
భారతదేశం గర్వించే అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్... దేశం కోసం ప్రాణాలర్పించిన జలియన్‌వాలా బాగ్.సైనిక వందనంతో గౌరవించే వాఘా– అట్టారి సరిహద్దు... పంజాబ్ ప్రాణత్యాగాల నిలయం జంగ్ ఈ ఆజాదీ.వ్యర్థాలను అర్థవంతం చేసిన చండీగఢ్ రాక్ గార్డెన్... భగవద్గీత బోధనక్షేత్రం హరియాణా కురుక్షేత్రం.బహాయీ ధ్యానమందిరం ఢిల్లీ లోటస్ టెంపుల్... భారతీయ లోహ ప్రావీణ్యత చిహ్నం ఐరన్ పిల్లర్.కృష్ణుడు పుట్టిన మధుర... ఆడిపాడిన బృందావనం... భారతీయుల ప్రేమ పొందిన ప్రపంచవింత తాజ్‌మహల్. ఉత్తర భారత వారసత్వాన్ని వారంలో ఒడిసి పట్టుకోవచ్చు.
1వ రోజు :
హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం తర్వాత 3.50 గంటలకు 6ఈ 167 విమానం బయలుదేరి సాయంత్రం ఆరున్నరకు అమృత్‌సర్‌కు చేరుతుంది. ఎయిర్‌పోర్ట్‌లో నిర్వహకులు పికప్ చేసుకుంటారు. హోటల్‌లో చెక్ ఇన్ అవడం, విశ్రాంతి, రాత్రి బస.
2వ రోజు :
బ్రేక్‌ఫాస్ట్ తర్వాత అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్, జలియన్‌వాలా బాగ్ సందర్శనం. మధ్యాహ్నం తర్వాత వాఘా బోర్డర్ విజిట్, రాత్రి బస అమృత్‌సర్‌లోనే.
బంగారు మందిరం
గోల్డెన్ టెంపుల్ అనగానే గుర్తొచ్చే ప్రదేశం అమృత్ సర్. ఇటీవల తమిళనాడులో మరో గోల్డెన్ టెంపుల్ నిర్మాణం జరిగింది. కానీ ఇది 443 ఏళ్ల నాటి నిర్మాణం. దేశమెరిగిన బంగారపు మందిరం. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చిన ఆలయం కూడా. సిక్కుల ప్రార్థనామందిరం రాజకీయ సంక్లిష్టతలకు నెలవైంది. ఉగ్రవాద కార్యకలాపాలను నిలువరించే ప్రయత్నంలో భాగంగా ప్రధాని ఇందిరాగాంధీ 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్‌కు ఆదేశాలిచ్చారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఆమె హత్యకు దారి తీశాయి. ఈ గురుద్వారాని రోజుకు లక్షా యాభై వేల మంది సందర్శిస్తారని అంచనా. గురుద్వారా కమిటీ నిర్వహించే లంగార్ (భోజనశాల)లో భోజనం చేయాలి. ఇక్కడో విషయం లంగార్‌లో అందరూ సమానమే.
సహపంక్తి భోజనం చేయాలి. ఎంతమంచి వచ్చినా, కాదనకుండా వడ్డిస్తారు. ఎంత తిన్నా పెడతారు కానీ వడ్డించుకున్న పదార్థాన్ని వృథా చేస్తే ఒప్పుకోరు. పూర్తిగా తినేవరకు ఒకరు వచ్చి ఎదురుగా నిలుచుంటారు. భోజనాన్ని గౌరవించాలనేది వారి నియమం. భోజనంతోపాటు వారి నియమాన్ని కూడా గౌరవించడం పర్యాటకుల ధర్మం. బంగారు గోపురం ఉన్న ప్రధాన ఆలయం సరోవరం మధ్యలో ఉంటుంది.
ఆలయం ప్రధాన ద్వారం నుంచి లోపలికి వంతెన మీద రావాలి. ఈ గురుద్వారా పేరు హర్‌మందిర్ సాహిబ్. ఈ మందిర నిర్మాణాల సమూహం వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు కోసం యునెస్కో పరిశీలనలో ఉంది. ఈ మందిరంలో జాతిరత్నాలు పొదిగిన పై కప్పును కూడా పరిశీలనగా చూడాలి.
బుల్లెట్ గాయాల గోడ
బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ కాల్పులు జరిపినప్పుడు బుల్లెట్‌లు తగిలి చిల్లులు పడిన గోడ ఉంటుంది. ఆ గోడకు 36 బుల్లెట్ గాయాలు ఇప్పటికీ కనిపిస్తాయి. 1919, ఏప్రిల్ నెల 13వ తేదీ, బైశాఖీ పండుగరోజు జరిగిందా దుర్ఘటన. డయ్యర్ భారతీయుల మీద కాల్పులు జరపడానికి ముందు బయటకు వెళ్లడానికి అనుమతించిన చిన్న ద్వారాన్ని కూడా చూడవచ్చు.
ఆ కాల్పుల్లో మరణించిన వారి స్మారక నిర్మాణం, అమర జ్యోతి చుట్టూ దేశం కోసం ప్రాణాలొడ్డిన వారి ముఖాల అమరిక అద్భుతంగా ఉంటుంది. వారిని చూస్తుంటే గుండె బరువెక్కుతుంది. ఆ ఘటనలో మరణించిన వారిలో 120 మంది మృత దేహాలు ఒక బావిలో లభించాయి. ఏడు ఎకరాల ప్రదేశంలో అడుగడుగునా స్వాతంత్య్ర పోరాటంలో చోటు చేసుకున్న మౌనరోదనకు ఆనవాలుగా కనిపిస్తుంది.
వాఘా– అట్టారి సరిహద్దు ద్వారం
భారత్– పాకిస్థాన్‌ల మధ్య సరిహద్దు ఇది. అమృత్ సర్‌నుంచి 30 కిలోమీటర్ల దూరాన ఉంది. వాఘా బోర్డర్ అని వాడుకలో అంటుంటాం. కానీ దీని పేరు వాఘా– అట్టారి బోర్డర్. వాఘా అనే గ్రామం భారత్– పాక్ సరిహద్దు రేఖ రెడ్‌క్లిఫ్ లైన్‌కు ఆవల ఆరు వందల మీటర్ల దూరాన ఉంది. భారత సరిహద్దు గ్రామం అట్టారికి మూడు కిలోమీటర్ల దూరం.
రోజూ సాయంత్రం ఇక్కడ వాఘా– అట్టారి బోర్డర్ సెరిమనీ జరుగుతుంది. 1959 నుంచి రోజూ జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వేలల్లో సందర్శకులు వస్తారు. ఇక్కడి నుంచి అర కిలోమీటరు దూరాన వాఘా రైల్వేస్టేషన్ ఉంది. భారత్– పాక్ మధ్య నడిచే రైలును చూడాలంటే వెళ్లవచ్చు.
3వ రోజు :
బ్రేక్‌ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్ చేసి జలంధర్‌కు ప్రయాణం. జంగ్ ఈ ఆజాదీ మెమోరియల్ సందర్శనం. మధ్యాహ్నం తర్వాత చండీగఢ్‌కు ప్రయాణం. రాక్ గార్డెన్ విజిట్ తర్వాత హోటల్ గదిలో చెక్ ఇన్, రాత్రి బస.
సమర జ్ఞాపకం
జంగ్ ఈ ఆజాదీ అనే ప్రదేశాన్ని చరిత్ర పాఠంలో చదివి మర్చిపోయి ఉంటాం. ఇది స్వాతంత్య్ర సమరంలో కీలకపాత్ర పోషించిన ప్రదేశం. ఈ స్మారక భవనం పంజాబ్ రాష్ట్రం, జలంధర్ నగరానికి సమీపంలో కర్‌తార్‌పూర్ పట్టణంలో ఉంది. భారత స్వాతంత్య్ర సమరంలో పంజాబ్ వాసులు నిర్వహించిన పాత్ర, వారి ప్రాణత్యాగాలకు గౌరవ చిహ్నంగా పదేళ్ల కిందట నిర్మించారు. చరిత్రకారులు, పాత్రికేయులు, మేధావులు సమగ్రంగా అధ్యయనం చేసి దీనికి రూపకల్పన చేశారు.
రాకింగ్ రాక్స్
వేస్ట్ మేనేజ్‌మెంట్ అవసరాన్ని తెలియచేసే ప్రదేశం ఇది. నలభై ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ గార్డెన్‌లో పరిశ్రమల వ్యర్థాలు, ఇంట్లో వాడి పారేసిన వస్తువులతో ఆకర్షణీయమైన కళారూపాలను తయారు చేశారు.
ఇక్కడున్న వాటర్ ఫాల్స్ కూడా మానవ నిర్మితమే. సృజనాత్మకత, ఆచరణాత్మకత ఉంటే ఏ వస్తువూ వ్యర్థం కాదు, వృథాగా పారేయడం ఉండదు. అందమైన కళాఖండం అవుతుందనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది. ఈ గార్డెన్ అంతా తిరిగి చూసి ఇంటికి వచ్చిన తరవాత ఇంట్లో వాడకుండా అటకమీద పెట్టిన వస్తవులకు ఒక రూపమిచ్చే ఆలోచనలు మెదడులో పూస్తాయి.
4వ రోజు :
బ్రేక్‌ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్ చేసి కురుక్షేత్రకు ప్రయాణం. శ్రీ కృష్ణ మ్యూజియం సందర్శనం. మధ్యాహ్నం తర్వాత ఢిల్లీకి ప్రయాణం. హోటల్‌లో చెక్ ఇన్ కావడం, రాత్రి బస ఢిల్లీలో.
గీత బడి కురుక్షేత్రం
శ్రీకృష్ణుడు భగవద్గీత బోధించిన నేల ఇది. కురుక్షేత్ర అనగానే కురు– పాండవుల యుద్ధక్షేత్రంగానే గుర్తొస్తుంది. కురుక్షేత్రలో యుద్ధం జరిగిన ప్రదేశాన్ని స్థానికులు ధర్మక్షేత్రగా చెప్పుకుంటారు. అర్జునుడికి శ్రీకృష్ణుడు గీత బోధించిన ప్రదేశంలో ప్రస్తుతం మ్యూజియం ఉంది. కురుక్షేత్ర పట్టణం హరియాణ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ పర్యాటకులు చూడాల్సిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి.
బ్రహ్మ సరోవర్, జ్యోతిసర్, కురుక్షేత్ర పనోరమ అండ్ సైన్స్ సెంటర్, శ్రీకృష్ణ మ్యూజియం, స్థానేశ్వర్ మహాదేవ్ ఆలయం, భీష్మకుండ్, కర్ణ లేక్, కల్పనా చావ్లా ప్లానిటేరియమ్, సూఫీ సన్యాసి షేక్ చిల్లీ టూంబ్ ముఖ్యమైనవి. ఇతడు మొఘల్ పాలకుడు ఔరంగజేబు సోదరుడు దారాషుకో గురువు. తన ఆధ్మాత్యిక గురువు గౌరవార్థం దారాషుకో దీనిని నిర్మించాడు. ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను ΄ోలిన నిర్మాణం కావడంతో దీనిని హరియాణా తాజ్‌మహల్ అంటారు.
5వ రోజు :
బ్రేక్‌ఫాస్ట్ తర్వాత లోటస్ టెంపుల్, కుతుబ్‌మినార్ విజిట్. సాయంత్రం అక్షరధామ్ దర్శనం. రాత్రి బస ఢిల్లీలోనే.
లోటస్ టెంపుల్
నిశ్శబ్దంమైన ఆలయం ఇది. టెంపుల్ అంటే ఇక్కడ ఏ దేవతా విగ్రహమూ ఉండదు. ధ్యానం చేసుకోవడమే ప్రధానంగా రూపొందిన బహాయీ ప్రార్థన మందిరం. సర్వమానవ సమానత్వం, మానవత్వమే మతం అనే గొప్ప ఆధ్యాత్మిక భావనతో ఏర్పడిన మతం ఇది. బహాఉలాహ్ అనే తత్వవేత్త ఇరాన్‌లో 19వ శతాబ్దంలో రూపొందించిన భావజాలం ఇది. అందుకే దీనికి బహాయి మతంగా పేరు వచ్చింది. అరవిరిసిన కలువపువ్వును తలపిస్తుంది. కాబట్టి లోటస్ టెంపుల్‌గా వ్యవహారంలోకి వచ్చింది. ఇది ఒక నిర్మాణ అద్భుతం. 2500 సీటింగ్ కె΄ాసిటీ ఉన్న విశాలమైన నిర్మాణం. ఎక్కడా పిల్లర్ ఉండదు. మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది. మతాలు, కులాలు, స్థాయీ బేధాలు లేకుండా అందరూ ఒకే వరుసలో వెళ్లాలి. ధ్యానం చేసుకుని బయటకు రావాలి. పర్యాటకులకు ధ్యానం చేసుకోగలిగినంత సమయం ఉండదు. కాబట్టి పది నిమిషాల సేపు కళ్లు మూసుకుని ఆ ఫీలింగ్‌ని ఎక్స్‌పీరియెన్స్ చేసి రావడమే జురుగుతుంది.
ఢిల్లీ పేరిలా వచ్చింది!
కుతుబ్ మినార్‌ను వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది యునెస్కో. ఢిల్లీ శివారులోని మెహ్రౌలీలో ఉంది. లాల్ కోట శిథిలాల మీద నిర్మించిన కట్టడం అని చెబుతారు. ఢిల్లీకి ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పే ఆధారాలు స్పష్టంగా లేవు. కానీ కుతుబ్ మినార్ ఉన్న ప్రదేశంలో లాల్ కోట ఉండేదని, అది ఢిల్లిక రాజ్య రాజధాని అని చెబుతారు. అదే దిల్లీగా వాడుకలోకి వచ్చింది. బ్రిటిష్ ఉచ్చారణలో డిల్లీగా మారింది. కుతుబ్‌మినార్ ప్రాంగణం అంతా తిరిగి చూస్తే ఒక భారీ కోట ఉండేదని నమ్మక తప్పదు.
భారీ ప్రాకారాలు, గోడలు, వాటి నిర్మాణశైలి ప్రాచీనతకు అద్దం పడతాయి. కుతుబ్‌మినార్ కాంప్లెక్స్ ప్రాంగణంలో ఉన్న ఐరన్ పిల్లర్ చారిత్రక ప్రాధాన్యం కలిగినది మాత్రమే కాదు. మనదేశంలో ప్రాచీనకాలంలోనే లోహశాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందిందో తెలియచేసే ప్రత్యక్ష ఉదాహరణ. శతాబ్దాలపాటు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉన్నప్పటికీ ఆ ఐరన్ పిల్లర్‌కి తుప్పు పట్టలేదు. పేరుకు ఐరన్ పిల్లరే కానీ అనేక లోహాల మిశ్రమం. ఏ లోహాన్ని ఎంత మోతాదులో మిశ్రమం చేశారనేది పరిశోధకులకు, శాస్త్రవేత్తలకు కూడా అంతు పట్టడం లేదింకా. గుప్తుల కాలం నాటిది ఈ ఐరన్ పిల్లర్.
అక్షరధామ్
ఇది స్వామి నారాయణ్ ఆలయం. నిర్మాణ అద్భుతాల్లో ఇది కూడా ఒకటి. మొత్తం తిరిగి చూడాలంటే కనీసం మూడు గంటలు పడుతుంది. అభిషేక మండపంలో నీటి చెంబులు వరుసగా ఉంటాయి. టికెట్ తీసుకున్న వాళ్లు వరుసలో వెళ్లి విగ్రహానికి అభిషేకం చేయవచ్చు. ఇది ఢిల్లీలో యమునా నది తీరాన ΄ాండవ నగర్‌లో ఉంది. శిల్పసౌందర్యం చాలా గొప్పగా ఉంటుంది. ఇక్కడ ఇతర ధార్మిక క్రతువులేవీ ఉండవు. దర్శనం, ధ్యానం, ఉల్లాసంగా గడపడమే ప్రధానం.
పిల్లలు ఊయలలూగుతూ ఆడుకోవడానికి ఆటస్థలం కూడా ఉంది. విస్తారమైన గార్డెన్‌లున్నాయి. భారత్ ఉ΄ావన్‌లో స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలున్నాయి. అక్షరధామ్‌లోపలకు స్మార్ట్‌ఫోన్‌లు, కెమెరాలను అనుమతించరు. అయితే బ్యాక్‌డ్రాప్‌లో ఆలయ గోపురం కనిపించేటట్లు ఫొటో పాయింట్ ఉంది. అక్కడ కెమెరామన్ ఉంటాడు. ఈ టూర్ జ్ఞాపకంగా ఒక ఫొటో తీయించుకోవడం మరిచిపోవద్దు.
6వ రోజు :
బ్రేక్‌ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్ చేసి మధురకు ప్రయాణం. శ్రీ కృష్ణ జన్మభూమి సందర్శనం తర్వాత బృందావన వీక్షణం. సాయంత్రం ఆగ్రాకు ప్రయాణం. హోటల్ గదిలో చెక్ ఇన్, రాత్రి బస ఆగ్రాలో.
మధుర మసీదు
మధుర ప్రయాణం ఆసక్తిగా సాగుతుంది. కానీ మధురకు చేరిన తర్వాత కృష్ణుడు పుట్టిన ప్రదేశాన్ని ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదని, భక్తుల విశ్వాసాలకు తగినంత ప్రాధాన్యం పాలకులు ఇవ్వలేదనిపిస్తుంది. ఆలయం లోపల ఒక మందిరంలో రాధాకృష్ణుల పాలరాతి విగ్రహాలు ముచ్చటగా ఉంటాయి. దేవకీవసుదేవులను కంసుడు బంధించి ఉంచినట్లు చెప్పే చెరసాల కూడా ఇక్కడే ఉంది.
భూగర్భంలో నిర్మించిన రాతి గోడల కట్టడంలోకి ఇరుకు మెట్లు దిగి లోపలికి వెళ్లాలి. కృష్ణుడు పుట్టిన ప్రదేశాన్ని కూడా చూడవచ్చు. క్రీస్తు పూర్వం నాటి నిర్మాణాలన్నీ ధ్వంసం అవుతూ, తవ్వకాల్లో బయటపడిన వస్తువులను నిక్షిప్తం చేసుకుంటూ పునర్నిర్మాణమవుతూ వచ్చింది. మొఘలు పాలకుడు ఔరంగజేబు శ్రీకృష్ణుడి జన్మస్థాన భవనాన్ని ఆనుకుని నిర్మించిన పెద్ద మసీదును కూడా చూడవచ్చు.
యమునాతటిలో నల్లనయ్య
బృందావనమది అందరిదీ! గోవిందుడు అందరివాడే... అని ఆడుకోవడానికి ఆడుకోవడానికి అందమైన ప్రదేశం బృందావనం. గోవిందుడు సంచరించిన నేల మీద పర్యటన అనే భావనలోనే ఓ గొప్ప గిలిగింత ఉంటుంది. యమునానది తీరాన విస్తరించిన ఈ నేల మీద ఐదు వేల ఏళ్ల కిందట శ్రీకృష్ణుడు, బలరాముడు అనే పుణ్య పురుషుల బాల్యం గడిచిందని భక్తుల విశ్వాసం.
ఇస్కాన్ నిర్మించిన భారీ ఆలయాలలో పౌరాణిక కథనాల్లో చోటుచేసుకున్న నాటి జ్ఞాపకాలకు నేటి రూపాలను మనం చూడగలుగుతున్నాం. మధుర నుంచి బృందావనానికి 15 కిమీల దూరం. మరో పది కిలోమీటర్ల దూరాన గోకులం ఉంది. విశ్రాంత జీవితంలో ప్రశాంతత కోసం ఇక్కడ కొంత కాలం నివసించవచ్చు. స్థానికులు మాట్లాడేది హిందీయే అయినా ఆ డైలక్ట్ దక్షిణాది వాళ్లు పుస్తకాల్లో నేర్చుకున్న హిందీకి ఏ మాత్రం సరి΄ోలదు. మెల్లగా అలవాటు చేసుకోవాలి.
7వ రోజు :
బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ చెక్ అవుట్. తాజ్ వీక్షణం తర్వాత ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేస్తారు. 16 తేదీ సాయంత్రం 4.40 గంటలకు 6ఈ 6478 విమానం ఆగ్రాలో బయలుదేరి 6. 45 గంటలకు హైదరాబాద్‌కు చేరడంతో టూర్ పూర్తవుతుంది.
భారతీయుల ప్రేమకు చిహ్నం
తాజ్‌మహల్ ను ఎన్నిసార్లు చూసినా మరోసారి చూడవచ్చనిపించే అద్భుతం. ఎంత చెప్పుకున్నా ఇంకా చెప్పుకోవడానికి కొన్ని వివరాలు మిగిలే ఉంటాయి. ఓ పాతికేళ్ల కిందట... ‘తాజ్‌మహల్ గొప్ప నిర్మాణమే కానీ ఫొటోలో కనిపించినంత అందంగా డైరెక్ట్‌గా చూసినప్పుడు కనిపించదు’ అనేవారు. అది నాటి మాట. యూపీలో యమునానది తీరాన ఫ్యాక్టరీలున్నప్పుడు వాటి కాలుష్యం కారణంగా తెల్లటి పాలరాయి పసుపు రంగులోకి మారింది.
ఫ్యాక్టరీలను తొలగించిన తర్వాత ప్రమాదం తగ్గినప్పటికీ దశాబ్దంపాటు తాజ్‌మహల్ పసుపు వర్ణంలోనే ఉండింది. అలాగే ప్రపంచంలోని ఏడు అద్భుతాల్లో స్థానం పొందింది కూడా. యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ (తొలి దఫా) మనదేశంలో పర్యటించడానికి ముందు తాజ్‌మహల్ పాలరాయికి పాలిష్ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి తాజ్ మహల్ తెల్లగా మెరుస్తోంది.
తాజ్ మహల్ 42 ఎకరాల్లో విస్తరించి ఉంది. నాలుగు వైపులా ఉన్న తోటలను పరిశీలనగా చూస్తే చార్‌బాగ్ ఏర్పాటులో మొఘలులు ఎంత నిశితంగా ఉండేవారో అర్థమవుతుంది. మొక్కలు, గుబుర్ల వరుస స్కేలు పెట్టి గీచినట్లు ఉంటుంది. మనకు తాజ్‌మహల్ అంటే ఎంత ప్రేమంటే... 2007లో జరిగిన న్యూ సెవెన్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ పోటీలో తాజ్‌మహల్‌కు ఓట్లేసి గెలిపించుకున్నాం.
ఇది షాజహాన్ ప్రేమకు మాత్రమే కాదు, ఇది భారతీయుల ప్రేమకు కూడా చిహ్నమే. ఇరవై ఏళ్ల పాటు సాగిన ఈ నిర్మాణంలో ప్రతి అంగుళమూ ఓ అద్భుతం. అన్నట్లు ఫొటోలు తీసుకునేటప్పుడు తాజ్ మహల్ ముందు మాత్రమే కాదు, వెనుక వైపు యమునా నది బ్యాక్‌డ్రాప్‌లో ఫొటోలు తీసుకోవడం మరువద్దు. తాజ్‌మహల్‌తోపాటు ఆగ్రాలో చూడాల్సిన ప్రదేశం రెడ్‌ఫోర్ట్. దీనిని ఆగ్రాఫోర్ట్ అంటారు. అక్బర్ ఎక్కువకాలం రాజ్యపాలన చేసింది ఈ ఎర్ర కోట నుంచే.
హైదరాబాద్ నుంచి మొదలయ్యే ఈ ఏడు రోజుల టూర్ పేరు ‘నేషనల్ హెరిటేజ్ ఆఫ్ నార్త్ ఇండియా’,టూర్ కోడ్ ఎస్‌హెచ్‌ఏ 52. సెప్టెంబర్ 10వ తేదీన మొదలయ్యే ఈ పర్యటనలో అమృతసర్, చండీగఢ్, ఢిల్లీ, మధుర, ఆగ్రా కవర్ అవుతాయి.
ప్యాకేజ్ వివరాలకు..
ఐఆర్‌సీటీసీ సికింద్రాబాద్ జోనల్ ఆఫీస్
కాంటాక్ట్ నంబరు: 91 97013 60701
ప్యాకేజ్ ఇలా: సింగిల్ ఆక్యుపెన్సీలో
52,850 రూపాయలు, డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 39,800 అవుతుంది. ట్రిపుల్ ఆక్యుపెన్సీలో 37,300 రూపాయలు.