శ్రమతోనే సక్సెస్‌ | PV Sindhu credits self-belief and hard work for her historic badminton success | Sakshi
Sakshi News home page

శ్రమతోనే సక్సెస్‌

Mar 8 2025 4:35 AM | Updated on Mar 8 2025 4:35 AM

PV Sindhu credits self-belief and hard work for her historic badminton success

– పి.వి. సింధు, క్రీడాకారిణి

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం

పూసర్ల వెంకట సింధు... ఒలింపిక్స్‌లో పతకాలు సాధించింది.
కామన్‌వెల్త్‌... వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లలో స్వర్ణాలు సొంతం చేసుకుంది.
ప్రపంచవేదికల మీద దేశ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసింది.
భారత మాత మెడలో పతకాల హారం వేసి బంగారు సింధు అయింది.
ఈ ఏడాది మహిళాదినోత్సవాన్ని శ్రీమతి సింధుగా వేడుక చేసుకుంటోంది.
సాధికారత దిశగా పయనిస్తున్న మహిళలకు అభినందనలు చెప్పింది.

ఈ తరంలో మహిళలు బిజినెస్, స్పోర్ట్స్‌తోపాటు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. కేవలం తమకు తాము నిలదొక్కుకోవడంతో సరిపెట్టడం లేదు, ఆ రంగంలో నంబర్‌ వన్‌గా నిలవడానికి శ్రమిస్తున్నారు. నంబర్‌ వన్‌ లక్ష్యాన్ని సాధిస్తున్నారు కూడా. ఈ స్ఫూర్తిని, ఇదే పంథాను కొనసాగించాలని అభిలషిస్తున్నాను.  

సక్సెస్‌కు దారి! 
ప్రతి ఒక్కరూ తమ కోసం తాము కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. వాటిని చేరుకోవడానికి తగినంత శ్రమించాలి. సక్సెస్‌ అనే లక్ష్యాన్ని చేరడానికి ఉన్న ఏకైక దారి హార్డ్‌వర్క్‌. హార్డ్‌వర్క్‌తో మాత్రమే విజయానికి చేరువ కాగలుగుతాం. అది కూడా ఒక నెల శ్రమతోనో ఏడాది శ్రమతోనో శిఖరాన్ని చేరాలని ఆశించకూడదు. కొన్నేళ్ల కఠోరశ్రమ, అంకితభావంతో శ్రమించినప్పుడే సక్సెస్‌ మనదవుతుంది. అయితే కొందరికి సక్సెస్‌ కొంత త్వరగా రావచ్చు, మరికొందరికి ఆలస్యం కావచ్చు. మన మీద మనం నమ్మకాన్ని కోల్పోకూడదు. ఆశను వదులుకోకూడదు, నిరాశపడకూడదు. మనం మనవంతుగా శ్రమిస్తూ ఉండాలి. సక్సెస్‌ వచ్చినప్పటి నుంచి మరింత బాధ్యతగా పని చేయాలి. సక్సెస్‌ అనే శిఖరాన్ని చేరాం అని రిలాక్స్‌ కాకూడదు. నంబర్‌ వన్‌కి చేరడానికి నేనలాగే కష్టపడ్డాను, కష్టపడుతూనే ఉంటాను కూడా. 

అమ్మానాన్న... భర్త! 
ఇప్పటి వరకు నన్ను, నా ఆర్థిక వ్యవహారాలను అమ్మానాన్న చూసుకునేవారు. టోర్నమెంట్‌కి తోడుగా నాన్న వచ్చేవారు. ఇప్పుడు మా వారు వస్తున్నారు. నా గురించి అన్నీ వాళ్లే చూసుకుంటారు. నా ఫోకస్‌ అంతా ఆట మీదనే కేంద్రీకరించడానికి తగిన వెసులుబాటునిస్తున్నారు.  

పేరెంట్స్‌ నడిపించాలి! 
దేశానికి కొత్తతరం క్రీడాకారులు తయారు కావాలి. క్రీడాకారులను తయారు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లలకు స్పోర్ట్స్‌ మీద ఆసక్తి ఉన్నప్పటికీ తల్లిదండ్రుల సహకారం లేకపోతే క్రీడాకారులు తయారుకారు. పిల్లలను క్రీడల దిశగా నడిపించడం  పేరెంట్స్‌ చేతిలోనే ఉంటుంది. ఆటలు, చదువు రెండూ కీలకమే. రెండింటినీ ఎలా బాలెన్స్‌ చేసుకోవాలో నేర్పించగలిగింది కూడా పేరెంట్సేనని నా అభి్రపాయం. పేరెంట్స్‌కి కోరిక ఉన్నప్పటికీ పిల్లలకు ఆడాలనే ఆసక్తి లేకపోతే ఆ పిల్లలు దీర్ఘకాలం కొనసాగడం కష్టం. అలాగే ఆటల పట్ల ఆసక్తి ఉన్న పిల్లలకు పేరెంట్స్‌ సహకారం లేకపోతే తొలి అడుగు కూడా పడదు. అందుకే తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యం.

సింధుగానే గుర్తించాలి! 
సమాజం నన్ను సింధుగానే గుర్తించాలి. ‘పీవీ సింధు’ అనగానే చేతిలో రాకెట్‌తో నా రూపం కళ్ల ముందు మెదులుతుంది. అలా నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాను. దేశం కోసం ఆడగలిగే స్థాయికి చేరాను. దేశం కోసం ఆడాను. దేశానికి ఎన్నో పతకాలను సాధించాను. దేశానికి గౌరవాన్ని పెంచడంలో నా శ్రమ కూడా ఉందని సంతోషపడుతున్నాను. ఈ గుర్తింపు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. 

– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Advertisement
 
Advertisement
Advertisement