90 డేస్‌ టీ చాలెంజ్‌! ఏం‘టీ’ నిజమా? | Health Benefits Of Not Drinking Tea | Sakshi
Sakshi News home page

90 డేస్‌ టీ చాలెంజ్‌! ఏం‘టీ’ నిజమా?

Jun 27 2026 8:46 AM | Updated on Jun 27 2026 8:46 AM

Health Benefits Of Not Drinking Tea

మైకంలో ముంచేసే టీ నిజంగా ఓ రకమైన డ్రగ్‌..

రోజూ ఉదయం నిద్రలేవగానే గుర్తొచ్చేది తాజా టీ. ఆఫీసు టెన్షన్లు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు, ఇంకేవో గందరగోళాలు.. ఇలా హడావిడిగా సాగే జీవితంలో ఎన్ని అగచాట్లున్నా చక్కని, చిక్కని ఓ టీ కప్పు సిప్పు చేస్తే తప్ప వాటన్నింటికీ పరిష్కారం దొరకదు. మనదేశంలో టీతోనే రోజు మొదలెట్టేవారు కోట్లలో ఉంటారు. భాషాభేదం లేకుండా, నార్త్, సౌత్‌ అనకుండా అందరినీ మమేకం చేసి అదో రకం మైకంలో ముంచేసే టీ నిజంగా ఓ రకం డ్రగ్‌.. అయితే ఇలాంటి టీని ఓ తొంభై రోజులు తాగడం మానేస్తే ఏమవుతుంది?

మొదటివారంలో..
టీలో ఉండే కెఫీన్‌కు శరీరం అలవాటు పడుతుంది. అందుకే ఉన్నట్టుంటి టీ తాగడం మానేస్తే మొదటివారం రోజులు చికాకు, దేనిమీద ఏకాగ్రత లేకపోవడం, తలనొప్పి, నిద్రమత్తు వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరానికి అలవాటైన కెఫీన్‌ ఒక్కసారిగా దూరమైతే వచ్చే ప్రతి స్పందన ఇది.

2–4 వారాల్లో...
టీ తాగడం తగ్గించాక తర్వాత చాలామందిలో రాత్రి పూట తొందరగా నిద్రపట్టడం, మధ్యలో మెలకువలు తగ్గడం వంటి మార్పులు గమనించవచ్చు. అలాగే ఉదయం కూడా తాజాగా నిద్రలేవడం ఉషారుగా ఉండడం జరుగుతుంది. ఈ మార్పులు రాత్రిళ్లు టీ తాగే అలవాటు ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది.

ఆందోళనకి దూరం
టీలోని కెఫీన్‌ శరీరంలో గుండె వేగాన్ని పెంచుతుంది. సాధారణంగా టీ గ్యాప్‌ వస్తే కొందరిలో ఆందోళన కనిపించడం, చేతులు వణుకుతుండడం మనం గమనిస్తూనే ఉంటాం. ఆల్కహాల్‌ అలవాటున్నవారిలో ఈ లక్షణాలు ఇంకా అధికం. గ్యాస్ట్రిక్‌ సమస్యలు, అసిడిటీతో కొందరు ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారు టీ మానేస్తే సగానికి సగం సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే చక్కెర వినియోగం కూడా తగ్గడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

ఏం‘టీ’ నిజమా?
ప్రపంచవ్యాప్తంగా నీరు తర్వాత అత్యధికంగా  తాగే పానీయం టీ.

టీ ఉత్పత్తిలోనూ, వినియోగంలోనూ చైనా తర్వాత భారత్‌ రెండో స్థానంలో ఉంది.

ప్రపంచంలో ప్రతి రోజూ మూడు బిలియన్ల కప్పులకు పైనే టీని తాగేస్తున్నారు.

బ్రిటీషర్లు భారత్‌కి టీ పరిచయం చేస్తే భారతీయులు అందులో పాలు, పంచదార కలిపి కొత్త రూపాన్నిచ్చారు. ఆ తర్వాత ఏలకులు, లవంగాలు, అల్లం కలిపి మసాల టీగా రూపాంతరం చెందింది.

ఎంతోప్రాచుర్యం పొందిన టీ పుట్టిన ప్రదేశం మాత్రం చైనానే. క్రీస్తు పూర్వం 2737లో అప్పటి ప్రజలు తొలిసారిగా టీ రుచి చూశారు.

వైట్‌ టీ తెలుసా?
బ్లాక్‌ టీ, గ్రీన్‌ టీ, హెర్బల్‌ టీ గురించి విన్నాం. మనలో చాలామంది వాటిని రుచి చూశాం కాని వైట్‌ టీ ఏంటి? అనుకుంటున్నారా? ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ పొడి. అత్యంత స్వచ్ఛమైన సహజమైన టీ రకాలలో ఈ వైట్‌ టీ ఒకటి. ఈ టీ పొడి కోసం కేమెలియా సినెన్సిస్‌ అనే మొక్కకు వచ్చే లేత మొగ్గలను, చిన్న ఆకులను మాత్రమే కోస్తారు. దీని డికాషన్‌ ముదురు రంగులో కాకుండా చాలా తేలికపాటి పసుపు లేదా వెండి రంగులో ఉంటుంది. రుచి కూడా కాస్త తియ్యగా పూల వాసనతో ఉంటుంది. కేవలం వసంత కాలంలో మాత్రమే దొరికే ఈ టీ ఆకులను చాలా జాగ్రత్తగా కోసి ప్రాసెస్‌ చేస్తారు. రకాన్ని బట్టి దీని రేటు కిలోకి ఐదు వేల నుంచి నాణ్యతను బట్టి లక్షల రూపాయల వరకు ఉంటుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement