సామాజిక మాధ్యమాల ప్రవేశంతో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ పుట్టుకొస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం మార్కెట్‌లో ఓ సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. ‘అపాలజీ’ పేరుతో పోస్టర్లు రూపొందించి జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్స్ తమ సేవలను ప్రచారం చేస్తున్నాయి. మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా ప్రజల దృష్టిని తక్షణమే ఆకర్షించేందుకు ఈ వినూత్న ప్రయోగాన్ని కార్పొరేట్ సంస్థలు అనుసరిస్తున్నాయి. అయితే దీనికి విపరీతమైన ప్రచారం లభించడంతో సంస్థలు మొదలు సెలబ్రిటీల వరకూ పోస్టర్లు రూపొందించి సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నారు. ప్రతియేటా ఏదో ఒక కొత్త విషయం ట్రెండ్ అవ్వడం సర్వసాధారణమే.. కాగా ఈ యేడాది చివరిలో ఈ కొత్త తరహా ‘క్షమాపణల’ పోస్టర్స్ ట్రెండ్ వైరల్ అవుతోంది.
కొత్త ఒక వింత.. పాత ఒక రోత.. అన్నట్లు.. మార్కెటింగ్ స్ట్రేటజీలో వినియోగదారుల దృష్టిని ఆకర్షించేందుకు కార్పొరేట్స్ ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలను అన్వేషిస్తూ ఉంటాయి. ఇందులో భాగంగా పుట్టుకొచ్చిన ట్రెండే ‘అఫీషియల్ అపాలజీ’. ఎవరైనా తప్పు చేసి సారీ చెప్పడం మామూలే.. అయితే ఏ తప్పూ చేయకున్నా.. సారీ చెప్పడం.. బ్రాండ్ స్టేట్మెంట్‌గా మారుతోంది.. అది కూడా ఆ బ్రాండ్ తరపున ఒక ఫార్మల్ లేఖ రూపంలో క్షమాపణలు కోరుతూ.. ఈ కొత్త ట్రెండ్‌లోనూ హైదరాబాద్ తన ప్రాముఖ్యతను చాటుకుంటోంది.
భాగ్యనగరానికి చెందిన అనేక సంస్థలు, బ్రాండ్స్ సామాజిక మాధ్యమాల్లో తమ పోస్టులతో ఆకిర్షస్తున్నాయి. అయితే ఇది తప్పు చేసినందుకు కాదు.. ఆయా సంస్థలు, బ్రాండ్స్ అందించే మెరుగైన సేవలు, గొప్పతనాన్ని వివరిస్తూ.. ఈ సారీ ట్రెండ్‌ని అనుసరిస్తున్నాయి.
సారీ అంటే సరిపోదు.. నమ్మకం ఉండాలి..
ఈ ట్రెండ్‌ను ఫాలోకావడం సరదాగానే ఉంటుంది.. కానీ, మార్కెటింగ్ విశ్లేషణలో భిన్న ఫలితాలుంటాయనేది నిపుణుల మాట. వాస్తవ సమస్యలు, తప్పిదం జరిగినప్పుడు మాత్రమే సీరియస్ అపాలజీ చెప్పాలి. లేకపోతే ‘సారీ’ అనే పదం విలువను కోల్పోతుందని, వసూళ్ల కోసం వినియోగించడం సరికాదని అంటున్నారు. హైదరాబాద్ వంటి నగరంలో లైఫ్–స్టైల్ వినియోగదారులు దీనిని ఎంజాయ్ చేయాలంటే.. క్రియేటివిటీని ఆస్వాదించినంత వరకే పరిమితం చేసి.. బ్రాండ్ నమ్మకాన్ని కొనసాగించాలని సూచిస్తున్నారు.
ఫిలిప్పీన్స్ టు హైదరాబాద్..
2024లో మధ్య ఫిలిప్పీన్స్‌లో ఒక చిన్న వినోదాత్మక జోక్‌గా మొదలైన ఈ ట్రెండ్ 2025లో ప్రపంచమంతా విస్తరించింది. హైదరాబాద్ సహా మార్కెట్‌లో ఫేమస్ బ్రాండ్స్ ఈ ఐడియాను విస్తృత స్థాయిలో అనుసరిస్తున్నాయి. స్కోడా, వోక్స్ వేగన్, మింత్రా, హల్దీరామ్స్, అదానీ, రిలయన్స్ వంటి కార్పొరేట్స్ ఈ నెలలో (నవంబర్ 2025) ఇలాంటి క్రియేటివ్ పోస్ట్స్ పెట్టి వ్యూహాత్మకంగా సందడి చేస్తున్నాయి. ఈ బ్రాండ్లు వినియోగదారులపై సరదాగా తమ ఎంగేజ్‌మెంట్ టాపప్ చేసుకోవడానికి.. ‘తమ సేవలు బాగా ఉన్నాయనే’ విషయాన్ని రింగ్–బెల్ చేయడానికి ఈ ఫార్మాట్ అనుసరిస్తున్నాయని మార్కెటింగ్ విశ్లేషకులు చెబుతున్నారు.
సీరియస్ వర్సెస్ ఫన్నీ..
అయితే ప్రధాన మీడియా సంస్థల్లో వాస్తవ సందర్భాల్లోని పొరపాట్లకు, నిర్లక్ష్యానికి సంబంధించి నిజమైన అపాలజీ కోరిన సందర్భాలను ప్రజలకు చేరువ చేస్తుంది. ఇలా బ్రాండ్స్‌కు సంబంధించి పలు కేసుల్లో పోలీసులు, కోర్టు చర్యల వరకూ వెళ్లి ప్రజలకు వివరణ ఇవ్వాల్సి వచి్చంది. ఇలాంటి సందర్భాల్లో నిజమైన స్పష్టత, బాధ్యతతో కూడిన అపాలజీ చెప్పడం జరిగింది. దీనికి భిన్నంగా నగరంలోని క్రియేటివ్ ఏజెన్సీలు, రెస్టారెంట్స్, ఫ్యాషన్ డిజైనర్లు ఈ ఫార్మాట్‌ను సరదాగా అడాప్ట్ చేసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఫుడ్ మొదలు ఫ్యాషన్ వరకు..
ఈ ట్రెండ్‌లో హైదరాబాద్ సైతం టాప్‌లో ఉంది. ముఖ్యంగా నగర జీవనశైలిలో యువత వినియోగం, డైన్–అవుట్, ఫుడ్ బ్లాగింగ్ వంటి భిన్న రంగాలను ఈ ట్రెండ్ ప్రభావితం చేస్తోంది. ఫుడ్ షాప్స్ వాళ్ళ ‘బెస్ట్–సెల్లర్’ గురించి ఫన్నీ అపాలజీ పెడితే.. దీనిని యువత తమ క్లోజ్–ఫ్రెండ్స్‌తో షేర్ చేస్తున్నారు. ఫ్యాషన్ బ్రాండ్ వినూత్నంగా ‘సారీ.., మన ఫ్యాషన్ వేర్ కొంటున్నందుకు’ అంటూ సరదాగా పోస్ట్ చేస్తున్నారు.
అయితే ఈ ట్రెండ్ ఒకవైపు హాస్యంతో బ్రాండ్–కనెక్షన్ పెరుగుతోంది. కాగా మరోవైపు దీని అసలు అర్థం మారుతోందని, భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని, ఫలితంగా వినియోగదారులు నమ్మకం కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మా క్రియేటివిటీకి క్షమాపణలు..
ఈ బ్రాండ్ ట్రెండ్‌లో భిన్న రంగాలకు చెందిన సెలబ్రిటీలు సైతం భాగమయ్యారు. ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ వేణు ఉడుగుల నిర్మిస్తున్న తదుపరి చిత్రం రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు సంబంధించిన పాట గురించి ఇలాంటి ఆసక్తికర పోస్ట్‌తో ప్రేక్షకులను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు.
ప్రముఖ సినిమా రంగ సంస్థ టీ–సిరీస్ సైతం ఇలాంటి పోస్ట్‌తో తమ ఫాలోవర్లను ఫన్నీగా ఆకర్షించింది. పలువురు సెబ్రిటీలు, ఫ్యాషన్ డిజైనర్లు, ప్రముఖ చెఫ్‌లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు ఈ ట్రెంటీ పోస్టులతో తమ బ్రాండ్‌ను వినూత్నంగా ప్రచారం చేసుకుంటున్నారు.


