
ఒకవైపు కొండెక్కిన బంగారం ధరలు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు..ఈ నేపథ్యంలో బంగారం అన్న మాటకే సామాన్యుడు బెంబేలెత్తే పరిస్థితి. ఇలాంటి స్థితిలో జాక్‌పాట్ లాంటి వార్త. లక్షల టన్నుల బంగారంతో నిండిన భూమి గర్భంలో దాగి ఉన్న నిధి తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఎక్కడ చూసినా సంతోషం వెల్లివిరిస్తోంది. ఇటీవలి కాలంలో ఇది అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణలలో ఒకటి అని భూగర్భ శాస్త్ర, ఖనిజ వనరుల శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించారంటే ఇది ఎంత పెద్ద ఆవిష్కారమో అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ? ఎలా? ఏంటి? తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉంది కదా.. పదండి తెలుసుకుందాం.
100 హెక్టార్ల బంగారం
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలోని సిహోరా తెహసిల్‌లోని మహాగవాన్ కోలారి ప్రాంతంలో భారీ బంగారు నిల్వలు ఉన్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) నిర్ధారించింది. ఒకటి రెండూ కాదు ఏకంగా 100 హెక్టార్ల నిల్వలున్నాయని గుర్తించింది. మహాగవాన్ కియోలారి అంతటా మట్టి నమూనాలను నిర్వహించి, రసాయన విశ్లేషణ ద్వారా బంగారం మాత్రమే కాకుండా, రాగి , ఇతర విలువైన లోహాలు కూడా ఉన్నాయని గుర్తించింది. దీనికి GSI అనేక పరీక్షలను నిర్వహించింది. ఈ క్రమంలోనే ఇక్కడ బంగారం, రాగి, ఇతర విలువైన ఖనిజాల జాడలను వెల్లడించింది. బంగారు నిక్షేపాలు లక్షల టన్నుల వరకు ఉండవచ్చని ప్రాథమిక అంచనా. ఇటీవలి కాలంలో భారతదేశంలో అత్యంత ముఖ్యమైన ఖనిజ ఆవిష్కరణలలో ఇదొకటి అని అధికారులు భావిస్తున్నారు.
ఇదే తొలిసారి కాదు
మధ్యప్రదేశ్‌లో బంగారం కనుగొనబడటం ఇదే మొదటిసారి కాదు. కొన్నేళ్ల క్రితం పొరుగున ఉన్న కట్ని జిల్లాలో బంగారు నిక్షేపాలను గుర్తించారు. కానీ ప్రస్తుతానికి అధికారిక ధృవీకరణ లేదు. అయితే, జబల్పూర్ అన్వేషణ రాష్ట్ర మైనింగ్ చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరతీయనుంది. ఖనిజాలతో నిండిన సంపన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. గత కొన్ని నెలలుగా సాగుతున్న భూగర్భ పరిశోధనలు, శాంపిల్ టెస్టింగ్, లాబ్ అనాలసిస్, ఈ ప్రాంతంలో ఉన్న బంగారం నిక్షేపాలు వాణిజ్యపరంగా తవ్వకాలు జరపడానికి అనుకూలమని నిర్ధారించాయి కూడా. జబల్పూర్ జిల్లాలో ఇప్పటికే 42 గనులనుంచి ఇనుము, మాంగనీస్, లాటరైట్, సున్నపురాయి , సిలిసియా ఇసుకను వెలికితీస్తున్నారు. ఇనుప ఖనిజంలో ఎక్కువ భాగం చైనా వంటి దేశాలకు ఎగుమతి అవుతుంది.