యూట్యూబ్‌లో వేలల్లో వ్యూస్ సొంతం చేసుకుంటున్న నవసందీప్
బంజారాహిల్స్ : కృష్ణానగర్ అంటేనే సినిమా కష్టాలకు, కొత్తగా వేషాల కోసం తిరిగే నటులు, డైరెక్టర్లు, యువ సింగర్లకు కేరాఫ్ అడ్రస్. అలాంటి కృష్ణానగర్ కష్టాలపై ప్రస్తుతం ఓ ఫోక్ సాంగ్ సామాజిక మాధ్యమాల్లో భారీగా ట్రెండ్ అవుతోంది. అంతేకాదు.. వేలల్లో వ్యూస్ పొందుతోంది. అదే ‘దొండకాయ–బెండకాయ’ అంటూ సాగే పాట. అన్నమయ్య జిల్లా వీరబల్లి గ్రామానికి చెందిన నవసందీప్ కృష్ణానగర్ సినిమా కష్టాలపై పాడిన ఫోక్ సాంగ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
తిరుపతిలోని ఎస్వీ మ్యూజిక్ కళాశాలలో సంగీతం కోర్సు చేసి 2018లో సినిమా అవకాశాలు దక్కించుకుని వెండి తెరపై వెలిగిపోవాలని హైదరాబాద్ బాట పట్టాడు. పాటలు పాడడానికి గొంతుంది. రాయడానికి కలం ఉంది.. అయినా అవకాశాలు మాత్రం రాకపోవడంతో తిరిగి వెళ్లిపోదామనుకున్న సమయంలో ఓ హీరోయిన్ తనను ఇటువైపు పురికొలి్పందంటూ చెప్పుకొచ్చాడు. తన అభిమాన హీరోయిన్ల పేర్లను పాటలో జత చేసి కూరగాయలు, చీరలతో పోలి్చన విధానం, పాట పాడిన పద్ధతి శ్రోతలకు వినోదాన్ని పంచుతోంది.


