మన దేహంలో అనేక లవణాలు ఒక సమతులస్థాయిలో ఉండి జీవక్రియలకు దోహదపడుతుంటాయి. అందులో సోడియం, పొటాషియమ్ కీలకం. ఇందులో సోడియం ఉప్పు నుంచి వస్తుందన్న విషయం తెలిసిందే. ఈ మోతాదు పెరిగితే అది అధిక రక్తపోటుకు (హైబీపీకి) దారితీస్తుందన్నదీ చాలా మందికి తెలిసిన విషయమే. అయితే ఈ లవణాల్లో సోడియం బీపీని పెంచితే, పొటాషియమ్ దాన్ని తగ్గిస్తుంది. అందుకే ఉప్పు (సోడియం) తక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గడంతో పాటు గుండె, రక్తనాళాల వ్యాధుల ముప్పు కూడా తగ్గుతుంది అన్న విషయం చాలాకాలంగా తెలుసు. అయితే... ఉప్పు తగ్గించడంతో పాటు పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం బీపీని అదుపులో ఉంచడంలో బాగా తోడ్పడతాయిని ఒక అమెరికన్ అధ్యయనంతో తేలింది.
ఈ అధ్యయనం ‘ద అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్’లో ప్రచురితమైంది. మన దేహంలో సోడియం, పొటాషియం రెండూ కలిసి పనిచేస్తాయి. అయితే చాలామంది ఉప్పు రూపంలో అవసరానికి మించి సోడియం తీసుకుంటుండగా, పొటాషియం మాత్రం సిఫార్సు చేసిన స్థాయిలో తీసుకోవడం లేదు. పొటాషియం తక్కువగా తీసుకోవడం వల్ల సోడియం చేసే హానికర ప్రభావాలు మరింత పెరిగి, రక్తపోటు పెరగడానికి కారణమవుతుంటాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా 128 కోట్లకు పైగా వ్యక్తులు హైబీపీతో బాధపడుతున్నారు. గుండె జబ్బులు, పక్షవాతం (స్ట్రోక్) రావడానికి ప్రధాన కారణాల్లో హైబీపీ ఒకటి.
హైబీపీని అదుపులో ఉంచుకోవడమూ... తద్వారా గుండెజబ్బులూ, పక్షవాతం వంటి వాటిని నివారించుకోడానికి... ఉప్పు తగ్గించడమే కాకుండా, పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని పెంచడంపైనా సమానంగా దృష్టి పెట్టాలంటూ పరిశోధకులు చెబుతున్నారు.
పొటాషియం హైబీపీని ఎలా అదుపు చేస్తుందంటే...
పొటాషియం అన్నది శరీరంలోని అదనపు సోడియంను మూత్రం ద్వారా బయటకు పంపించడంలో సహాయపడుతుంది. అంతేకాదు, రక్తనాళాలను మరింతగా విప్పిపారేలా చేయడం ద్వారా రక్తపోటును తగ్గించడానికీ తోడ్పడుతుంది. పొటాషియం మోతాదులు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల గుండె, రక్తనాళాల ఆరోగ్యమూ బాగుంటుందని అనేక అధ్యయనాల్లో తెలిసింది.
వీటిల్లో పొటాషియం ఎక్కువ...
పాలకూర వంటి తాజా ఆకుకూరలూ, టొమాటో, చిక్కుళ్ల వంటి కాయగూరలు, అరటిపండ్లు, ఆరెంజెస్ వంటి తాజాపండ్లు, పప్పులు, చిక్కుడు జాతి గింజలు, చేపలు, పాల ఉత్పత్తుల్లో పొటాషియమ్ ఎక్కువ. మన ఆహారంలో ఇవి తీసుకోవడం వల్ల పొటాషియమ్ మోతాదులు పెరిగి, సోడియమ్ దుష్ప్రభావాన్ని తగ్గిస్తాయి.
ఇదీ చదవండి: తరచూ గుండెల్లో మంటా..? జీఈఆర్‌డీ కావచ్చు!


