
బంధం ఏదైనా... బంధనం ఏదైనా..ఒకరికొకరం
నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరం నువ్వు, నేను..
మాకు, మీరు, మీకు మేము, ఒకరికొకరం మనమే మనము!
చదవడానికే ఇంత బావుంటే, క్రియారూపంలో ఇంకెంత బావుంటుంది?
ఈ రోజు రాఖీ పండుగ కాబట్టే కాదు, మొన్న అంతర్జాతీయ స్నేహ దినోత్సవం, స్నేహితుల దినోత్సవం, మదర్స్ డే, ఫాదర్స్ డే, దంపతుల దినోత్సవం, బ్రదర్స్ డే, సిస్టర్స్ డే.. వగైరా వగైరాలు జరుపుకుంటూనే ఉంటాం కదా!
ఇవన్నీ ఎందుకు? ఒక రోజుకే సంబంధించిన అంశాలు కావు ఇవి. ఒక రోజంటూ నిర్ధారించుకుని, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని, ఆత్మీయతలను కలబోసుకోవడానికి, రాబోయే రోజులను ఆ అనుబంధాలను భద్రపరచుకోవడానికి, వాటి గాఢతను ప్రోది చేసుకోవడానికి వాడుకుంటాము.
రాఖీ పండుగ గురించి మైథాలజీ చెప్పే కథ ఏదైనా కావచ్చు, ఈ కాలంలో ప్రతి మనిషి ఒకరికి ఒకరు అనుకోవాలి. అనుబంధాలు పలుచన అయిపోతున్నాయి అని అనుకోవడం కాదు, మనం ఆ అనుబంధాలను కొనసాగించడం, నిలుపుకోవడం తెలుసుకోవాలి. ఒకప్పుడు అక్కాచెల్లెళ్ల బాధ్యత అన్నదమ్ములది అనే వారు. ఆడపిల్లను రక్షించడం, బాధ్యతగా చూసుకోవడం, కష్ట సమయాల్లో ఆదుకోవడం అన్నీ అన్నదమ్ముల బాధ్యత. ఈ పరిస్థితి అప్పటి కాలానిది. ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో పరిస్థితులు వేరు. నిజానికి మైథాలజీలోని కథను చూసినా, ద్రౌపది ముందు కృష్ణుడి చేతి వెలి గాయానికి తన చీర చించి కట్టు కట్టింది. ఆ ప్రేమ, ఆ అక్కరకు బద్ధుడైన కృష్ణుడు ఆమెకు రక్షగా ఉంటాను అంటాడు.
ఇదీ చదవండి: పండగ వేళ గుడ్ న్యూస్ : లక్షల టన్నుల బంగారం నిక్షేపాలు, ఎక్కడ?
అసలు ఈ కాలంలో ఒకరికి ఒకరు కట్టుకోవాలి రాఖీ. కష్టంలో, సుఖంలో తోబుట్టువులు ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. అక్కలు, చెల్లెళ్లు అన్నదమ్ముల బాధ్యత మాత్రమే కాదు. అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళ బాధ్యత కూడా. అందుకే ఒకరికి ఒకరు. భారతదేశంలో ముడి అనేది ఒక కనెక్షన్ కి చిహ్నం. ఆ ముడిలో ఒక అనుబంధానికి ఇష్టబంధనం కాబడతామేమో. మా పెళ్లి సమయంలో మా ఆయన మాత్రమే తాళి ఎందుకు కట్టాలి? నేను కూడా ఆయనకు ఒక తాళి కడతాను అని పేచీ పెట్టాను నేను. నా నేస్తాలు నన్ను బ్రతిమాలి ఆపారు. అప్పుడేమిటి? ఇప్పటికీ ఇలాంటి మాటలు మాట్లాడతానని నన్ను రెబెల్ అంటారు. కానీ నేను అనే దాంట్లో తప్పేముంది?
రాఖీ కావచ్చు, ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కావచ్చు, పెళ్లిలో వేసే తాళి కావచ్చు, అన్నీ అనుబంధానికి చిహ్నాలు, ప్రతీకలుగా భావిస్తాము కాబట్టే కదా! ఈ ముడులు లేకపోయినా మానసిక బంధాల విలువ గొప్పది. ఒకరికి ఒకరం చేసుకునే చిన్న చిన్న పనులు గొప్పవి. ఒకరికే బాధ్యత ఆపాదించడం ఈ కాలానికి, భవిష్యత్ కాలానికి కూడా సరికాదు. నాకు ఇష్టమయినవి, నా అవసరాలు నా చెల్లికి, తమ్ముడికి తెలియాలి. వాళ్ళకు ఇష్టమయినవి, వాళ్ళ అవసరాలు నాకు తెలియాలి. అలాగే భార్యాభర్తలు, స్నేహితులు, బంధువులూ.. అందరం.. ఒకరికి ఒకరం అన్నట్టే ఉండాలి.
ఇదీ చదవండి: బుల్లితెర నటి సమీరా ఔదార్యం, బంగారం లాంటి పని
ప్రపంచంతో పరుగుపందెం వేసే ఈ కాలంలో మనతో పాటు మనవాళ్ళూ ఉండాలి. మనం వాళ్ళతో ఉండాలి. చిన్న చిన్న సంతోషాలను, సందర్భాలను పంచుకోవాలి. ఎవరినీ ఎవరూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోకుండా సహాయం, సౌభ్రాతృత్వం చేతులు మారి, జీవితాలను చేరాలి.
అన్నీ కథలే...
ఏ హృదయాన్ని కదిలించినా వ్యధలే...
అన్ని సమపాళ్ళలో జీవన రసాలు ఇపుడసలు లేవు
ఉగాది పచ్చడి రుచులు నిజజీవితాల్లో లేవు
అడగకూడదిక ఎవర్నీ....
నువ్వెలా ఉన్నావని!
కదిలించకూడదిక ఎవర్నీ....
ఏమిటి విశేషాలని!
దీన గాథలను చేతుల్లో మొయ్యని ఆత్మలు లేవు
రెప్పల లోపల ఇసుకను భరించని కళ్ళు లేవు
అన్నీ చప్పటి వెలితికి చిహ్నాలే...
అన్నీ ఉప్పటి నీటికి బానిసలే...
స్పర్శించాలిక అందర్నీ...
కాస్త ధైర్యాన్నివ్వడానికి!
హత్తుకోవాలిక ఆ చూపుల్ని...
వెలుగు ఎంతో దూరం లేదని చెప్పడానికి!
మనం ఒకరికి ఒకరం అని నిబద్ధతగా నిలబడడానికి!!
- విజయభాను కోటే, ప్రభుత్వ ఉపాధ్యాయిని వైజాగ్