రూ.25... 24 ఏళ్లు! | A Funday Legal Crime Story Written By Dileep Madireddy | Sakshi
Sakshi News home page

రూ.25... 24 ఏళ్లు!

Jun 28 2026 1:31 PM | Updated on Jun 28 2026 1:31 PM

A Funday Legal Crime Story Written By Dileep Madireddy

లీగలాటా

రూ. వందల కోట్లు లేవు; బంగారం కుప్పలు, బినామీ ఆస్తులు, విదేశీ మద్యం సీసాలు లేవు; వందల ఎకరాల భూములూ లేవు. రూ. 25 లంచం కేసు. తాను హక్కుగా పొందాల్సిన సేవకు లంచం ఎందుకు ఇవ్వాలనే ఓ సగటు ఉద్యోగి ప్రతిఘటన. ఓ డాక్టర్‌ను సీబీఐకి పట్టించింది. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిప్పింది. మానసిక వేదనకు గురి చేసింది. అయితే ఎంత లంచం తీసుకున్నారని కాదు. నేరానికి శిక్ష తప్పదని ఈ కేసు రుజువు చేసింది. ఈ కేసు పూర్తవ్వడానికి మాత్రం 24 ఏళ్లు పట్టింది.

రమేష్‌రామ్‌ అనే ఓ వ్యక్తి ఈస్ట్రన్‌ రైల్వేలో స్వీపర్‌గా పట్నాలోని మహేంద్రఘాట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. 1985 జనవరి 8న అనారోగ్యానికి గురవ్వడంతో రైల్వే ఉద్యోగులకు ఉచితంగా సేవలు అందించే డిస్పెన్సరీకి వెళ్లాడు. అక్కడ డాక్టర్‌ బాల్‌గోవింద్‌ ప్రసాద్‌ పట్నా డివిజనల్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.

రమేష్‌రామ్‌ ఆ డాక్టర్‌ను సంప్రదించి వైద్య సేవలు పొందాడు. మందులతో పాటు సిక్‌ లీవ్‌ మెమోను డాక్టర్‌ ఇచ్చాడు. ఆరోగ్యం కుదుటపడకపోవడంతో మరోసారి వైద్యుడ్ని కలిసి మందులు తీసుకున్నాడు. సిక్‌ లీవ్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలని కోరాడు. దానికి డాక్టర్‌  రూ. 25 లంచం డిమాండ్‌ చేశాడు.

సీబీఐకి ఫిర్యాదు
‘నాకు ఆరోగ్యం బాగోలేదు. వైద్య సేవలతో పాటు సిక్‌ లీవ్‌ సర్టిఫికెట్‌ పొందే హక్కుంది’ అని రమేష్‌ భావించాడు. అందువల్ల లంచం ఇవ్వడానికి ఇష్టపడలేదు. దాంతో అదే రోజు సీబీఐ కార్యాలయానికి వెళ్లి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దీనిపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తు చేసి ఫిర్యాదు వాస్తవమేనని ధ్రువీకరించింది. డాక్టర్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా  పట్టుకునేందుకు వల పన్నింది. ఫినాప్తిలిన్‌ పూసిన కరెన్సీ నోట్లను ఫిర్యాదుదారుకు అందజేసింది. ‘డబ్బులు డిమాండ్‌ చేసినప్పుడు మాత్రమే ఇవ్వాలని, డిమాండ్‌ చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు ఇవ్వకూడద’ని రమేష్‌రామ్‌ను సీబీఐ హెచ్చరించి పంపింది. ఫిర్యాదుదారు నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత సీబీఐ బృందం డాక్టర్‌ను పట్టుకుంది.

ట్రయల్‌ కోర్టులో విచారణ
1986లో ట్రయల్‌ కోర్టులో విచారణ మొదలైంది. ‘తనపై మోపిన అభియోగాలు పూర్తి అవాస్తవమని, తన పదవిపై కన్నేసిన కొంతమంది ఈ కేసులో తనను అక్రమంగా ఇరికించారని, పూర్తి విచారణ జరిపి తనను నిర్దోషిగా ప్రకటించాలని డాక్టర్‌ కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. ప్రాసిక్యూషన్‌ తన వాదనకు మద్దతుగా పలు పత్రాలు, వస్తువులను సాక్ష్యాధారాలుగా కోర్టు ముందుంచింది. మొత్తం 19మంది సాక్షులను విచారించారు.

అనంతరం డాక్టర్‌ బాల్‌గోవింద్‌ ప్రసాద్‌ను దోషిగా కోర్టు నిర్ధారించింది. ఐపీసీ సెక్షన్‌ 161 కింద ఏడాది, అవినీతి నిరోధక చట్టం కింద మరో ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ.1000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే మరో మూడు నెలలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది.

ట్రయల్‌ కోర్టు తీర్పుపై హైకోర్టుకు..
శిక్షను రద్దు చేయాలని డాక్టర్‌ బాల్‌గోవింద్‌ ప్రసాద్‌ హైకోర్టును ఆశ్రయించారు. సాక్ష్యాధారాల్లో అనేక వైరుధ్యాలున్నాయని, సహేతుకమైన సందేహాలకు అతీతంగా అవి ఉన్నందున దోషిగా నిర్ధారించడానికి అవి సరిపోవని అప్పిలెంట్‌ తరపు న్యాయవాది వాదించారు.

ఈ కేసు కారణంగా కొంతకాలం సస్పెండై, పదోన్నతులు కోల్పోయి, తర్వాత రిటైర్‌ అయ్యాడని, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ కూడా పూర్తిగా అందలేదని న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. నిర్దోషిగా ప్రకటించాలని కోరారు. అతని వయసు 75 సంవత్సరాలని పేర్కొన్నారు. ఒకవేళ నేరం రుజువైందని కోర్టు భావిస్తే ప్రత్యేక పరిస్థితుల్లో శిక్షా కాలాన్ని తగ్గించాలని కోర్టును అభ్యర్థించారు. ప్రభుత్వ ఉద్యోగి అధికారికంగా ఓ పని చేయడానికి లేదా చేయకుండా ఉండడానికి విలువైన వస్తువును స్వీకరించడం, లంచం డిమాండ్‌ చేయడం, తీసుకోవడం ఇలాంటి కేసుల్లో ముఖ్యమని సీబీఐ న్యాయవాది వాదించారు. ఇవన్నీ ఈ కేసులో రుజువయ్యాయని కోర్టు దృష్టికి తెచ్చారు.

హైకోర్టు తీర్పు
విచారణ అనంతరం 24 ఏళ్ల తర్వాత హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. ఈ కేసును ప్రాసిక్యూషన్‌ సాక్ష్యాధారాలతో నిరూపించిందని పేర్కొంది. ఇవన్నీ అప్పిలెంట్‌ను దోషిగా నిరూపిస్తున్నాయని కోర్టు తేల్చింది. ట్రయల్‌ కోర్టు తీర్పు కొనసాగుతుందని పేర్కొంది. నిందితుడి వయస్సు అప్పటికే 75 సంవత్సరాలు ఉండడం, కేసు సుదీర్ఘకాలం నడవడం తదితర కారణాలను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఐపీసీ సెక్షన్‌ 161 కింద దోషిగా తేలినా ఎటువంటి అదనపు శిక్ష విధించలేదు. మిగిలిన మరో ఏడాది శిక్షా కాలాన్ని మూడు నెలలకు తగ్గించింది. జరిమానాను రూ. 1000 నుంచి రూ. 2000కు పెంచుతూ తుది ఉత్తర్వులు జారీ చేసింది. - దిలీప్‌ మాదిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement