breaking news
Livestock breeding
-
ఈ యాంటీబయాటిక్స్ తో జాగ్రత్త!
వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో యాంటీమైక్రోబియల్ ఔషధాల వాడకంలో అపసవ్య ధోరణులను అరికట్టాల్సిన తరుణం ఇది. పాలు, మాంసం కోసం పశువులు, కోళ్ల పెంపకంలో.. రొయ్యలు, చేపల సాగులో లేదా ప్రాసెసింగ్ ప్రక్రియల్లో వాడేటప్పుడు జాగరూకతతో వ్యవహరించాలని ప్రభుత్వం నిర్దేశిస్తోంది. పాలు, మాంసం, గుడ్లు, తేనె ఉత్పత్తి క్రమంలో, ఆక్వా సాగులో, ప్రాసెసింగ్‌లో ఏ దశలోనూ 34 యాంటీబయాటిక్స్‌ను వాడొద్దని భారతీయ ఆహార భద్రత, ప్రమాణాల ప్రాథికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఐ) నిర్దేశిస్తోంది. యూరోపియన్ యూనియన్ ప్రమాణాలకు అనుగుణంగా మరో 15 యాంటీబయాటిక్స్ వాడకాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిషేధించింది. ప్రజల శ్రేయస్సు, ఎగుమతులను పెంపొందించుకోవటంతో పాటు మన దేశంలో వ్యవసాయంపై ఆధారపడిన సగానికిపైగా జనాభా జీవనోపాధులను సంరక్షించడంలోనూ యాంటీబయాటిక్స్ వాడకంపై సదవగాహన కీలక పాత్ర పోషిస్తుంది. ఇంతకీ ఏయే యాంటీబయాటిక్ ఔషధాలపై దశలవారీగా నిషేధం విధించారో తెలుసా? చదవండి..సూక్ష్మక్రిములు సోకినప్పుడు చేసే వైద్య చికిత్సల్లో వాడే శక్తివంతమైన ఔషధాలే యాంటీబయాటిక్స్. ఇవి రెండు వైపులా పదును ఉన్న వజ్రాయుధాల్లాంటివి. వీటిని రూపొందించటం మానవాళి సాధించిన అద్భుతమైన విజయాలలో ఒకటి. సూక్ష్మక్రిములు సోకినప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగించే యాంటీబయాటిక్స్ వంటి యాంటీమైక్రోబియల్ మందులు మనుషులకు, జంతువులకు మెరుగైన జీవన పరిస్థితులకు మార్గం సుగమం చేశాయి. యంటీమైక్రోబియల్ ఔషధాలు మనుషులు, జంతువులు ఎక్కువ కాలం, ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపడానికి సహాయపడతాయి. అంటువ్యాధులను నివారించడానికి, నియంత్రించడానికి, చికిత్స చేయటానికి ఎంతగానో ఉపయోగపడతాయి. సూక్ష్మక్రిములు (బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు, సూక్ష్మ పరాన్న జీవులు) నిరోధకతను సంతరించుకోవటంతో ఈ ప్రాణాలను రక్షించే అనేక మందులు వాటి సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి.దీన్నే ‘యాంటీమైక్రోబియల్ నిరోధకత’ లేక ఏఎంఆర్ అని పిలుస్తారు. మనుషులు, జంతువుల శ్రేయస్సుకు ‘యాంటీమైక్రోబియల్ నిరోధకత’ ముప్పు పెరుగుతోంది. ఈ ముప్పు మన కాలంలోని అతిపెద్ద ప్రపంచ ఆరోగ్య సవాళ్లలో ఒకటిగా మారింది. ప్రపంచవ్యాప్తంగా జంతువులు, మానవ ఆరోగ్యానికి.. అలాగే ప్రపంచవ్యాప్తంగా జీవనోపాధికి, ఆహార భద్రతకు ఏఎంఆర్ ముప్పు పెరుగుతోంది.. అయితే, శుభవార్త ఏమిటంటే.. ఔషధ–నిరోధక సూక్ష్మక్రిముల ఆవిర్భావాన్ని అరికట్టడానికి పరిష్కారాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ– పశువులను, కోళ్లను, రొయ్యలు, చేపలను పెంచే రైతులు, పశువైద్యులు, ఆరోగ్య సంరక్షణ కార్మికులు, అన్ని దేశాల పౌరులు– ప్రపంచ ఆరోగ్యానికి ముప్పుగా మారిన ఏఎంఆర్‌ను ఎదుర్కోవడానికి తమ స్థాయిలో పాటుపడటానికి అవకాశం ఉంది. మనుషులకు వాడేందుకు ప్రత్యేకించిన యాంటీబయాటిక్ ఔషధాలను ఇతరత్రా ఉపయోగాలకు అంటే పశుపోషణలో, ఆక్వా సాగులో ఉపయోగించరాదని అంతర్జాతీయ ప్రమాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఏఎంఆర్ ముప్పును తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పాల ఉత్పత్తులు, మాంసం, గుడ్లు, రొయ్యలలో ఫలానా యాంటీమైక్రోబియల్/ యాంటీబయాటిక్ ఔషధాల అవశేషాలు ఉండకూడదు అని అనేక దేశాలు పట్టుబడుతున్నాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్ తదితర దేశాలు కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాణాలకు అనుగుణంగా లేని కంటెయినర్లను వెనక్కి తిప్పి పంపుతున్నాయి కూడా. భారతీయ ఆహారోత్పత్తుల దిగుమతిపై అమెరికా సరికొత్త అపరాధ సుంకాలు విధించిన నేపథ్యంలో ఇతర దేశాల్లో కొత్త మార్కెట్లు వెతుక్కోవలసిన పరిస్థితి మన దేశానికి ఇంతకుముందెన్నడూ లేనంతగా ఇప్పుడొచ్చింది. ఈ నేపథ్యంలో మీ దేశం నుంచి ఆహారోత్పత్తులు దిగుమతి చేసుకోవాలంటే మనుషుల కోసం రిజర్వు చేసిన 18 రకాల యాంటీబయాటిక్ ఔషధాలను జంతువులు, కోళ్లు, రొయ్యల సాగులో పెరుగుదల కోసం గానీ, చికిత్సల కోసం గానీ వాడకూడదన్నది యూరోపియన్ యూనియన్ పెట్టిన షరతు. దీంతో భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది. కేంద్రీయ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ పరిధిలోని డ్రగ్స్ టెక్నికల్ అడ్వయిజరీ బోర్డు (డిటీఏబీ) 92వ సమావేశంలో మనుషుల చికిత్స కోసం యూరోపియన్ యూనియన్ రిజర్వు చేసిన 37 యాంటీమైక్రోబియల్ ఔషధాలపై చర్చించి, వీటిలో 34 యాంటీమైక్రోబియల్ ఔషధాలను నిషేధించింది. మన దేశంలో వీటి తయారీ, దిగుమతి, అమ్మకం, పంపిణీ, వినియోగాన్ని నిషేధిస్తూ డీటీఏబీ నిర్ణయం తీసుకుంది. యూరోపియన్ యూనియన్ దేశాలు సూచించిన విధంగా మరో పదిహేను రకాలను యాంటీబయాటిక్స్ వాడకాన్ని నిషేధిస్తూ ఇటీవలే భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. గతంలో నిషేధించిన వాటితో కలుపుకుంటే ఇప్పటికి మొత్తంగా నిషేధానికి గురైన యాంటీమైక్రోబియల్ మందుల జాబితా (ఈ కథనంలోని పట్టికల్లో పేర్కొన్న విధంగా) చాలానే ఉంది. ఈ నిషిద్ధ మందుల జోలికి పోకుండా ఉంటేనే మన ఆహారోత్పత్తులను విదేశాలకు ఎగుమతి చెయ్యగలుగుతాం.పశువులు, కోళ్లు, రొయ్యల సాగులో నిషిద్ధ యాంటీబయాటిక్స్ ఇవీ..భారత ఆహార భద్రత–ప్రమాణాల అథారిటీ– ఎఫ్ఎస్ఎస్ఏఐ (2024) నిషేధించినవి:ఏ రంగాలు?: మాంసం కోసం పశువుల పెంపకం, మాంసం ఉత్పత్తుల తయారీ, పాడి పశువుల పెంపకం, పాల ఉత్పత్తుల తయారీ, కోళ్ల పెంపకం, ఆక్వా సాగు, ఆక్వా ఉత్పత్తుల తయారీ రంగంలో వాడకం నిషిద్ధం. యాంటీబయాటిక్స్– 3 తరగతులు: గ్లైకోపెప్టయిడ్స్, నైట్రోఫ్యూరాన్లు/ దాని మెటాబోలైట్లు, ఫ్యూరజోలిడోన్ (ఎవోజడ్), నైట్రోఫ్యూరాజోన్ (ఎస్ఇఎం), ఫ్యూరల్టాడోన్ (ఎఎంఓజడ్), నైట్రోఫ్యూరాంటోయిన్ (ఎహెచ్డీ), నైట్రోమిడాజోల్స్.. వీటితో సహా– (ఎ) డైమెట్రిడాజోల్, (బి) రోనిడాజోల్, దాని మెటాబోలైట్ 2– హైడ్రాక్సీమీథైల్–1, –మిథైల్–3, నైట్రోమిడాజోల్(సి), ఇప్రోనిడాజోల్, దాని మెటాబోలైట్, హైడ్రాక్సీప్రోనిడాజోల్ (డి), మిట్రోనిడాజోల్, దాని మెటాబోలైట్ 3, హైడ్రాక్సీమెట్రోనిడాజోల్.యాంటీబయాటిక్స్– 5 రకాలు: కార్బడాక్స్, క్లోరంఫెనికాల్, కోలిస్టిన్ స్ట్రెప్టోమైసిన్ (దీని మెటబొలైట్ డిహైడ్రోస్ట్రెప్టోమైసిన్ సహా), సల్ఫామెథోగ్సాజోల్.కేంద్ర ఆరోగ్య–కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిషేధించినవి (2019, 2025): ఏ రంగాలు?: పశువుల పెంపకం, కోళ్ల పెంపకం, ఆహారం కోసం పెంచే ఇతర పక్షుల పెంపకంలో వాడకం నిషిద్ధం. యాంటీబయాటిక్స్– 9 తరగతులు: యూరిడోపెనిసిలిన్స్, సైడెరోఫోర్, సెఫలోస్పోరిన్స్, కార్బపెనెమ్స్, పెనెమ్స్, మోనోబాక్టమ్స్, గ్లైకోపెప్టయిడ్స్, లిపోపెప్టయిడ్స్, ఆక్సాజోలిడినోన్స్, గ్లైసిల్సైక్లిన్స్. యాంటీబయాటిక్స్– 9 రకాలు: తొమ్మిది యాంటీబయాటిక్స్ వాడకంపై 2019 నుంచి నిషేధం ఉంది. ఆహారం కోసం పెంచే జంతువుల పెంపకంలో, కోళ్ల పెంపకంలో, ఆక్వా సాగులో, పశుగ్రాస సప్లిమెంట్లలో వాడటం నిషిద్ధం. కొలిస్టిన్ వాడటంపై 2025 మార్చి నుంచి నిషేధం ఉంది. ఆహార ఉత్పత్తి కోసం పెంచే ఏ జంతువుల పెంపకంలోనూ దీన్ని వాడకూడదు. సెఫ్టోబిప్రోల్, సెఫ్టరోలిన్, ఫిడాక్సోమైసిన్, ప్లాజోమైసిన్, ఎరావాసైక్లిన్, ఓమాడాసైక్లిన్, నైట్రోఫ్యూరాన్, క్లోరాంఫెనికాల్లను జంతువుల పెంపకంలో వాడకంపై 2025 మే నుంచి నిషేధం ఉంది.కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ నిషేధించినవి (2024): ఏ రంగం?: తీరప్రాంత ఆక్వా సాగులో నిషిద్ధం.యాంటీబయాటిక్స్– 5 తరగతులు: నైట్రోఫ్యూరాన్లు.. వీటితో సహా : ఫ్యూరాల్టాడోన్, ఫ్యూరాజోలిడోన్, ఫ్యూరిల్ఫ్యూరమైడ్, నిఫుర్ప్రజైన్, నైట్రోఫ్యూరాంటోయిన్, నైట్రోఫ్యూరాజోన్, డైమెట్రిడాజోల్, మెట్రోనిడాజోల్, రోనిడాజోల్, ఇప్రోనిడాజోల్ తదితర నైట్రోమిడాజోల్స్. సల్ఫోనామైడ్ మందులు (ఆమోదించబడిన సల్ఫాడిమెథాక్సిన్, సల్ఫాబ్రోమోమెథాజిన్, సల్ఫేథాక్సిపైరిడాజిన్ తప్ప), ఫ్లూరోక్వినోలోన్స్, గ్లైకోపెప్టయిడ్స్.యాంటీబయాటిక్స్– 5 రకాలు: క్లోరాంఫెనికాల్, నియోమైసిన్, నలిడిక్సిక్ ఆసిడ్, సల్ఫామెథోక్సాజోల్, డాప్సోన్.వాణిజ్య శాఖ నిషేధించినవి (2025): రంగం: రొయ్యల సాగులో నిషిద్ధం.యాంటీబయాటిక్స్–12 తరగతులు: కార్బోజైపెనిసిల్లిన్స్, యురీడోపెనిసిల్లిన్స్, సెఫలోస్పోరిన్స్ కాంబినేషన్లు బీటాతో– లాక్టామసె ఇన్హిబిటర్స్, సెడెరోఫోర్, సెఫలోస్పోరిన్స్, కార్బపెనెమ్స్, పెనెమ్స్, మోనోబాక్టమ్స్, గ్లైకోపెప్టయిడ్స్, లిపోపెప్టయిడ్స్, ఆక్సాజోలిడినోన్స్, గ్లైసిల్సైక్లిన్స్, ఫాస్ఫోనిక్ ఆసిడ్ డెరివేటివ్‌లు. యాంటీబయాటిక్స్– 6 రకాలు: సెఫ్టోబిప్రోల్, సెఫ్టారోలిన్, ఫిడాక్సోమైసిన్, ప్లాజోమైసిన్, ఎరవాసైక్లిన్, ఒమడాసైక్లిన్. -
‘ఒంగోలు’ జాతి పరిరక్షణకు గుర్తింపు
సాక్షి, అమరావతి: అరుదైన, అంతరించిపోతున్న ఒంగోలు జాతి ఆవుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటుతో కృషిచేస్తున్న శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పనిచేస్తున్న గుంటూరు లాంలోని పశుపరిశోధన స్థానాన్ని బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు–2023 వరించింది. జాతీయస్థాయిలో అరుదైన, అంతరించిపోతున్న జాతుల పరిరక్షణకు కృషిచేసే పరిశోధన సంస్థలకు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) ఏటా ఈ అవార్డులను ప్రదానం చేస్తుంది. గతేడాది పుంగనూరు జాతి పరిరక్షణ కోసం కృషిచేస్తున్న పలమనేరులోని పుంగనూరు పరిశోధన కేంద్రానికి ఈ అవార్డు లభించింది. ఈ ఏడాది ఒంగోలు జాతి పరిరక్షణకు కృషిచేస్తున్న పరిశోధన స్థానానికి ప్రతిష్టాత్మకమైన బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డును ప్రకటించారు. కిసాన్ దివస్ సందర్భంగా ఈ నెల 23న హరియాణలోని కర్నల్ళక్ష జరిగే కార్యక్రమంలో ఈ అవార్డు కింద ప్రత్యేక ప్రశంసాపత్రం, నగదు బహుమతి ప్రదానం చేయనున్నారు ఒంగోలు జాతికి శతాబ్దాల చరిత్ర ఒంగోలు జాతి పశువుల స్వస్థలం ఒకప్పటి ఒంగోలు, గుంటూరు, నరసరావుపేట తాలూకాలైనప్పటికీ వీటి పుట్టినిల్లు దక్షిణాన పెన్నా, ఉత్తరాన కృష్ణానదుల మధ్యకు వ్యాపించింది. 1900 దశకంలో ప్రతి రైతు దగ్గర నాలుగు నుంచి ఎనిమిది ఒంగోలు ఆవులుండేవి. కానీ క్రమేపీ ఇవి అంతరించిపోతున్న జాతుల జాబితాలోకి చేరాయి. మంచి పాలసార కలిగిన జాతిగా ఇవి అంతర్జాతీయ ఖ్యాతి గడించాయి. ఏ వాతావరణాన్ని అయినా తట్టుకునే శక్తి, వ్యా«ధినిరోధక శక్తి కలిగి ఉండడంతో పాటు భారీ శరీరంతో ఆకర్షణీయంగా ఉండడంతో ఒంగోలు జాతిపశువులు విదేశీయులను విశేషంగా ఆకర్షించాయి. ఫలితంగా తొలుత 1875లో బ్రెజిల్, 1885లో అమెరికా వీటిని తమ దేశానికి తీసుకెళ్లాయి. క్రమంగా ఒంగోలు జాతి అక్కడి నుంచి లాటిన్ అమెరికా దేశాలకు విస్తరించింది. బ్రెజిల్లో ఒంగోలు జాతిని నెలోర్, సంబా ఒంగోలు జాతిగా పిలుస్తారు. మన ఒంగోలు, గిర్, కాంక్రెజ్ జాతుల కలయికతో ఇండుబ్రెజిల్ జాతిని అభివృద్ధి చేశారు. అలాగే జమైకాలో ఒంగోలు జాతి ద్వారా బ్రాహ్మన్, వెనెజ్యులాలో ప్రిడియన్, ఒంగోలు జాతుల కలయికతో ఒంక్యాంపో అనే కొత్తజాతిని అభివృద్ధి చేశారు. ఐవీఎఫ్ ద్వారా మేలుజాతి ఒంగోలు ఆవుల అభివృద్ధి 2019లో ‘ఐవీఎఫ్–ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ (ఐవీఎఫ్అండ్ఈటీ) ద్వారా మేలు జాతి ఆవుల అభివృద్ధి ప«థకానికి రూ.2.39 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అత్యుత్తమ జన్యు లక్షణాలు, మంచి పాలసార గలిగిన దేశీ ఆవుల సంతతిని అభివృద్ది చేయుడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు ద్వారా అత్యుత్తమమైన ఇన్విట్రో ఫెర్టిలైజేషన్, పిండ మార్పిడి ప్రక్రియ ద్వారా మేలు జాతి ఒంగోలు, పుంగనూరు జాతి పిండాలు ఉత్పత్తి చేసి తద్వారా ఆ జాతుల పరిరక్షణకు కృషిచేస్తున్నారు. ప్రస్తుతం 450 దేశీయ మేలుజాతి ఒంగోలు పశుసంపద కలిగిన లాం పశుపరిశోధన స్థానం ఒంగోలు జాతి ప్రత్యుత్పత్తి, జీవ సాంకేతికతలో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా ఉంది. అవార్డుతో మరింత బాధ్యత ఒంగోలు జాతి పరిరక్షణ కోసం దశాబ్దాలుగా కృషిచేస్తున్నప్పటికీ.. నాలుగున్నరేళ్లుగా ఐవీఎఫ్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ద్వారా మేలుజాతి ఒంగోలు ఆవుల అభివృద్ధితో విశేష గుర్తింపు లభించింది. గుంటూరు పశుపరిశోధన స్థానాం ద్వారా చేస్తున్న నిర్విరామ కృషికి గుర్తింపుగా హరియాణలోని కర్నల్లోగల ఐసీఏఆర్–నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనిటిక్ రిసోర్సస్ (ఐసీఏఆర్ అండ్ ఎన్బీఏజీఆర్) నుంచి ‘జాతి పరిరక్షణ అవార్డు–2023’ లభించింది. ఈ అవార్డు ద్వారా ఒంగోలు జాతి పరిరక్షణ, అభివృద్ధి కోసం మరిన్ని పరిశోధనలు చేసేందుకు యూనివర్సిటీకి మరింత తోడ్పాటు లభించనుంది. – ప్రొఫెసర్ సర్జన్‌రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం రాష్ట్రంలో భారీగా పెరిగిన ఒంగోలు జాతి పశుసంతతి మన దేశంలో వీటిసంఖ్య క్రమేపి తగ్గి అంతరించిపోతున్న వాటి జాబితాలో చేరడంతో ఒంగోలు జాతి గోవుల అభివృద్దికి శ్రీకారం చుట్టారు. 1926లో ఏర్పాటైన గుంటూరు లాంలోని పరిశోధన స్థానం 1972 నుంచి ఒంగోలు జాతి పరిరక్షణ కోసం కృషిచేస్తోంది. వంద మేలు జాతి ఒంగోలు ఆబోతుల నుంచి దాదాపు 11 లక్షల వీర్య మోతాదులు తయారు చేసి తెలుగు రాష్ట్రాల రైతులకు అందజేశారు. ఫలితంగా రాష్ట్రంలో ఈ జాతి పశుసంపద అభివృద్ధి చెందింది. దేశంలో సుమారు ఏడులక్షల ఒంగోలు గోసంతతి ఉండగా, ఒక్క ఏపీలోనే నాలుగు లక్షలకుపైగా వీటి సంఖ్య పెరిగింది. ఇటీవల మేఘాలయ రాష్ట్ర సంవర్ధకశాఖకు ఒంగోలు జాతి వీర్యంతో పాటు కోడెదూడలను సరఫరా చేశారు. ఒంగోలు జాతి పరిరక్షణ కోసం వివిధ ప్రాజెక్టుల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటుతో పాటు శ్రీవేంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం నిర్విరామ కృషిచేస్తోంది. -
మేలుజాతి పశు పునరుత్పత్తి క్షేత్రాలు
సాక్షి, అమరావతి: అధిక దిగుబడినిచ్చే దేశవాళి ఆవులు, గేదెలు, విదేశీజాతి ఆవుల పునరుత్పత్తి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మేలుజాతి పశుపునరుత్పత్తి క్షేత్రాలను ఏర్పాటు చేస్తోంది. ఒక్కో యూనిట్ రూ.4 కోట్ల అంచనా వ్యయంతో ఈ క్షేత్రాల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో పాల ఉత్పత్తిని రెట్టింపు చేయాలని, మేలుజాతి పశుసంపదను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఆరోగ్యవంతమైన, అధిక పాల దిగుబడినిచ్చే పశుసంపద కోసం పాడిరైతులు మధ్యవర్తులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇప్పటివరకు దేశంలో వీటి పునరుత్పత్తికి సరైన వ్యవస్థ అందుబాటులో లేదు. ఈ పరిస్థితికి చెక్‌పెడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో మేలుజాతి పశుపునరుత్పత్తి క్షేత్రాల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఒక్కో యూనిట్‌కు అయ్యే రూ.4 కోట్ల వ్యయంలో రూ.2 కోట్లను సబ్సిడీ రూపంలో నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) ద్వారా అందిస్తుంది. ఒక్కో క్షేత్రాన్ని 200కు తక్కువకాకుండా మేలుజాతి ఆవులు లేదా గేదెలతో ఏర్పాటు చేస్తారు. మినిమమ్ స్టాండర్స్ ప్రొటోకాల్స్ (ఎమ్మెస్పీ) ప్రకారం కనీసం రోజుకు 16 లీటర్ల పాలిచ్చే గేదెలు, 10 నుంచి 12 లీటర్ల పాలిచ్చే ఆవులు, 22 లీటర్లకుపైగా పాలిచ్చే సంకరజాతి ఆవులను ఎంపిక చేసుకోవాలి. ఒక ఈత అయిన ఆవులు, గేదెలను మాత్రమే కొనుగోలు చేయాలి. వీటివిలువ ఒక్కొక్కటి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఉంటుంది. వీటికోసం ప్రత్యేకంగా షెడ్లు, పోషణకు అవసరమైన పరికరాలు ఏర్పాటు చేయాలి. మేలుజాతి పశువుల వీర్యాన్ని ఐవీఎఫ్ సాంకేతికత ద్వారా వినియోగించి నాణ్యమైన దూడెలను పునరుత్పత్తి చేయాలి. ఇలా అభివృద్ధి చేసిన ఆడదూడల పునరుత్పత్తి ద్వారా బ్రీడ్ మల్టిప్లికేషన్ ఫారాలను అభివృద్ధి చేయవచ్చు లేదా తోటి రైతులకు విక్రయించుకోవచ్చు. మగ దూడలనైతే సెమన్ బ్యాంకుల ద్వారా కొనుగోలు చేయిస్తారు. ఎంపిక చేసే విధానం ► దరఖాస్తుదారులు.. వ్యాపారవేత్తలు, ప్రైవేట్ వ్యక్తులు, స్వయం సహాయక సంఘాలు/రైతు ఉత్పత్తి సంస్థలు, జాయింట్ లయబిలిటీ గ్రూపులు, సెక్షన్–8 కింద నమోదైన కంపెనీలై ఉండాలి. ► పాడి పశువుల పెంపకంలో అనుభవం ఉండాలి. ► కనీసం 5 ఎకరాల సొంత భూమి లేదా లీజుకు తీసుకున్న భూమి ఉండాలి. ► ఫారంలో పశువులకు అవసరమైన మేతను సేకరించేందుకు తగిన ఏర్పాటు ఉండాలి. ► పశుసంవర్ధకశాఖ, ఎన్డీడీబీ, నిపుణుల కమిటీ అర్హులను ఎంపిక చేస్తుంది. ► దరఖాస్తు, ప్రెజంటేషన్, ఫీల్డ్ వెరిఫికేషన్ ఆధారంగా వారి ఆర్థిక సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. అవసరమైతే బ్యాంకు/ఆర్థికసంస్థకు రుణం కోసం సిఫారసు చేస్తుంది ► బ్యాంకుల నుంచి రుణమంజూరు లేఖ అందిన తర్వాత తొలుత ఎన్డీడీబీ, చివరగా డీఏహెచ్డీ ఆమోదముద్ర వేస్తాయి. ► ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ)ను buy@ nddb.coop అనే ఈ మెయిల్ ద్వారా నిర్దేశిత ఫార్మాట్లో సమర్పించాలి. పశుక్షేత్రాల లక్ష్యాలు ► ఆవులు, గేదెల పెంపకంలో ఉత్తమ వ్యాపారవేత్తలను తయారు చేయటం. ► వ్యాధులు లేని, అధిక దిగుబడినిచ్చే దేశవాళి ఆవులు, గేదె జాతుల కోడెదూడలు, తొలిచూరు పడ్డలను అందుబాటులోకి తీసుకురావడం. ► పశుపోషణ, వ్యాధుల నివారణ, శాస్త్రీయ యాజమాన్య పద్ధతులపై అవగాహన పెంపొందించడం. ► ఐవీఎఫ్ సాంకేతికత, విజయవంతమైన వీర్యోత్పత్తి ద్వారా అధిక దిగుబడినిచ్చే పాడి పశువులను ఉత్పత్తి చేయడం. దరఖాస్తు గడువు నవంబర్ 30 రాష్ట్రంలో స్వదేశీ జాతి పశువుల కంటే వ్యాధిరహిత, అధిక దిగుబడినిచ్చే కోడెలు/గర్భిణి కోడెలు/ క్యూలను అందుబాటులో ఉంచే లక్ష్యంతో ఈ క్షేత్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ఏర్పాటుకు ఆసక్తిచూపేవారు ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తు ఫారాలు అనే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం పశుసంవర్ధకశాఖ సహాయ సంచాలకుడు డా.మురళీధర్ని 9985738718/7093360333 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. – ఆర్.అమరేంద్రకుమార్, డైరెక్టర్, పశుసంవర్ధకశాఖ -
గడ్డి భగ్గుమంటోంది..
- పశుగ్రాసానికి పెరిగిన డిమాండ్ - ఎకరా రూ.7 వేలకు చేరిన ఎండుగడ్డి - పక్క జిల్లాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పశుపోషకులు - భారంగా మారిన పశువుల పెంపకం బాపట్లటౌన్, న్యూస్‌లైన్, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది పశుపోషకులకు కష్టం వచ్చిపడింది. ఖరీఫ్ సీజన్లో వరుసగా వచ్చిన తుఫాన్ల కారణంగా పొలాలన్నీ ముంపునకు గురై పైర్లు ఎందుకు పనికిరాకుండా పోయాయి. దీంతో ప్రస్తుతం మండలంలోని రైతులకు పశుగ్రాసం కొరత ఏర్పడింది. గతంలో ఎకరం రూ.1500 నుంచి 2000 ఉండే ఎండుగడ్డి ప్రస్తుతం ఎకరం ఇంటికి చేరా రూ.6500 నుంచి రూ.7000 వరకు ధర పలుకుతోంది. అయినా చేసేది లేక పశుపోషకులు జిల్లాలోని వివిధ మండలాలతో పాటు, పొరుగున ఉన్న కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి కూడా ఎండుగడ్డిని తెచ్చుకోవాల్సి వస్తోంది. గ్రామాల్లో తగ్గిపోతున్న పశుసంపద ఒకప్పుడు పశుసంపద, పాడిపంటలతో గ్రామాలు కళకళలాడేవి. ప్రస్తుతం అతివృష్టి, అనావృష్టిలతో రైతులు నిండా మునిగి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. పశువులను పోషించే స్తోమత లేక ఉన్న పశువులను కూడా కబేళాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా పశువులకు దాణా, తవుడు ధరలు విపరీతంగా పెరగడం, భగ్గుమంటున్న ఎండతీవ్రతకు పొలాల్లో ఎక్కడా పచ్చికమేత లేకపోవడం, ఎండుగడ్డి ధరలు ఆకాశాన్ని అంటడంతో రైతులకు పశుపోషణ భారంగా మారింది. గత రెండు నెలల వ్యవధిలో మండలంలోని జమ్ములపాలెం, కంకటపాలెం, ముత్తాయపాలెం, పిన్నిబోయినవారిపాలెం, గుడిపూడి, అసోదివారిపాలెం, మరుప్రోలువారిపాలెం గ్రామాల నుంచి సుమారు 1000 పశువులను కబేళాకు విక్రయించారు. భారమైనా తప్పనిసరై కొంటున్నాం... నెహ్రూనగర్(మాచర్ల): వరి గడ్డి ధర పెరగడంతో పశువుల పెంపకం రైతుకు భారంగా మారింది. నెల క్రితం వరకు రూ.4 వేల నుంచి 4,500 మధ్య నున్న ట్రాక్టర్ వరి గడ్డి ధర ప్రస్తుతం రూ.5,500కు చేరింది. ఎండలు అధికం అవడం, రానున్నది వర్షాకాలం కావడంతో మేత దొరకడం కష్టం. దీంతో వరిగడ్డికి డిమాండ్ వచ్చింది. ఇంత ధర పెట్టి గడ్డి కొని పశువులను పోషిస్తే మిగిలేది ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయినా తప్పనిసరై ఎక్కువ ధర చెల్లించి గడ్డిని కొని నిల్వ చేసుకుంటున్నారు.