మోడరన్‌ మెడిసిన్‌ ఇన్‌ డెవిల్లోకాలూ...పిశాచ ప్రపంచాలూ!! | Modern Medicine in the Realms of Devils and the World of Ghouls | Sakshi
Sakshi News home page

మోడరన్‌ మెడిసిన్‌ ఇన్‌ డెవిల్లోకాలూ...పిశాచ ప్రపంచాలూ!!

Jun 26 2026 6:10 AM | Updated on Jun 26 2026 6:10 AM

Modern Medicine in the Realms of Devils and the World of Ghouls

హ్యూమరమరాలు 

అర్ధరాత్రి దాటాక రాంబాబుగాడి రూమ్‌ ముందు నుంచి వెళ్తుంటే వాడేదో రాసుకుంటూ కనిపించాడు. టేబుల్‌ మీద ఏదో ముగ్గులాంటిది వేసి ఉంది. ఆ బల్లమీదే నల్లకోడి బొమ్మా, నాలుగు నిమ్మకాయల్లాంటివేవో ఉన్నాయి. ‘‘ఏంట్రా ఇదంతా?’’ అడిగా. 

‘‘నీకు తెలుసుగా... ఈ మధ్య నేను తాంత్రిక సాధనతో దెయ్యాల లోకంలోకి వెళ్లి... ‘‘దెయ్యాలూ... వాటికొచ్చే జ్వరాలూ – వైద్యవిధానాలు’’ అనే సబ్జెక్టు మీద పరిశోధన చేస్తున్నానని. ఆ థీసీసు రాసుకుంటున్నా’’ అన్నాడు రాంబాబు. 

‘‘ఏం తేలింది నీ అధ్యయనంలో?’’ ‘‘చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిశాయిరా. దెయ్యాలకు జ్వరం గట్రా వచ్చాయనుకో. అక్కడ ‘పారా (నార్మల్‌) సిటమాల్‌’ అనే టాబ్లెట్లు వాడతారు. అన్నట్టు దాని బ్రాండ్‌ ‘డెవిలో–750’ అనేది చాలా ఫేమస్‌ బ్రాండు అక్కడ’’ ‘‘దెయ్యాలకు జ్వరం రావడమేంట్రా?’’ అయోమయంగా అడిగా. 

‘‘ఎందుకు రాదూ. చేత‘బడి’ అనే వాళ్ల నర్సరీ స్కూలెగ్గొట్టి పిల్లదెయ్యాలుగానీ శ్మశానంలో చితిమంటల దగ్గర ఎక్కువ సేపు తిరిగాయనుకో. ఆ ఉష్ణోగ్రత వల్ల దెయ్యపిల్లలకు జ్వరం వస్తుందనేది ప్రేతలోకంలోని ఓ పిచ్చి నమ్మకం. మన దగ్గర వడదెబ్బలాగే... ఈ తరహా జ్వరాన్ని వాళ్లు ‘చితిదెబ్బ’ అని పిలుస్తారు. అక్కడి భూతమాంత్రికులు మాత్రం దీన్ని ‘కాష్ట ఘాతం–ప్రేత పిత్త పైత్య ప్రకోపం’ అంటారు’’ 

‘‘ఇంకా’’ ఆసక్తిగా అనిపించి కాస్త రెట్టించి అడిగా. ‘‘ఇంకా బోల్డన్ని విశేషాలు ఉన్నాయిరా. దెయ్యాల లోకంలో ఈమధ్యే ‘డరోనా’ అనే వైరస్‌ వ్యాపించినప్పుడు దెయ్యాలన్నీ ఈ ‘డెవిలో–750’ని చాలా ఎక్కువగా వాడేశాయి. అన్నట్టు... ఈ టాబ్లెట్లూ గట్రా వాడటానికి మనలోకంలాగే అక్కడ కూడా చాలా రూల్సూ అవీ ఉన్నాయి. 

ఫరెగ్జాంపుల్‌ టాబ్లెట్లు వేసుకునేటప్పుడు గోరువెచ్చని రక్తంతోనే వేసుకోవాలట. మరీ చల్లటి రక్తమైతే జలుబు చేస్తుందేమోనన్నది వాళ్ల భయం. అంతేకాదు... మనలోకంలోలాగే దెయ్యాలకు జలుబు చేస్తే ‘నల్లకోడి చికెన్‌ సూప్‌’ తాగితే తగ్గిపోతుందన్నది భూతలోకంలోని ఓ గట్టి నమ్మకం’’ ‘‘గోరువెచ్చటి రక్తమా? మరి కొంతమంది నీ వేడి రక్తం తాగుతా అంటారు కదా. అలా వేడి వేడి రక్తం అంటూ ఎవరూ తాగరా?’’ అడిగా. 

‘‘ఎందుకు తాగరూ! మనుషుల్ని భయపెట్టడానికి ‘ఊ...ఊ...ఊ... వో...వో...వో’ అంటూ అర్ధరాత్రుళ్లు ఊళలు పెట్టే దెయ్యాలకు గొంతూ అదీ రాసుకుపోయి థ్రోట్‌ ఇన్ఫెక్షన్‌ వచ్చిందనుకో. అప్పుడు మాత్రం దెయ్యాలు కాస్తంత గోరువెచ్చటి రక్తంలో ఉప్పు వేసుకుని పుక్కిలిస్తాయి. డ్రాక్యులా దెయ్యాలు మాత్రం నేరుగా మనుషుల మెడ దగ్గర గాటుపెట్టి వేడి వేడి నెత్తురు పీలుస్తుంటాయి కాబట్టి వాటికి థ్రోట్‌ ఇన్ఫెక్షన్‌ రాదని దెయ్యాల్లో ఓ మూఢనమ్మకం. అయితే వాటి ఆహారపు అలవాట్ల వల్ల వాటికి అనీమియా... అదే రక్తహీనత మాత్రం పెద్దగా వచ్చే అవకాశాలుండవట’’ జవాబిచ్చాడు రాంబాబుగాడు. 

‘‘అంటే... మన దగ్గర డాక్టర్లలాగే దెయ్యాలకూ జ్వరాలూ జబ్బులూ వస్తే వైద్యం చేయడానికి అక్కడా డాక్టర్లుంటారా?’’ అడిగా. ‘‘ఎందుకుండరూ? మన దగ్గర డాక్టర్లను ‘డా. ఫలానాగారూ’ అంటుంటాం కదా. అలాగే అక్కడి డాక్టర్ల పేరు ముందర భూ. అని ఉంటుంది. ఉదాహరణకు ‘భూ. కొరివి ప్రేతానంద్, భూ. డెవిలానంద ప్రసాద్‌’ అంటూ అక్కడి వైద్యుల్ని పిలుస్తారు. మన్దగ్గర డాక్టర్‌ను డా. అన్నట్టే... అక్కడ భూ. అంటే భూతవైద్యుడికి షార్ట్‌ఫామ్‌ అన్నమాట’’ 

‘‘మరి మన దగ్గరలాగే దెయ్యాల లోకంలోనూ నాటువైద్యమూ... మూఢనమ్మకాలూ అవీ ఉంటాయా అక్కడ కూడా?’’ అడిగా. ‘‘ఆ... ఉంటాయి. ఉదాహరణకు మనలోకంలో లాగే వేపమండలూ, నిమ్మకాయలూ, నల్లకోడి నెత్తురూ, నల్లదారాలూ... ఇవంటే దెయ్యాలకు చాలా ఇష్టమనీ, అమావాస్యలాంటి రోజుల్లో వీటిని వాడి చాలా జబ్బుల్ని దూరం చేయవచ్చని దెయ్యాల్లోకంలోని కొందరు భూతమాంత్రికులు నమ్ముతుంటారుగానీ... అక్కడి చాలామంది మోడ్రన్‌ మెడిసిన్‌కు చెందిన వైద్యులు... మరీ ముఖ్యంగా భూ. డెవిలానంద్, భూ. పిశాచేశ్వర్‌ పైశాచిక్‌ లాంటి స్పెషలిస్టులు ‘ఈ భూతమాంత్రికులంతా మూఢనమ్మకాలను ్రపోత్సహిస్తున్నారం’టూ వాళ్లపై బూడిదెత్తిపోస్తుంటారు’’ 

‘‘వీటన్నింటి మీదా రాసిన ఈ థీసీసును ఎవరికి పంపుతావూ, ఎవరు పబ్లిష్‌ చేస్తారురా?’’ అడిగా. ‘‘మన దగ్గర లాగే... అక్కడ దెయ్యాల్లోకంలోనూ ‘ద ట్రూ స్పిరిట్స్‌ ఆఫ్‌ దెయ్యాస్‌ అండ్‌ దెయిర్‌ జెన్యూన్‌ మెడికల్‌ప్రాక్టీసెస్‌’ అనే ఓ మెడికల్‌ జర్నల్‌ ఉంది. మనంగానీ ఓ కాపీ వాళ్లకు ఇచ్చామనుకో. మనుషుల లోకం నుంచీ వాళ్లకు కంట్రిబ్యూట్‌ చేస్తున్న మొదటివ్యక్తిగా నా ఆర్టికల్‌ మీద పసుపూకారాలు చిలకరించి కళ్లకద్దుకొని మరీ పబ్లిష్‌ చేస్తాయవి’’ అంటూ రాతలో లోతుగా మునిగిపోయాడు 
రాంబాబుగాడు. 

– యాసీన్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement