాబ్‌లోని తరన్‌తరన్ స్థానాన్ని ఆప్, జార్ఖండ్‌లోని ఘట్‌శిలా స్థానాన్ని జేఎంఎం నిలబెట్టుకున్నాయి.
అదేవిధంగా, తెలంగాణలోని జుబ్లీహిల్స్ స్థానాన్ని బీఆర్‌ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ దక్కించుకుంది. ఒడిశాలోని నౌపడ స్థానాన్ని బీజేపీ భారీ మెజార్టీతో తిరిగి గెలుచుకుంది. ఉప ఎన్నిక ఫలితాలపై ప్రధాని మోదీ స్పందించారు. బీజేపీ అభ్యర్థులకు విజయం అందించిన జమ్మూకశ్మీర్‌లోని నగ్రటా, ఒడిశాలోని నౌపడ నియోజకవర్గాల ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కొత్తగా ఎమ్మెల్యేలైన దేవయాని రాణా, ధొలాకియాలను ఆయన అభినందించారు. వీరి గెలుపునకు అహరి్నశలు కృషి చేసిన కార్యకర్తలకు ఎక్స్‌లో ధన్యవాదాలు తెలిపారు.
కంచుకోటలో ఎన్‌సీ ఓటమి
బుద్గాం నియోజకవర్గం అబ్దుల్లాల కుటుంబానికి కంచుకోటగా ఉంది. గతేడాది జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ) అగ్రనేత ఒమర్ అబ్దుల్లా బుద్గాంతోపాటు గండేర్‌బల్ స్థానాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం, సీఎం అయ్యాక బుద్గాంకు రాజీనామా చేశారు. దీంతో, 11న ఉప ఎన్నిక జరిగింది. తాజాగా వెలువడిన ఫలితాల్లో ఇక్కడ ప్రతిపక్ష పీడీపీ అభ్యర్థి ఆగా సయ్యద్ ముంతజీర్ విజయం సాధించారు. ఎన్‌సీ అభ్యర్థి ఆగా సయ్యద్ మెహ్మూద్‌పై ముంతజీర్ 4,478 ఓట్ల తేడాతో గెలుపొంది రికార్డు నెలకొల్పారు. 1957లో మొదటిసారిగా ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఓటమి ఎరుగని ఎన్‌సీకి మొట్టమొదటి పరాజయమిది.
డిపాజిట్ కోల్పోయిన ఎన్‌సీ
జమ్మూకశ్మీర్‌లోని నగ్రోటా స్థానాన్ని బీజేపీ అభ్యర్థి దేవయాని రాణా గెలుచుకున్నారు. జమ్మూకశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ(జేకేఎన్‌పీపీ)కి చెందిన హర్‡్ష దేవ్ సింగ్‌పై 24,647 ఓట్ల తేడాతో దేవయాని గెలిచారు. ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యరి్థని షమీమ్ బేగం డిపాజిట్ కోల్పోయారు. ఆమెకు కేవలం 10,872 ఓట్లు మాత్రమే దక్కాయి. దివంగత ఎమ్మెల్యే దేవేందర్ సింగ్ రాణా కుమార్తె దేవయాని. దేవేందర్ మరణంతో ఉప ఎన్నిక జరిగింది.
నౌపడలో బీజేపీ భారీ మెజార్టీ
ఒడిశాలోని నౌపడ స్థానాన్ని బీజేపీ అభ్యర్థి జే ధొలాకియా గెలుచుకున్నారు. సమీప ప్రత్యరి్థ, కాంగ్రెస్‌కు చెందిన ఘాసీ రామ్ మాఝిపై 83,748 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. దివంగత బీజేడీ ఎమ్మెల్యే రాజేంద్ర ధొలాకియా కుమారుడు జె. రాజేంద్ర మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
అధికార పార్టీకి ఎదురుదెబ్బ
రాజస్తాన్‌లో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అంటా స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ చేతిలో పరాజయం పాలైంది. బీజేపీ అభ్యర్థి మోర్పాల్ సుమన్‌పై కాంగ్రెస్ నేత ప్రమోద్ జైన్ భయా 15,612 ఓట్ల తేడాతో గెలిచారు. బీజేపీకి చెందిన ఎమ్మెల్యే కన్వర్ లాల్ మీనా ఓ క్రిమినల్ కేసులో దోషిగా తేలడంతో అనర్హత వేటు పడింది. దీంతో, ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది.
సీటు నిలుపుకున్న ఆప్
పంజాబ్‌లోని తరన్ తరన్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆప్ అభ్యర్థి హర్మీత్ సింగ్ సంధు తన సమీప ప్రత్యరి్థ, శిరోమణి అకాలీదళ్‌కు చెందిన సుఖ్‌వీందర్ కౌర్ రణ్‌ధవాపై 12,091 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆప్ ఎమ్మెల్యే
కశ్మీర్ సింగ్ సొహాల్ జూన్‌లో చనిపోవడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిపారు.
జార్ఖండ్‌లో బీజేపీ ఓటమి
జార్ఖండ్‌లోని ఘట్‌శిలా నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)కు చెందిన సోమేశ్ చంద్ర సోరెన్, సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన బాబూలాల్ సోరెన్‌ను 38,500 ఓట్ల తేడాతో ఓడించారు. జేఎంఎం ఎమ్మెల్యే రాందాస్ సోరెన్ కుమారుడే సోమేశ్. రాందాస్ ఆగస్ట్ 15వ తేదీన హఠాన్మరణం చెందగా ఉప
ఎన్నిక చేపట్టారు.
స్వల్ప తేడాతో విజయం
అధికార జొరాం పీపుల్స్ మూవ్‌మెంట్(జెడ్‌పీఎం) అభ్యర్థి వన్‌లాల్ సైలోవా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆయనపై ఎంఎన్‌ఎఫ్ అభ్యర్థి ఆర్.లాల్‌థంగ్లియా 562 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఎంఎన్‌ఎఫ్‌కు చెందిన డంపా శాసనసభ్యుడు లాల్‌రిన్‌ట్లువాంగా సైలో జూలైలో చనిపోవడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు.


