
ఆక్వాకల్చర్ అంటే చేపలు, రొయ్యలు ఇతర జలజీవులను పెంచటమే. ఇది ప్రపంచంలోనే వేగంగా పెరుగుతున్న ఆహార ఉత్పత్తి విధానం. సముద్రాలలో సహజంగా దొరికే చేపలు తగ్గిపోవటంతో ఆక్వాకల్చర్ ద్వారా మనకు అవసరమైన చేపల్ని అందిస్తున్నారు. ప్రస్తుతం మనం తినే చేపల్లో సగం కంటే ఎక్కువ ఆక్వాకల్చర్ నుంచే వస్తున్నాయి. చెరువుల నుంచి పటిష్టమైన రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్(ఆర్‌ఎఎస్)ల వరకు ఆక్వాకల్చర్ మనకు ఆహార భద్రతను కల్పిస్తూ ప్రకృతిని కూడా కాపాడుతుంది.
ఆర్‌ఎఎస్ సాధారణ చెరువుల కన్నా ఎంతో అధునాతనంగా ఉంటుంది. ఇందులో ఉపయోగించే నీటిలో 90 శాతం వరకు నీటిని శుద్ధి చేసి మళ్లీ వాడతారు. దీంతో తక్కువ నీటితో ఎక్కువ చేపలను ఉత్పత్తి చేయటం సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా నీటి వృథా చాలా తక్కువగా ఉండి, పర్యావరణానికి తోడ్పడుతుంది. ఇది భవిష్యత్తు చేపల సాగుకు ఉత్తమ మార్గం. నార్త్ యూరప్ దేశాల్లో పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా ఆక్వా సాగు చేయించే క్రమంలో ఆర్‌ఎఎస్ తొలుత ప్రారంభమైనప్పటికీ తదనంతర కాలంలో అన్ని ఖండాలకూ ఈ మెరుగైన ఆక్వాసాగు పద్ధతి విస్తరిస్తోంది. అదేవిధంగా మన దేశంలోనూ నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్‌ఎఎస్ పద్ధతిలో చేపల సాగుకు ప్రోత్సాహం ఇస్తుండటం విశేషం.
∙చేపల సాగులో ఆధునిక పోకడ.. రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్స్ (ఆర్‌ఎఎస్-Recirculating aquaculture system)
చేపల సాగుకు చక్కని భవిష్యత్తుకు పర్యావరణహితమైన మార్గం ఇది
అతి తక్కువ నీటి వనరులతో ఆక్వా సాగుతో పాటు అధిక దిగుబడికి దోహదం
5 టన్నుల చేపల ఉత్పత్తి యూనిట్‌కు కనీస పెట్టుబడి రూ. 15–25 లక్షలు
సరైన నిర్వహణ ఉంటే సంవత్సరానికి రూ. 6–8 లక్షల ఆదాయం
మహిళలు, యువతకు 40%–60% వరకు ప్రధాన మంత్రి స్కీమ్ కింద సబ్సిడీలకు అవకాశం
రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్(ఆర్‌ఎఎస్) వ్యవస్థలో అనేక భాగాలున్నాయి. ఇందులో ప్రతి భాగమూ కీలకపాత్ర పోషిస్తాయి.
మొదటిది : కల్చర్ ట్యాంక్. ఇది చేపల పెంచే ప్రధాన నీటి ట్యాంకు. ఇక్కడే పెంపకం జరుగుతుంది.
రెండోది : మెకానికల్ ఫిల్టర్. నీటి నుంచి తుప్పు, చెత్త వంటి ఘనపదార్థాలను తొలగిస్తుంది.
మూడోది : బయో ఫిల్టర్. మంచినీటి జీవక్రియ ద్వారా విషకర నైట్రోజన్ పదార్థాలను తొలగిస్తుంది.
నాలుగోది : యువి లేదా ఓజోన్ యూనిట్. నీటిలో క్రిములు, బ్యాక్టీరియా, వైరస్‌లను నశింప జేస్తుంది.
ఐదోది : సంప్ ట్యాంక్. నీటి ఫిల్టర్ అయిన తర్వాత తాత్కాలికంగా నీటిని నిల్వచేసే ట్యాంక్.
ఆరోది : పంప్. పంపు నీటిని తిరిగి ట్యాంకుకు పంపిస్తుంది.
ఏడోది : ఎయిరేషన్ వ్యవస్థ. ఆక్సిజన్‌ను నీటిలో కలిపి చేపలకు జీవనాయువును అందించేదే ఎయిరేషన్ వ్యవస్థ.
ఈ విధంగా ఆర్‌ఎఎస్‌లో ప్రతి భాగమూ కలిసి పనిచేస్తూ, ఒక సురక్షితమైన పర్యావరణ మిత్రమైన చేపల పెంపక పద్ధతిని అందిస్తాయి.
చేపలు.. కల్చర్ ట్యాంకులో పెరుగుతాయి. వాటి ద్వారా నీటిలో మలినాలు ఏర్పడతాయి. ఈ నీరు ముందుగా మెకానికల్ ఫిల్టర్ ద్వారా వెళ్తుంది. చెత్తను తొలగిస్తుంది. ఆ తర్వాత ఈ నీరు బయో ఫిల్టర్‌లోకి ప్రవహిస్తుంది. ఈ నీటిలో ఉన్న అమ్మోనియా, నైట్రేట్ వంటి విషతుల్యమైన నైట్రోజన్‌ను ఖచ్చితంగా తొలగిస్తుంది. తర్వాత యువి లేదా ఓజోన్ యూనిట్‌కు నీరు వెళ్తుంది. ఇక్కడ నీటిలో ఉన్న సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా వంటివి నశిస్తాయి. ఇలా శుద్ధి అయిన నీరు సంప్ ట్యాంక్‌కు చేరుతుంది. అక్కడి నుంచి పంప్ సాయంతో మళ్లీ కల్చర్ ట్యాంకుకు నీరు వెళ్తుంది. ఈ మొత్తం వ్యవస్థలో ఎయిరేటర్ ద్వారా నీటిలోకి ఆక్సిజన్ కూడా అందజేయబడుతుంది. ఇది చేపల ఆరోగ్యానికి కీలకం.
ఇదీ చదవండి: ట్విన్స్‌కు జన్మనివ్వబోతున్నా.. నా బిడ్డలకు తండ్రి లేడు : నటి భావోద్వేగ పోస్ట్
ఆర్‌ఎఎస్‌లో పెంచతగిన చేపల జాతులు:
తిలాపియా, ఫంగాషియాస్ సీబాస్ (పండుగప్ప) , మారెల్ ట్రౌట్.
ఆర్‌ఎస్ చేపల సాగులో ప్రధాన నీటి ప్రమాణాలు:
1. నీట కరిగిన ఆక్సిజన్ (డిజాల్వ్‌డ్ ఆక్సిజన్). చేపలు పెరిగే ట్యాంకులో లీటరు నీటికి 5 మిల్లీ గ్రాముల కన్నా ఎక్కువగా ఉండాలి. ఇది చేపల శ్వాసకు అవసరం.
2. ఉష్ణోగ్రత: 25 నుంచి 30 డిగ్రీల సెల్షియస్ వరకు మెయింటెయిన్ చేస్తూ ఉండాలి.
3. ఉదజని సూచిక (పిహెచ్): 6.5 నుంచి 8.5 మధ్యలో ఉండాలి.
4. అమ్మోనియా: ఇది లీటరు నీటికి 0.02 మిల్లీగ్రాముల కన్నా తక్కువగా ఉండాలి.
5. నైట్రైట్: ఇది బాగా తక్కువగా ఉండాలి. అంటే, లీటరు నీటికి 0.1 మిల్లీ గ్రాము కంటే తక్కువగా ఉండాలి.
6. టోటల్ సస్పెండెడ్ సాలిడ్స్ (టిఎస్‌ఎస్): ఇది 50 మిల్లీ గ్రాముల కంటే చాలా తక్కువగా ఉండాలి.
7. కార్బన్ డయాక్సయిడ్: ఇది 10 నుంచి 15 మిల్లీగ్రాముల కంటే తక్కువగా ఉండాలి.
ఇవన్నీ సమానంగా మెయింటెయిన్ చేసుకుంటూ ఉంటే ఆర్‌ఎఎస్ సిస్టం సక్రమంగా నడుస్తుంది.
ఆర్‌ఎఎస్‌కు ఎదురవుతున్న సవాళ్లు:
1. ప్రారంభ పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది. చిన్న రైతులకు ఇది చాలా పెద్ద పెట్టుబడి అవుతుంది.
2. ఈ వ్యవస్థ నడిపించడానికి నిపుణుల అవసరం ఉంది. అంటే, శిక్షణ ΄÷ందిన వ్యక్తుల అవసరం చాలా ఎక్కువగానే ఉంది.
3. ఈ వ్యవస్థ ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. ముఖ్యంగా నీటి శుద్ధి, ఆక్సిజన్ సరఫరా కోసం విద్యుత్తు కావాలి.
4. సిస్టమ్ ఫెయిల్యూర్ రిస్క్ ఎక్కువ. పంపులు, ఫిల్టర్‌లు పనిచేయక΄ోతే సిస్టమ్‌లు ఫెయిల్యూర్ అవ్వటం వల్ల రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే, చిన్న పొరపాటుకు పెద్ద నష్టం జరుగుతుందన్నమాట. కాబట్టి, ఆర్‌ఎఎస్ చేపల సాగు ప్రారంభించే ముందు అన్ని అంశాలనూ పరిశీలించాలి.
చేపలతో పాటు కూరగాయలు
ఇంకా ఆక్వాపోనిక్స్ ద్వారా చేపల ఉత్పత్తితో పాటు కూరగాయల సాగు కూడా ఈ వ్యవస్థలో జరుగుతోంది. ఇదొక స్మార్ట్ వ్యవస్థ. దీంట్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధ్యమవుతుంది. ఇది ఎగుమతులకు మార్గం వేస్తుంది. మహిళలు, యువత ఆర్‌ఎఎస్ సాగును సులభంగానే చేపట్టి మంచి ఉపాధి పొందగలుగు తున్నారు.
ఆర్‌ఎఎస్ కేవలం ఆధునిక చేపల చెరువు మాత్రమే కాదు. శుభ్రమైన, స్థిరమైన చేపల పెంపకానికి సంబంధించిన భవిష్యత్తు గల రంగం ఇది. నీటి పొదుపుగా వాడటం, ఆరోగ్యకరమైన చేపలను పెంచటం, ఎక్కువ దిగుబడి పొందటం.. వంటి ప్రయోజనాల రీత్యా పూర్తిగా పర్యావరణ అనుకూలమైన ఆక్వా సాగుగా ఆర్‌ఎఎస్ చేపల సాగును అభివర్ణించవచ్చు.
ఆధునిక టెక్నాలజీ
ఇప్పటి వరకు చేపల సాగు మాదిరిగా ఇది సాంప్రదాయ పద్ధతిలో చేపల పెంపకం కాదు. ఆధునిక సాంకేతికతతో కూడిన స్మార్ట్ వ్యవస్థను వాడుకునే పద్ధతి ఇది. రీసర్క్యులేటరీ ఆక్వా కల్చర్‌లో ఇప్పుడు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఇఓటీ) సెన్సార్లు ఉపయోగించి, నీటి గుణ, నిల్వలపై కంట్రోల్ పెరుగుతుంది. అంటే, మొబైల్ ఫోన్ ద్వారా పిహెచ్, ఆక్సిజన్, టెంపరేచర్ వంటివి మనం చెరువులకు దూరంగా ఉండి కూడా సులువుగా తెలుసుకోవచ్చు.
కనీస పెట్టబడి రూ. 15 లక్షలు
ఒక చిన్న స్థాయి ఆర్‌ఎఎస్ చేపల సాగు యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవాలంటే ముఖ్యంగా గమనించాల్సిన అంశాలు ఇవి.. : టన్నుల సామర్థ్యంతో ఆర్‌ఎఎస్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలంటే దాదాపు రూ. 15 నుంచి 25 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది ∙నిత్యం అయ్యే నిర్వహణ ఖర్చులు, చేపల ఆహారం, విద్యుత్తు, కూలి ఖర్చులు.. ఇలాంటివి ఉంటాయి ∙సరైన నిర్వహణ ఉంటే ఈ వ్యవస్థ ద్వారా సంవత్సరానికి రూ. 6 నుంచి 8 లక్షల ఆదాయం పొందవచ్చు. అంతేకాకుండా ఈ పెట్టుబడిని మూడు నుంచి ఆరు సంవత్సరాల లోపే తిరిగి పొందగలుగుతారు ∙తిలాయిపియా, ఫంగాసియస్, ముర్రెల్, సీబాస్ వంటి చేపలను ఇందులో పెంచుకోవచ్చు. వీటికి మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. ప్రభుత్వ మద్దతుతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త వెలుగుగా మారింది.
ఆర్‌ఎఎస్ ఉపయోగాలు:
ఆర్‌ఎఎస్ చేపల సాగు అంటే సాంకేతికతతో కూడిన భద్రతా వ్యవస్థ. ఇందులో నీటి వాడకం తక్కువగా ఉండటం వలన, అదే నీటిని మళ్లీ మళ్లీ వాడటం వల్ల నీరు పొదుపు అవుతుంది. తక్కువ వనరులతో అధిక ఉత్పాదకత సాధించవచ్చు. అంటే, తక్కువ స్థలంలో ఎక్కువ దిగుబడి. వాతావరణంపై అంతగా ఆధారపడదు. కాబట్టి, ఏ కాలంలో అయినా మనం ఆర్‌ఎఎస్ సాగు చేసుకోవచ్చు. వ్యాధుల నియంత్రణ చాలా సులభంగా చేసుకోవచ్చు. ఎందుకంటే, నీటి నాణ్యతా యాజమాన్యం అంతా మన చేతిలోనే ఉంటుంది. మురుగు నీరు బయటకు పోదు. ఆ విధంగా ఆర్‌ఎఎస్ అనేది పర్యావరణాన్ని కాపాడుతుంది. ఇది భవిష్యత్తులో మరింత విస్తరించే చేపల సాగు వ్యవస్థ.
40%–60% వరకు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ
ఆర్‌ఎఎస్ చేపల సాగు తీర్ర ప్రాంతాల రైతులకు ఇప్పుడు ఉత్తమ అవకాశంగా మారింది. ఎందుకంటే, తీర్ర ప్రాంతపు మట్టి (అంటే లావా మట్టి) ఆర్‌ఎఎస్ స్థాపించడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఇంకా ఫిష్ ఫీడ్ అందుబాటులో ఉండటం, నిపుణుల సహాయం అందుబాటులో ఉండటం వల్ల ఈ సాగు మరింత లాభదాయకంగా మారుతుంది. పిఎంఎంఎస్‌వై అనే కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా రైతులకు ప్రోత్సాహకాలు, శిక్షణ, మార్గదర్శకత అందుతున్నాయి. పెట్టుబడులపై సబ్సిడీలు 40 శాతం నుంచి 60% వరకు లభిస్తున్నాయి. ఇది యువతకు, మహిళలకు, కొత్త రైతులకు గొప్ప అవకాశం. ఈ విధంగా ఆర్‌ఎఎస్ సాగు తీర్ర ప్రాంతాల్లో పరిశ్రమలతో సమానంగా అభివృద్ధి చెందుతోంది. ఇది జీవనోపాధికి, ఆర్థిక అభివృద్ధికి నూతన మార్గాలు చూపుతోంది.