సంక్షేమ, అభివృద్ధి ప్రదాత వైఎస్ జగన్
గత వైఎస్సార్ సీపీ పాలనలో జిల్లా వ్యాప్తంగా రూ.25,436 కోట్ల సంక్షేమం
మేనిఫెస్టోలో ప్రకటించని పథకాలు సైతం అమలు
జననేత మళ్లీ రావాలని సర్వత్రా ఆకాంక్ష
నేడు వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు
సాక్షి, రాజమహేంద్రవరం: ఆ ఐదు వసంతాలు.. రాష్ట్ర సంక్షేమ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించాయి.. పల్లెపల్లెనా ప్రగతి గీతికను ఆలపించాయి.. ‘అన్నా.. నాకీ కష్టం వచ్చింద’ని చెప్పిందే తడవు.. గుండె కరగి.. కళ్లు చెమ్మగిల్లి.. ఆపన్నులకు అండగా నిలిచిన కాలమది. అది సంక్షేమ సారథి.. అభివృద్ధి వారధిగా నిలిచిన జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. పరిపాలనకు మానవత్వాన్ని జోడించిన తరుణమది. 2019కి ముందు.. ‘పచ్చ’పాలకుల తుచ్ఛ విధానాలతో కష్టాల కొలిమిలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌ను అడుగడుగునా స్పృశిస్తూ.. అన్ని వర్గాల ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ.. సుదీర్ఘ పాదయాత్ర సాగించిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్.. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి రాగానే ఆ సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. నవరత్న పథకాలు అమలు చేశారు.
దేశ చరిత్రలోనే మునుపెన్నడూ చూడని రీతిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.వేల కోట్లతో సంక్షేమాన్ని అందించారు. ఫలితంగా నిరుపేద కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. పేదలు, మధ్యతరగతి వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకున్నాయి. అంతకుముందు ఎప్పుడూ లేని విధంగా లక్షలాదిగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. కొత్త పరిశ్రమలకు, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) చేయూతనిచ్చారు. ప్రతి నెలా ఏదో ఒక రూపంలో ప్రజలకు లబ్ధి చేకూర్చారు. ఆ సంక్షేమ, అభివృద్ధి ప్రదాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేక్‌ల కటింగ్‌తో పాటు, సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మళ్లీ ఆ జననేత ముఖ్యమంత్రి కావాలని, ప్రస్తుత పాలకుల హయాంలో ఎదుర్కొంటున్న కష్టాల నుంచి తమను గట్టెక్కించాలని ఆకాంక్షిస్తున్నారు.
ఇదీ సంక్షేమం
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ‘నవరత్నాలు’ పేరిట తొలుత అమ్మ ఒడి, విద్యాదీవెన, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, చేయూత, రుణమాఫీ, పింఛను కానుక తదితర 9 రకాల పథకాలను జగన్ తీసుకొచ్చారు. వాగ్దానం చేసినవే కాకుండా మరిన్ని పథకాలు అమలు చేశారు. తన పాలనా కాలంలో మొత్తం 33 పథకాల ద్వారా జిల్లా ప్రజలకు రూ.25,436 కోట్ల మేర సంక్షేమాన్ని అందించారు.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎక్కడా పైసా లంచం ఇవ్వనవసరం లేకుండానే.. పార్టీ, వర్గం, కులం అనే భేదం చూడకుండా.. కేవలం అర్హతే ప్రామాణికంగా.. వలంటీర్ల ద్వారా గడప వద్దనే సంక్షేమాన్ని అందించారు. వివిధ ధ్రువీకరణ పత్రాల జారీని సైతం సచివాలయాల ద్వారా సులభతరం చేశారు.
సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌ల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన సేవలు అందించారు.
పేద, మధ్యతరగతి ప్రజలకు ఆపద్బాంధవిగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.5 లక్షల నుంచి ఏకంగా రూ.25 లక్షలకు పెంచారు. ఇతర రాష్ట్రాల్లో సైతం చికిత్స పొందే వెసులుబాటు కల్పించారు.
ప్రగతి గురుతులు
పల్లెల ప్రగతికి ఎనలేని తోడ్పాటునందించారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ఆస్పత్రులు, జగనన్న కాలనీలు, సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలకు శాశ్వత భవనాలు రూపుదిద్దుకున్నాయి.మన బడి నాడు – నేడు పథకం ద్వారా 1,069 పాఠశాలల్లో భవనాల నిర్మాణానికి, ఇతర వసతుల కల్పనకు రూ.369.89 కోట్లు వెచ్చించారు. ప్రభుత్వ పాఠశాలల్లో తొలిసారి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. విద్యార్థులకు బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలు, జగనన్న విద్యా కానుక కింద నోట్ పుస్తకాలు, డిక్షనరీలు, షూస్, సాక్స్, బెల్టులు, మంచి బ్యాగ్‌ల వంటి వస్తువులు అందజేశారు.
68,518 మంది పేదల ఇళ్ల నిర్మాణానికి రూ.1,233.34 కోట్లు ఖర్చు చేశారు. 3,079 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు.
336 గ్రామ సచివాలయాలకు రూ.108.47 కోట్లు, 279 రైతు భరోసా కేంద్రాలకు రూ.52.31 కోట్లు, 208 హెల్త్ క్లినిక్‌లకు రూ.38.17 కోట్లు వెచ్చించారు.
గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన 1,443 పనులకు రూ.52.89 కోట్లు ఖర్చు చేశారు.
15,369 చిన్న పరిశ్రమలకు రూ.670.85 కోట్ల మేర రాయితీలు అందజేశారు.
గత టీడీపీ ప్రభుత్వంలో అధ్వానం
2019కి ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు కావాలంటే వారు టీడీపీ వారో లేక ఆ పార్టీ సానుభూతిపరులో అయి ఉండాలి. టీడీపీ నేతలు, జన్మభూమి కమిటీ సభ్యుల సిఫారసు తప్పనిసరి. ఆపై పథకానికి ఇంత అని రేటు నిర్ణయించి మరీ వసూలు చేసేవారు. ఆ తరువాత కూడా అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన దుస్థితి. వారు చెప్పిన మొత్తం ముట్టజెప్పకపోతే పథకం అందేది కాదు.
రూపురేఖలు మారబడి
దేవరపల్లి: దాదాపు 56 ఏళ్ల కిందట దేవరపల్లి మండలం కృష్ణంపాలెంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన పాఠశాలను ఎన్నో ఏళ్లుగా పట్టించుకున్న వారే లేరు. ప్రహరీ లేక అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఉండేది. పాడుబడిన తరగతి గదులు, శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటూ ఉండేవారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన నాడు–నేడు కార్యక్రమం ద్వారా ఈ పాఠశాల రూపురేఖలు మారాయి. దీని అభివృద్ధికి 2022–23లో నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏకంగా రూ.19 లక్షలు మంజూరు చేసింది.
ఈ నిధులతో శిథిల భవనాల మరమ్మతులు, ప్రాంగణం లెవెలింగ్, ప్రహరీ నిర్మాణం, ప్రధాన ద్వారం ఏర్పాటు, విద్యార్థులకు అవసరమైన బెంచీలు, తరగతి గదుల్లో డిజిటల్ బోర్డుల వంటివి ఏర్పాటు చేశారు. అంతకు ముందు పాఠశాలలోని విద్యార్థులందరికీ ఒకే వాష్ రూమ్ ఉండేది. అటువంటిది నాడు–నేడు కార్యక్రమంలో బాలికలకు 7, బాలురకు 6 చొప్పున వాష్ రూములు టైల్స్‌తో నిర్మించి, రన్నింగ్ వాటర్ సౌకర్యం కలి్పంచారు. అప్పటి వరకూ యూపీ స్కూల్‌గా ఉండగా.. దీనిని జెడ్పీ హైసూ్కల్‌గా అప్‌గ్రేడ్ చేశారు. వచ్చే ఏడాది నుంచి ఈ పాఠశాలలో పదో తరగతి అడ్మిషన్లు జరగనున్నాయి.
పాఠశాల బాగుంది
నాడు–నేడు కార్యక్రమానికి ముందు పాఠశాల అధ్వానంగా ఉండేది. శిథిలమై, పెచ్చులూడిన భవనాలతో, మరుగుదొడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడేవాళ్లం. ఇప్పుడు పాఠశాల ఎంతో బాగుంది. ఆటలకు అనువుగా ఉంది.
– మల్లుల ఈశ్వర్ సత్య, 9వ తరగతి, జెడ్పీ హైసూ్కల్, కృష్ణంపాలెం, దేవరపల్లి మండలం



