
వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో యాంటీమైక్రోబియల్ ఔషధాల వాడకంలో అపసవ్య ధోరణులను అరికట్టాల్సిన తరుణం ఇది. పాలు, మాంసం కోసం పశువులు, కోళ్ల పెంపకంలో.. రొయ్యలు, చేపల సాగులో లేదా ప్రాసెసింగ్ ప్రక్రియల్లో వాడేటప్పుడు జాగరూకతతో వ్యవహరించాలని ప్రభుత్వం నిర్దేశిస్తోంది.
పాలు, మాంసం, గుడ్లు, తేనె ఉత్పత్తి క్రమంలో, ఆక్వా సాగులో, ప్రాసెసింగ్‌లో ఏ దశలోనూ 34 యాంటీబయాటిక్స్‌ను వాడొద్దని భారతీయ ఆహార భద్రత, ప్రమాణాల ప్రాథికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ) నిర్దేశిస్తోంది.
యూరోపియన్ యూనియన్ ప్రమాణాలకు అనుగుణంగా మరో 15 యాంటీబయాటిక్స్ వాడకాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిషేధించింది. ప్రజల శ్రేయస్సు, ఎగుమతులను పెంపొందించుకోవటంతో పాటు మన దేశంలో వ్యవసాయంపై ఆధారపడిన సగానికిపైగా జనాభా జీవనోపాధులను సంరక్షించడంలోనూ యాంటీబయాటిక్స్ వాడకంపై సదవగాహన కీలక పాత్ర పోషిస్తుంది. ఇంతకీ ఏయే యాంటీబయాటిక్ ఔషధాలపై దశలవారీగా నిషేధం విధించారో తెలుసా? చదవండి..
సూక్ష్మక్రిములు సోకినప్పుడు చేసే వైద్య చికిత్సల్లో వాడే శక్తివంతమైన ఔషధాలే యాంటీబయాటిక్స్. ఇవి రెండు వైపులా పదును ఉన్న వజ్రాయుధాల్లాంటివి. వీటిని రూపొందించటం మానవాళి సాధించిన అద్భుతమైన విజయాలలో ఒకటి. సూక్ష్మక్రిములు సోకినప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగించే
యాంటీబయాటిక్స్ వంటి యాంటీమైక్రోబియల్ మందులు మనుషులకు, జంతువులకు మెరుగైన జీవన పరిస్థితులకు మార్గం సుగమం చేశాయి.
యంటీమైక్రోబియల్ ఔషధాలు మనుషులు, జంతువులు ఎక్కువ కాలం, ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపడానికి సహాయపడతాయి. అంటువ్యాధులను నివారించడానికి, నియంత్రించడానికి, చికిత్స చేయటానికి ఎంతగానో ఉపయోగపడతాయి. సూక్ష్మక్రిములు (బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు, సూక్ష్మ పరాన్న జీవులు) నిరోధకతను సంతరించుకోవటంతో ఈ ప్రాణాలను రక్షించే అనేక మందులు వాటి సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి.
దీన్నే ‘యాంటీమైక్రోబియల్ నిరోధకత’ లేక ఏఎంఆర్ అని పిలుస్తారు. మనుషులు, జంతువుల శ్రేయస్సుకు ‘యాంటీమైక్రోబియల్ నిరోధకత’ ముప్పు పెరుగుతోంది. ఈ ముప్పు మన కాలంలోని అతిపెద్ద ప్రపంచ ఆరోగ్య సవాళ్లలో ఒకటిగా మారింది. ప్రపంచవ్యాప్తంగా జంతువులు, మానవ ఆరోగ్యానికి.. అలాగే ప్రపంచవ్యాప్తంగా జీవనోపాధికి, ఆహార భద్రతకు
ఏఎంఆర్ ముప్పు పెరుగుతోంది..
అయితే, శుభవార్త ఏమిటంటే.. ఔషధ–నిరోధక సూక్ష్మక్రిముల ఆవిర్భావాన్ని అరికట్టడానికి పరిష్కారాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ– పశువులను, కోళ్లను, రొయ్యలు, చేపలను పెంచే రైతులు, పశువైద్యులు, ఆరోగ్య సంరక్షణ కార్మికులు, అన్ని దేశాల పౌరులు– ప్రపంచ ఆరోగ్యానికి ముప్పుగా మారిన ఏఎంఆర్‌ను ఎదుర్కోవడానికి తమ స్థాయిలో పాటుపడటానికి అవకాశం ఉంది.
మనుషులకు వాడేందుకు ప్రత్యేకించిన యాంటీబయాటిక్ ఔషధాలను ఇతరత్రా ఉపయోగాలకు అంటే పశుపోషణలో, ఆక్వా సాగులో ఉపయోగించరాదని అంతర్జాతీయ ప్రమాణాలు స్పష్టం చేస్తున్నాయి.
ఏఎంఆర్ ముప్పును తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పాల ఉత్పత్తులు, మాంసం, గుడ్లు, రొయ్యలలో ఫలానా యాంటీమైక్రోబియల్/ యాంటీబయాటిక్ ఔషధాల అవశేషాలు ఉండకూడదు అని అనేక దేశాలు పట్టుబడుతున్నాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్ తదితర దేశాలు కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాణాలకు అనుగుణంగా లేని కంటెయినర్లను వెనక్కి తిప్పి పంపుతున్నాయి కూడా.
భారతీయ ఆహారోత్పత్తుల దిగుమతిపై అమెరికా సరికొత్త అపరాధ సుంకాలు విధించిన నేపథ్యంలో ఇతర దేశాల్లో కొత్త మార్కెట్లు వెతుక్కోవలసిన పరిస్థితి మన దేశానికి ఇంతకుముందెన్నడూ లేనంతగా ఇప్పుడొచ్చింది.
ఈ నేపథ్యంలో మీ దేశం నుంచి ఆహారోత్పత్తులు దిగుమతి చేసుకోవాలంటే మనుషుల కోసం రిజర్వు చేసిన 18 రకాల యాంటీబయాటిక్ ఔషధాలను జంతువులు, కోళ్లు, రొయ్యల సాగులో పెరుగుదల కోసం గానీ, చికిత్సల కోసం గానీ వాడకూడదన్నది యూరోపియన్ యూనియన్ పెట్టిన షరతు. దీంతో భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది.
కేంద్రీయ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ పరిధిలోని డ్రగ్స్ టెక్నికల్ అడ్వయిజరీ బోర్డు (డిటీఏబీ) 92వ సమావేశంలో మనుషుల చికిత్స కోసం యూరోపియన్ యూనియన్ రిజర్వు చేసిన 37 యాంటీమైక్రోబియల్ ఔషధాలపై చర్చించి, వీటిలో 34 యాంటీమైక్రోబియల్ ఔషధాలను నిషేధించింది. మన దేశంలో వీటి తయారీ, దిగుమతి, అమ్మకం, పంపిణీ, వినియోగాన్ని నిషేధిస్తూ డీటీఏబీ నిర్ణయం తీసుకుంది.
యూరోపియన్ యూనియన్ దేశాలు సూచించిన విధంగా మరో పదిహేను రకాలను యాంటీబయాటిక్స్ వాడకాన్ని నిషేధిస్తూ ఇటీవలే భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. గతంలో నిషేధించిన వాటితో కలుపుకుంటే ఇప్పటికి మొత్తంగా నిషేధానికి గురైన యాంటీమైక్రోబియల్ మందుల జాబితా (ఈ కథనంలోని పట్టికల్లో పేర్కొన్న విధంగా) చాలానే ఉంది. ఈ నిషిద్ధ మందుల జోలికి పోకుండా ఉంటేనే మన ఆహారోత్పత్తులను విదేశాలకు ఎగుమతి చెయ్యగలుగుతాం.
పశువులు, కోళ్లు, రొయ్యల సాగులో నిషిద్ధ యాంటీబయాటిక్స్ ఇవీ..
భారత ఆహార భద్రత–ప్రమాణాల అథారిటీ– ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (2024) నిషేధించినవి:
ఏ రంగాలు?: మాంసం కోసం పశువుల పెంపకం, మాంసం ఉత్పత్తుల తయారీ, పాడి పశువుల పెంపకం, పాల ఉత్పత్తుల తయారీ, కోళ్ల పెంపకం, ఆక్వా సాగు, ఆక్వా ఉత్పత్తుల తయారీ రంగంలో వాడకం నిషిద్ధం.
యాంటీబయాటిక్స్– 3 తరగతులు: గ్లైకోపెప్టయిడ్స్, నైట్రోఫ్యూరాన్లు/ దాని మెటాబోలైట్లు, ఫ్యూరజోలిడోన్ (ఎవోజడ్), నైట్రోఫ్యూరాజోన్ (ఎస్‌ఇఎం), ఫ్యూరల్టాడోన్ (ఎఎంఓజడ్), నైట్రోఫ్యూరాంటోయిన్ (ఎహెచ్‌డీ), నైట్రోమిడాజోల్స్.. వీటితో సహా– (ఎ) డైమెట్రిడాజోల్, (బి) రోనిడాజోల్, దాని మెటాబోలైట్ 2– హైడ్రాక్సీమీథైల్–1, –మిథైల్–3, నైట్రోమిడాజోల్(సి), ఇప్రోనిడాజోల్, దాని మెటాబోలైట్, హైడ్రాక్సీప్రోనిడాజోల్ (డి), మిట్రోనిడాజోల్, దాని మెటాబోలైట్ 3, హైడ్రాక్సీమెట్రోనిడాజోల్.
యాంటీబయాటిక్స్– 5 రకాలు: కార్బడాక్స్, క్లోరంఫెనికాల్, కోలిస్టిన్ స్ట్రెప్టోమైసిన్ (దీని మెటబొలైట్ డిహైడ్రోస్ట్రెప్టోమైసిన్ సహా), సల్ఫామెథోగ్సాజోల్.
కేంద్ర ఆరోగ్య–కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిషేధించినవి (2019, 2025):
ఏ రంగాలు?: పశువుల పెంపకం, కోళ్ల పెంపకం, ఆహారం కోసం పెంచే ఇతర పక్షుల పెంపకంలో వాడకం నిషిద్ధం.
యాంటీబయాటిక్స్– 9 తరగతులు: యూరిడోపెనిసిలిన్స్, సైడెరోఫోర్, సెఫలోస్పోరిన్స్, కార్బపెనెమ్స్, పెనెమ్స్, మోనోబాక్టమ్స్, గ్లైకోపెప్టయిడ్స్, లిపోపెప్టయిడ్స్, ఆక్సాజోలిడినోన్స్, గ్లైసిల్‌సైక్లిన్స్.
యాంటీబయాటిక్స్– 9 రకాలు: తొమ్మిది యాంటీబయాటిక్స్ వాడకంపై 2019 నుంచి నిషేధం ఉంది. ఆహారం కోసం పెంచే జంతువుల పెంపకంలో, కోళ్ల పెంపకంలో, ఆక్వా సాగులో, పశుగ్రాస సప్లిమెంట్లలో వాడటం నిషిద్ధం. కొలిస్టిన్ వాడటంపై 2025 మార్చి నుంచి నిషేధం ఉంది. ఆహార ఉత్పత్తి కోసం పెంచే ఏ జంతువుల పెంపకంలోనూ దీన్ని వాడకూడదు. సెఫ్టోబిప్రోల్, సెఫ్టరోలిన్, ఫిడాక్సోమైసిన్, ప్లాజోమైసిన్, ఎరావాసైక్లిన్, ఓమాడాసైక్లిన్, నైట్రోఫ్యూరాన్, క్లోరాంఫెనికాల్‌లను జంతువుల పెంపకంలో వాడకంపై 2025 మే నుంచి నిషేధం ఉంది.
కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ నిషేధించినవి (2024):
ఏ రంగం?: తీరప్రాంత ఆక్వా సాగులో నిషిద్ధం.
యాంటీబయాటిక్స్– 5 తరగతులు: నైట్రోఫ్యూరాన్లు.. వీటితో సహా : ఫ్యూరాల్టాడోన్, ఫ్యూరాజోలిడోన్, ఫ్యూరిల్‌ఫ్యూరమైడ్, నిఫుర్‌ప్రజైన్, నైట్రోఫ్యూరాంటోయిన్, నైట్రోఫ్యూరాజోన్, డైమెట్రిడాజోల్, మెట్రోనిడాజోల్, రోనిడాజోల్, ఇప్రోనిడాజోల్ తదితర నైట్రోమిడాజోల్స్. సల్ఫోనామైడ్ మందులు (ఆమోదించబడిన సల్ఫాడిమెథాక్సిన్, సల్ఫాబ్రోమోమెథాజిన్, సల్ఫేథాక్సిపైరిడాజిన్ తప్ప), ఫ్లూరోక్వినోలోన్స్, గ్లైకోపెప్టయిడ్స్.
యాంటీబయాటిక్స్– 5 రకాలు: క్లోరాంఫెనికాల్, నియోమైసిన్, నలిడిక్సిక్ ఆసిడ్, సల్ఫామెథోక్సాజోల్, డాప్సోన్.
వాణిజ్య శాఖ నిషేధించినవి (2025):
రంగం: రొయ్యల సాగులో నిషిద్ధం.
యాంటీబయాటిక్స్–12 తరగతులు: కార్బోజైపెనిసిల్లిన్స్, యురీడోపెనిసిల్లిన్స్, సెఫలోస్పోరిన్స్ కాంబినేషన్లు బీటాతో– లాక్టామసె ఇన్హిబిటర్స్, సెడెరోఫోర్, సెఫలోస్పోరిన్స్, కార్బపెనెమ్స్, పెనెమ్స్, మోనోబాక్టమ్స్, గ్లైకోపెప్టయిడ్స్, లిపోపెప్టయిడ్స్, ఆక్సాజోలిడినోన్స్, గ్లైసిల్‌సైక్లిన్స్, ఫాస్ఫోనిక్ ఆసిడ్ డెరివేటివ్‌లు.
యాంటీబయాటిక్స్– 6 రకాలు: సెఫ్టోబిప్రోల్, సెఫ్టారోలిన్, ఫిడాక్సోమైసిన్, ప్లాజోమైసిన్, ఎరవాసైక్లిన్, ఒమడాసైక్లిన్.