breaking news
Daily Life
-
కరోనా ఎఫెక్ట్: అన్ని రంగాలు అతలాకుతలం
సాక్షి, కర్ణాటక: కరోనా మహమ్మారి ఆరోగ్యం, ఆర్థిక, ఉద్యోగ రంగాలపైనే కాకుండా నిత్యజీవనంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశ ఆర్థిక వ్యవస్ధ కూడా కరోనా ప్రభావంతో అతలాకుతలం కావడంతో నిత్యావసర వస్తువుల కొరత డిమాండ్ ఏర్పడింది. రెండునెలల లాక్డౌన్ అవధిలో చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఉత్పత్తులు, విదేశీ వస్తువులు ఉత్పత్తులు నిలిచిపోవడంతో ప్రస్తుతం ప్రజలే స్వయంగా ప్రకటించిన స్వయంలాక్డౌన్తో గృహ వినియోగ వస్తువులు కొరత తారస్థాయికి చేరుకుంది. దీని ప్రభావంతో ధరలు పెరిగే అవకాశం కూడా ఎదురుకానుంది. ప్రధానంగా ఎల్రక్టానిక్ వస్తువులు, ఇళ్లలో నిత్యం వినియోగించే స్టీల్ వస్తువులైన తట్ట, గ్లాసులు, చిన్నపిల్లలు ఆడుకునే సామాగ్రి, ఇంటి అలంకరణ వస్తువుల ఉత్పత్తి నిలిచిపోయింది. కాఫీ, టీ, జ్యూస్ వంటి ఉత్పత్తి పడిపోయింది. కరోనా ప్రభావంతో కార్మికుల కొరత ఉత్పత్తి చేసిన వస్తువుల రవాణా సమస్య, డిమాండ్ పడిపోవడం, ఉత్పత్తి వ్యయం పెరగడం తదితర ఇబ్బందులను ఎదుర్కొంటున్న పారిశ్రామిక రంగం పూర్తిగా చతికిలపడిపోయింది. 90 శాతం పరిశ్రమలు ప్రస్తుతం ప్రారంభమైన పూర్తిస్థాయిలో ఉత్పత్తులు ప్రారంభించలేదు. వలసకార్మికులు సొంత ఊర్లకు చేరుకోవడంతో కార్మికుల కొరత ముడిసరుకుల కొరత అధికంగా ఉండటంతో ఉత్పత్తి నిలిచిపోయింది. డిసెంబర్ వరకు పరిశ్రమలు కోలుకోవడం అనుమానమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్వయం లాక్‌డౌన్‌తో రాష్ట్రంలో ప్రముఖ మార్కెట్లైన బెంగళూరు చిక్కపేటే హోల్సేల్మార్కెట్, కేఆర్.మార్కెట్, మల్లేశ్వరం, యశవంతపుర, మంగళూరు స్టేట్‌బ్యాంక్, దావణగెరె కాటన్ బజార్, మైసూరు, బీదర్, హుబ్లీ–ధారవాడ, హావేరి,శివమొగ్గ, కొడగు, బళ్లారి, హాసన, కొడగు, చిక్కమగళూరు, కారవార తదితర మార్కెట్లు మధ్యాహ్నం వరకు వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. చదవండి: కరోనా ఎఫెక్ట్: 14కోట్ల ఉద్యోగాలపై వేటు బెంగళూరులో సీల్‌డౌన్ చేసిన ఓ ప్రధాన రహదారి మళ్లీ కొన్ని మార్కెట్లను పూర్తిగా బంద్ చేశారు. దీంతో ఉత్పత్తులు రవాణాకు ఇబ్బంది తలెత్తింది. మార్కెట్లను తాత్కాలిక అవధిలో మూసివేయడంతో నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడింది. దీంతో వ్యాపారాలు పడిపోగా వస్తువుల ఉత్పత్తిచేసే కంపెనీలు, పరిశ్రమలకు ఆర్డర్లు దక్కడంలేదు. ఉత్పత్తి పడిపోయిన సమయంలో ఒకేసారి అకస్మాత్తుగా మార్కెట్ల వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించి డిమాండ్ పెంచితే సరఫరా లేక నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏయే వస్తువుల కొరత హార్డ్‌వేర్ ఉత్పత్తులైన ఎలక్ట్రిక్ సామగ్రి ప్రత్యేక దుస్తులు, పాదరక్షలు, షూ, గొడుగులు, దోమల బ్యాట్, ఆటసామగ్రి, బెల్ట్ వివిధ రకాల గాజులు, తాగునీటి బాటిల్స్, లోహపు పింగాణిప్లేట్లు, మహిళలు, పురుషుల బ్యాగులు, ఇంటి అలంకరణ వస్తువులు, స్వచ్ఛతా సామగ్రి, జ్యూస్, కాఫీ, టీ, సాంబారు పొడి వంటివి కొరత ఏర్పడనుంది. రాష్ట్రంలో కొన్నిచోట్ల లాక్డౌన్, సీల్‌డౌన్, కంటైన్మెంట్ అమల్లో ఉండటంతో పరిశ్రమలు మూసివేశారు. ట్రేడర్స్ దుకాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎలాంటి వ్యాపారాలు జరగడంలేదు. రానున్న రోజుల్లో అన్ని వస్తువుల కొరత ఏర్పడుతుంది. దీంతో ప్రజలు, పారిశ్రామిక, ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బంది తలెత్తనుండగా చికిత్సకు డబ్బుల్లేని పరిస్థితి ఏర్పడవచ్చునని ఎఫ్‌కేసీసీఐ అధ్యక్షుడు సీఆర్.జనార్దన్ తెలిపారు. కర్ణాటకతో పాటు దక్షిణ భారతదేశంలో చిన్న మధ్యతరహా పరిశ్రమల్లో 20 శాతం ఆర్థిక సమస్యతో మూసివేశారు. ప్రస్తుతం బెంగళూరు, మైసూరు, బెళగావి, విజయపుర, హుబ్లీ లాంటి పెద్ద మార్కెట్లు కరోనాతో బంద్ కావడంతో పరిశ్రమల ఉత్పత్తులకు డిమాండ్ లేదు. పూర్తిస్థాయిలో ఉత్పత్తులు నిలిపివేస్తే ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని కర్ణాటక చిన్న తరహా పరిశ్రమల సంఘం అధ్యక్షుడు కేబీ.అరసప్ప తెలిపారు. స్మార్ట్ఫోన్లు, టీవీల కొరత దేశానికి 75 శాతం టీవీలు, 85 శాతం స్మార్ట్ఫోన్లు చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి. అంతేగాక ఎయిర్కండీషనర్ యంత్రాలు, వాషింగ్‌మెషిన్, ఎలక్ట్రిక్ వస్తువులు, గృహ వినియోగవస్తువులు బయటి దేశాలనుంచి దిగుమతి అయ్యేవి. కరోనా నేపథ్యంలో వీటి దిగుమతి ప్రస్తుతం పూర్తిగా స్తంభించిపోయింది. తుమకూరు బస్టాండ్‌లో ప్రయాణికులు లేని దృశ్యం బస్టాండ్లలో వ్యాపారాలు వెలవెల కరోనా ఎఫెక్ట్‌తో ఆర్టీసీ సర్వీసులు అరకొరగా నడుస్తున్నాయి. బస్సుల్లో ప్రయాణించేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపడం లేదు. దీంతో గతంలో నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడే బస్టాండ్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. ఇక బస్టాండ్లలో దుకాణాలు లీజుకు తీసుకొని వ్యాపారాలు చేస్తున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వ్యాపారాలు లేకపోవడంతో నష్టాలపాలవుతున్నారు. అధిక అద్దెలు చెల్లించలేక దుకాణాలు మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. నాలుగు నెలల నుంచి ఎలాంటి వ్యాపారం లేకపోగా మరో మూడు నాలుగు నెలల వరకు వ్యాపారాలు జరిగే అవకాశం లేదని తుమకూరు బస్టాండ్‌లోని దుకాణదారులు వాపోయారు. -
కలలో... మళ్లీ బడికి!
ఎక్కువమందికి వచ్చే కలలలో ‘స్కూలు కల’ ఒకటి.ఆ కలలో మన చిన్నప్పటి రూపమే కనిపిస్తుంది. చిన్నప్పటి స్కూలే కనిపిస్తుంది. అయితే సహ విద్యార్థులు, ఉపాధ్యాయులు మాత్రం ఎప్పుడూ చూడనివాళ్లు కనిపిస్తారు. మరి ఈ కల ఉద్దేశం ఏమిటి? అపురూప జ్ఞాపకాల్లో కొన్ని మళ్లీ మళ్లీ గుర్తుకు వచ్చి కలల రూపంలో దర్శనమిస్తాయి. ‘స్కూలు’ అనేది అపురూప జ్ఞాపకాల్లో ఒకటైనప్పటికీ... కలలో కనిపించే స్కూలు కేవలం దానికి మాత్రమే పరిమితమైనది కాదు. ఆ కలకు విస్తృతార్థాలు ఉన్నాయి.ఒకే ఒక ముక్కలో చెప్పాలంటే, ‘స్కూలు’ అనేది మన నిత్యజీవిత వ్యవహారాలను ప్రతిబింబించే వేదిక. స్కూలుకు లేటయిందని, వేగంగా పరుగెత్తుకు వస్తుంటాం... టీచర్ తిడుతుందేమో అనే భయం దారి పొడుగున వెన్నంటే ఉంటుంది. ఇక్కడ ‘ఆలస్యం’ అనేది అనేక విషయాలను సూచిస్తుంది. స్కూలు అనేది ఒక లక్ష్యం అనుకుంటే, ఆలస్యం కావడం అనేది... లక్ష్య సాధనలో జరిగే జాప్యాన్ని, అసహనాన్ని సూచిస్తుంది. చాలా కష్టపడి చదివినప్పటికీ... పరీక్షలో ఫెయిలయ్యి టీచర్ల చేత తిట్టించుకున్నట్లుగా కల వస్తుంది కొన్నిసార్లు.‘‘సార్... నేను చాలా కష్టపడి చదివాను’’ అంటామో లేదో పిల్లలందరూ ఎగతాళిగా నవ్వుతుంటారు.ఒక పనిని చాలా కష్టపడి, చిత్తశుద్ధితో చేసినప్పటికీ సరియైన ఫలితం కొన్నిసార్లు చేతికందదు. ప్రయత్న లోపం లేకపోయినప్పటికీ ఫలితం చేతికి అందకపోవడాన్ని సూచించే కల ఇది. క్లాసు జరుగుతుంటే, వెనుక బెంచీలో కూర్చొని నిద్ర పోతున్నట్లు కూడా కొన్నిసార్లు కల వస్తుంది. ఏది జరిగినా... పట్టించుకోకుండా, ఎంత మాత్రం స్పందన లేకుండా ఉండే పరిస్థితిని ఇది ప్రతిబింబిస్తుంది. నిత్య జీవితంలో చోటు చేసుకునే... రకరకాల సంఘటనలు కావచ్చు, భావోద్వేగాలు కావచ్చు... స్కూలుకు సంబంధించిన జ్ఞాపకాలతో మిళితమై కలలుగా వస్తుంటాయి.