
టమాటోలు, మిరప తోటల్లో కొన్ని మొక్కలు వాడిపోయి, రంగుమారి ఉంటాయి. ఇతర మొక్కలు బాగున్నా ఇవి పసుపుపచ్చగా వడలినట్లు ఉంటాయి. అవి కొన్నాళ్లకు చని పోతాయి. వాటిని పీకి చూస్తే వాటి వేర్లపై బుడిపెల మాదిరిగా ఉంటాయి. అలా ఉండటానికి కారణం నెమటోడ్లు.
నెమటోడ్లు అంటే?
మట్టిలో ఉండే నెమటోడ్లు భయంకరమైన సూక్ష్మక్రిములు. అన్ని రకాల మట్టిలో, వివిధ పంటల వేర్లలో, కలుపులో దాగివుండి కూరగాయలు, మిరప తోటలను నాశనం చేస్తుంటాయి. వీటిని నియంత్రించటం కంటే నివారించటమెంతో సులభం. రసాయనిక పురుగుమందులు వాడటం వల్ల ప్రయోజనం కన్నా కీడు ఎక్కువ జరుగుతుంది. అందుకని వాటి నివారణ ఎలాగో తెలుసుకోవటం అవసరం. వేరుముళ్ల నెమటోడ్లు వేర్లలోకి దూరి బుడిపెలను కలిగిస్తాయి.
మొక్కల వేర్ల ద్వారా పోషకాలను పీల్చుకుంటూ జీవనం సాగిస్తాయి. దీంతో నెమటోడ్లు సోకిన మొక్కలు పోషకాలు అందక మొక్క వాడి΄ోయి, ఎండిపోయి, క్రమంగా చనిపోతుంది. నెమటోడ్లు భూమిలో ఎలా ఎదుగుతాయి? నెమటోడ్లు పలు మొక్కల వేర్లలోను, మట్టిలోను జీవిస్తాయి. వీటిని సూక్ష్మదర్శినిలో మాత్రమే చూడగలం. వేర్ల పక్కనే ఆడ నెమటోడ్ వెయ్యి గుడ్ల వరకు పెడుతుంది. గుడ్లు చాలా చిన్నవిగా ఉంటాయి. గుడ్ల పక్కన ఉన్న వేర్ల నుంచి అనుకూల సూచనలు రాగానే గుడ్ల నుంచి పిల్లలు బయటకు వస్తాయి. వేర్లను చుట్టుకుంటాయి. ఈ చిన్న పురుగులు వేర్లను పొడిచి లోపలికి చేరి, వాటిని తిని కడుపు నింపుకుంటాయి. ఈ క్రమంలో వేర్లకు బుడిపెలు ఏర్పడతాయి. ఆ తర్వాత ఇక మొక్కలకు ఈ వేర్ల ద్వారా పోషకాలు అందవు. దాంతో మొక్కలు కళతప్పి, వాడిపోయి, ఎండి చనిపోతాయి. నెమటోడ్లు అన్ని రకాల మట్టిలోనూ పెరుగుతాయి.
చదవండి: Recirculating aquaculture system ఆధునికి చేపల సాగు
మిరప, కూరగాయ మొక్కల నారును తెచ్చి నాట్లు వేసే ముందు వాటి వేర్లకు ఏమైనా బుడిపెలు ఉన్నాయా అని పరీక్షించాలి. బుడిపెలు ఉన్న మొక్కల్ని నాటకూడదు. మీ పొలం పరిసరాల్లో మొక్కలకు బుడిపెలు ఉన్నాయేమో చూసి, ఉంటే వాటిని నాశనం చెయ్యండి. మొక్కలు నాటడానికి భూమిని సిద్ధం చేసినప్పుడే పాతమొక్కల వేర్లు పూర్తిగా ఏరేసి, మట్టిని ఎండబెట్టాలి. పోయిన ఏడాది మొక్కలకు నెమటోడ్లు సోకిన చోటే పొలంలో తగలబెట్టే అలవాటు కొన్ని ప్రాంతాల రైతుల్లో ఉంది.
నెమటోడ్లను తట్టుకునే ఉపాయాలేమిటి?
నెమటోడ్లు సోకిన టొమాటో, మిరప, కూరగాయ పొలాల్లో పంట మార్పిడి చెయ్యటం మంచిది. ఉల్లి, తోటకూర, తులసి, నిమ్మగడ్డి, కర్రపెండలం, పశుగ్రాస పంటలకు నెమటోడ్లు సోకవని చెబుతున్నారు. కాబట్టి, ఈ పంటలు సాగు చేయవచ్చు. ఆరోగ్యకరమైన నారు పెంచుకోవటం. చేనులో, వాటి దరిదాపుల్లో నెమటోడ్ల మూలాన్ని గుర్తించి నాశనం చెయ్యటం మేలు. నెమటోడ్ నిరోధక శక్తి కలిగిన మొక్కలను తెచ్చి నాటుకొని పండించటం ఉత్తమం. ఇతర చేలల్లో నుంచి నెమటోడ్లతో కూడిన మట్టిని, మొక్కల్ని తేకుండా జాగ్రత్తపడటం అవసరం. నెమటోడ్లతో కూడిన మట్టి నాగళ్లు, ట్రాక్టర్లు, పరికరాలు, కూలీల పాదాలకు, వారి చెప్పులకు కూడా అంటుకొని ఒక పొలం నుంచి వేరే పొలంలోకి వ్యాపిస్తాయి. అందుకని శుభ్రం చేసుకున్న తర్వాతే వారిని పొలాల్లోకి రానివ్వాలి.

నెమటోడ్ల నిరోధకత కలిగిన నారును, విత్తనాలను వాడాలి. నెమటోడ్లు సోకిన పొలంలో మొక్కలు పీకేసి, వాటి వేర్లన్నిటినీ ఏరి, కాల్చివేయాలి. మట్టిని తిరగేసి బాగా ఎండనివ్వాలి. ఆ తర్వాతే వేరే పంట వేసుకోవాలి. ప్రవహించే నీటి ద్వారా చేనులోకి నెమటోడ్లు రాకుండా ఉండేలా చేను సరిహద్దుల్లో నిమ్మగడ్డిని కంచె పంటగా పెంచుకోవటం మేలట. ఈ విషయాలను దక్షిణ బెనిన్ రైతుల అనుభవాలను ఉటంకిస్తూ యాక్సెస్ అగ్రికల్చర్ అనే డిజిటల్ అగ్రికల్చర్ విస్తరణ సంస్థ వీడియోను విడుదల చేసింది.
చదవండి: ట్విన్స్‌కు జన్మనివ్వబోతున్నా.. నా బిడ్డలకు తండ్రి లేడు : నటి భావోద్వేగ పోస్ట్