ఆరోగ్యం అంటే ఏమిటి? కండలు తిరిగిన దేహమా? జబ్బుల్లేని జీవితమా? ఎంత తిన్నా లావు కాకపోవడమా? లేక ఎలాంటి చింతా, దిగులు లేకుండా జీవించడమా?..
నిజానికి, ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. అయితే భారతీయ సమాజంలో ఇప్పటికీ మానసిక ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యం దక్కడం లేదు. దేశంలో ప్రతి ఏడుగురిలో ఒకరు ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నప్పటికీ, వారిలో మూడింట ఒక వంతు మంది మాత్రమే నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. "మెంటల్" అనే ముద్ర పడుతుందేమో, నలుగురికి తెలిస్తే పరువు పోతుందేమో అనే భయంతో చాలామంది తమ సమస్యను బయటకు చెప్పడానికే వెనుకాడుతున్నారు.
అయితే ఈ పరిస్థితిలో క్రమంగా మార్పు కనిపిస్తోంది. మణిపాల్ సిగ్నా నిర్వహించిన ఇండియా హెల్త్ కోషెంట్ సర్వే ప్రకారం తొలిసారిగా భారతీయులు శారీరక, మానసిక ఆరోగ్యాలకు దాదాపు సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు. 35 ఏళ్లలోపు వారిలో 54 శాతం మంది మానసిక ఆరోగ్యమే అత్యంత ముఖ్యమని భావిస్తుండగా, 50 ఏళ్లు దాటిన వారిలో 53 శాతం మంది ఇప్పటికీ వ్యాయామం, ఫిట్‌నెస్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.
మెదడు పగిలేంత ఒత్తిడి... కానీ సమస్యే కాదట!
ఈ అధ్యయనం బయటపెట్టిన మరో ఆందోళనకర విషయం భారతీయులు.. స్ట్రెస్‌ను చాలా తేలికగా తీసుకోవడం!. సర్వేలో పాల్గొన్న వారిలో 82 శాతం మంది తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని చెప్పినా, అది తమ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని అంగీకరించింది కేవలం ఒక శాతం మాత్రమే. అంటే ఒత్తిడి ఎంత తీవ్రమైనా, దాన్ని ఆరోగ్య సమస్యగా భావించే అవగాహన ఇంకా చాలామందిలో లేదన్నమాట.
ఆరోగ్యానికి, ఆర్థిక పరిస్థితికి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఆరోగ్య ఖర్చుల భారం చాలామందిలో ఆందోళన (యాంగ్జైటీ)ని పెంచుతుండగా, ఆరోగ్య బీమా ఉన్నవారిలో ఈ ఒత్తిడి కొంత తక్కువగా కనిపించింది.
శారీరక, మానసిక ఆరోగ్యాలను వేర్వేరుగా చూడలేమని, రెండూ ఒకదానిపై మరొకటి ప్రభావం చూపుతాయని మణిపాల్ సిగ్నా సీఈవో జోయ్‌దీప్ సాహా పేర్కొన్నారు. ఈ రెండింటికీ సమాన ప్రాధాన్యం పెరగడం సానుకూల పరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే సవాళ్లు ఇంకా పెద్దవే. దాదాపు 147 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో మానసిక వైద్యుల సంఖ్య పదివేలకు కూడా చేరకపోవడం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది. అయినప్పటికీ, మానసిక ఆరోగ్యంపై అవగాహన క్రమంగా పెరుగుతుండటం మాత్రం ఆశాజనక పరిణామమే.
భారతదేశంలో ఎక్కువగా కనిపించే ఐదు మానసిక సమస్యలు
1. డిప్రెషన్:
సుమారు 4.57 కోట్ల మంది భారతీయులు డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. దేశంలో ఏటా జరిగే దాదాపు 2.5 లక్షల ఆత్మహత్యలకు ఇది ప్రధాన కారణంగా భావిస్తున్నారు. నిరుద్యోగం, లింగ వివక్ష, సామాజిక అసమానతలు, దీర్ఘకాలిక వ్యాధులు వంటి అంశాలు దీనికి కారణమవుతున్నాయి. పురుషుల కంటే మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.
2. యాంగ్జైటీ డిజార్డర్స్:
ఓసీడీ, పీటీఎస్‌డీ, పానిక్ డిజార్డర్, సోషల్ యాంగ్జైటీ, ఫోబియాలు వంటి అనేక సమస్యలు ఈ కోవలోకి వస్తాయి. వీటిని చాలామంది అసలు మానసిక సమస్యలుగానే గుర్తించకపోవడం వల్ల లక్షలాది మంది చికిత్సకు దూరమవుతున్నారు.
3. మద్యం, మత్తు పదార్థాల వ్యసనం:
దేశంలో దాదాపు 16 కోట్ల మంది మద్యం సేవిస్తుండగా, వారిలో 83 లక్షల మంది తీవ్ర వ్యసనపరులుగా ఉన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలను వినియోగించే వారు 3.7 కోట్ల మంది ఉన్నట్లు అంచనా. సుమారు 18 లక్షల మంది చిన్నారులు కూడా వివిధ రకాల మత్తు పదార్థాల బారిన పడటం ఆందోళన కలిగించే విషయం.
4. బైపోలార్ డిజార్డర్:
దేశ జనాభాలో కనీసం రెండు శాతం మంది ఈ సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది. కొంతకాలం అమితమైన ఉత్సాహంతో ఉండటం, ఆ తర్వాత తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడం దీని లక్షణం. సరైన సమయంలో చికిత్స అందకపోతే ఆత్మహత్య ప్రమాదం కూడా పెరుగుతుంది.
5. స్కిజోఫ్రేనియా:
ప్రతి వెయ్యి మందిలో ముగ్గురు ఈ మానసిక సమస్యతో బాధపడుతున్నారు. లేనివి ఉన్నట్లు ఊహించుకోవడం, భ్రాంతులు, ఆలోచనల్లో గందరగోళం, సమాజానికి దూరంగా ఉండడం దీని ప్రధాన లక్షణాలు. పురుషుల్లో ఇది తక్కువ వయసులోనే కనిపించగా, మహిళల్లో గర్భధారణ, ప్రసవం సమయంలో బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మనసు ఆరోగ్యంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మానసిక సమస్యలు కూడా ఇతర అనారోగ్యాల్లాగే వైద్య చికిత్స అవసరమయ్యే పరిస్థితులే. వాటిని దాచిపెట్టడం కాదు, గుర్తించి సరైన సమయంలో నిపుణులను సంప్రదించడమే నిజమైన ఆరోగ్యానికి మొదటి అడుగు.
- గిళియారు గోపాలకృష్ణ మయ్యా


