భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక మన దేశం. ఇందులో అనేక సంస్కృతులు, సంప్రదాయాలు, కళలు కొలువుదీరాయి. వీటిని హైదరాబాద్ నగరవాసులకు తెలియజెప్పేందుకు భాగ్యనగరంలోని రాష్ట్రపతి నిలయంలో గతేడాది నుంచి ‘భారతీయ కళా మహోత్సవ్’ పేరిట ఈశాన్య రాష్ట్రాల వైభవాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా పశ్చిమ రాష్ట్రాల సాహిత్యం, కళలు, చేనేత, నృత్య ప్రదర్శలకు మరోసారి నగరం వేదిక కానుంది. స్వయంగా రాష్ట్రపతి ప్రారంభించే ఈ ఉత్సవం తొమ్మిది రోజుల పాటు సందర్శకులను అలరించనుంది.
దక్షిణాదిలో రాష్ట్రపతి అధికారిక నివాసమైన రాష్ట్రపతి నిలయాన్ని 1860లో నిర్మించారు. 97 ఎకరాల విస్తీర్ణంలోని 16 గదులతో ఎన్నో ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. సెపె్టంబర్ 17, 1948లో తెలంగాణ ప్రాంతం భారత్‌లో విలీనమైన రోజున హైదరాబాద్ రాష్ట్రానికి గవర్నర్‌గా నియమితులైన మిలిటరీ గవర్నర్ మేజర్ జనరల్ జయంతో నాథ్ చౌదరి ఆధ్వర్యంలో తొలిసారి త్రివర్ణ పతాకం ఎగిరింది. అప్పటి నుంచి యేటా శీతాకాల విడిదికి రాష్ట్రపతి ఇక్కడ బసచేస్తారు.
అనంతరం జనవరిలో 15 రోజుల పాటు సందర్శకులను అనుమతిస్తారు. ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సంప్రదాయానికి వీడ్కోలు పలికి 2023 మార్చి 22 నుంచి నిత్యం ప్రజల సందర్శనకు అనుమతిని ప్రారంభించారు. వారాంతాల్లో సాయంత్రం వివిధ ప్రదర్శనలు నిర్వహి స్తారు. గతేడాది సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 6 వరకూ భారతీయ కళా మహోత్సవ్ తొలి ఎడిషన్ నిర్వహించారు. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మణిపూర్, మేఘాలయ, మిజోరామ్, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాల సాంస్కృతిక, కళా వైభవాన్ని ప్రదర్శిస్తున్నారు.ఈ యేడాది ‘పశి్చమ్ కా పరంపర’ పేరిట రెండో ఎడిషన్ ఉత్సవానికి రంగం సిద్ధమైంది.
ప్రదర్శన ఇలా..
రాష్ట్రపతి ప్రారంభించే ఈ ఉత్సవాన్ని పర్యాటక, టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖల సమన్వయంతో సాంస్కృతిక శాఖ నిర్వహిస్తోంది. ఇందులో పశ్చిరాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చేనేత, హస్తకళల ప్రదర్శనలు ఉంటాయి. గుజరాత్ కచ్ బాంధనీ, రాజస్థాన్ పట్టు, కాటన్ చేనేతలు, మహారాష్ట్ర కొల్హాపురి చప్పల్స్, పైతానీ చీరలు, గోవా కుంబీ చీలను ప్రదర్శిస్తారు.
సాహిత్య అకాడమీ అవార్డులు పొందిన కిర్తిడా బ్రహ్మభట్, నయన అదాకార్, సురేశ్ సావంత్, భోగీలాల పటీదార్, ముకుత్ మనిరాజ్, దిలీప్ ఝవేరీ, గ్‌లైనిస్ డయాస్, సుదర్శన్ అథవాలేతో చర్చలు, పుస్తక ప్రదర్శనలు ఉంటాయి.
పశ్చిమ రాష్ట్రాల వంటకాలతో తెలంగాణ వంటకాల ఫుడ్ స్టాల్స్ అందుబాటులో ఉంటాయి. సందర్శకులను వాటర్ బాటిల్స్ మినహా ఇతర తినుబండారాలను లోనికి అనుమతించరు.
నృత్యాల్లో రాజస్థాన్ కాల్ బెలియా, లాల్ అంగీ గెయిర్, మహారాష్ట్ర ధోల్ తాషా, లేజిమ్స్, గుజరాత్ గార్భా, తల్వార్ రాస్, గోవా సమాయి, ఘుమత్ వాదన్, దాద్రా నగర్ హవేలీ భోవడా, డామన్–డయ్యూ, దాద్రానగర్ హవేలీ ప్రాంతాల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి.
(చదవండి: ట్రెండీ అపాలజీ..! సామాజిక మాధ్యమాల్లో సరికొత్త ట్రెండ్..)


