సందర్భం
శుభా వెంకటేష్ అయ్యంగార్ పెద్దగా మాట్లాడడం ఎవరూ పెద్దగా చూడలేదు. నిశ్శబ్దంగా తన పని తాను చేసుకొని పోవడం చిన్నప్పటి నుంచి ఆమె అలవాటు. భౌతికశాస్త్రంలో ఎన్నో బంగారు పతకాలు సాధించిన అయ్యంగార్ స్ఫూర్తిదాయకమైన సైంటిస్ట్ స్థాయికి ఎదిగారు. ‘దృష్టి’ పేరుతో ఎయిర్‌పోర్ట్ వెదర్, రన్‌వే విజిబిలిటీ సిస్టమ్‌ను అభివృద్ధి చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న శుభా అయ్యంగార్ గురించి...
నాలుగు దశాబ్దాలకు పైగా నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్ (ఎన్.ఎ.ఎల్.)లో పనిచేసిన శుభా అయ్యంగార్ ఎయిర్‌పోర్ట్ ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగానికి నాయకత్వం వహించారు. పద్మ పురస్కారాల నేపథ్యంలో... ప్రతికూల వాతావరణ పరిస్థితులలో సురక్షితమైన విమాన కార్యకలాపాలకు తోడ్పడే వ్యవస్థ రూపకల్పనకు సంబంధించి శుభా అయ్యంగార్ కృషిని భారత ప్రభుత్వం ప్రశంసించింది.
బంగారు బాటలో...
బెంగళూరు యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసిన అయ్యంగార్ రెండింటిలోనూ మొదటి ర్యాంక్ సాధించారు. భౌతిక శాస్త్రంలో ఎన్నో బంగారు పతకాలు సాధించారు. ఎంఎస్సీ ఫిజిక్స్‌లో మొదటి ర్యాంక్ సాధించిన శుభా అయ్యంగార్ భారత ప్రభుత్వ మెరిట్ స్కాలర్‌షిప్‌ను అందుకున్నారు. రాత పరీక్ష, ఇంటర్యూ్య ప్రక్రియతో పనిలేకుండా కేవలం విద్యాప్రతిభ ఆధారంగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ ఆమెకు జూనియర్ సైంటిఫిక్ ఫెలోషిప్ ప్రదానం చేసింది.
ప్రపంచం ‘దృష్టి’లో ఆమె ప్రతిభ
‘దృష్టి’ పేరుతో ఎయిర్‌పోర్ట్ వెదర్, రన్‌వే విజిబిలిటీ సిస్టమ్‌ను అభివృద్ధి చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు శుభా అయ్యంగార్. ఈ సాంకేతికత... పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌లకు రియల్ టైమ్ రన్‌వే విజువల్ రేంజ్ (ఆర్‌వీఆర్)ను అందిస్తుంది. దృశ్యాలు అస్పష్టంగా ఉన్నప్పుడు టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతోంది. దీనిని ఇప్పుడు భారతదేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలలో, భారత వైమానిక దళంలో ఉపయోగిస్తున్నారు. ఈ సాంకేతికత దేశానికి గణనీయంగా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడంలో సహాయపడింది.
భారతీయ విమానాశ్రయాలలో సాధారణంగా ఎదురయ్యే సవాళ్లలో దట్టమైన పొగమంచు ఒకటి. భారీ వర్షపాతం, ధూళి తుఫాను పరిస్థితులలో కూడా ఈ వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుంది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ, ప్రపంచ వాతావరణ సంస్థ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ‘దృష్టి’ వ్యవస్థను రూపాందించారు. ‘దృష్టి’కి ముందు మన విమానశ్రయాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ట్రాన్సోమీటర్‌లపై ఆధారపడేవి. ‘దృష్టి’ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.
నాసా గుర్తింపు
శుభా అయ్యంగార్ శాస్త్రీయ పరిశోధనలు చేస్తున్న రోజుల్లో ఇంటర్నెట్ సదుపాయం, అత్యాధునిక ప్రయోగశాలలు లేవు. ‘ఇంటర్నెట్, ఇతరత్రా సదుపాయాలు లేకుండానే 1986లో మూడు పరిశోధన పత్రాలను ప్రచురించాను. అది మా పేర్లతో నాసాలో ఒక రిపోర్ట్‌గా రికార్డ్ అయింది’ అంటారు శుభ.
శుభా అయ్యంగార్ చేసిన కృషి భారతదేశ రక్షణ సామర్థ్యాలకు దోహదపడింది. భారతదేశం గర్వించదగిన ‘అగ్ని’ క్షిపణికి సంబంధించి క్లిష్టమైన సాంకేతిక సమస్యను పరిష్కరించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. స్వదేశీ సాంకేతిక అభివృద్ధి, స్వావలంబనను పెంపొందించడంలో చేసిన కృషికి గుర్తింపుగా మొట్ట మొదటి జాతీయ ‘మేక్ ఇన్ ఇండియా’ అవార్డ్ అందుకున్నారు శుభా అయ్యంగార్.
ఫ్యామిలీ పవర్
‘మహిళలు ఉన్నత విద్యను అభ్యసించినప్పుడే ఉన్నత స్థానంలోకి వెళ్లగలరు’ అని బలంగా నమ్మేవారు శుభా అయ్యంగార్ నాన్నగారు. కూతురిని చదువు విషయంలో బాగా ప్రోత్సహించేవారు. శాస్త్రీయ విషయాలపై అవగాహన కలిగించేవారు. కూతురు ఉన్నతస్థాయిని చూడకుండానే, శుభ ఎం.ఎస్‌సీ. స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఆయన చనిపోయారు. ‘నాన్న ద్వారానే సైన్స్ పట్ల ఆసక్తి కలిగింది’ అని చెబుతుంటారు శుభ. తొమ్మిది మంది తోబుట్టువులలో అందరికంటే చిన్నదైన శుభ తన కుటుంబాన్నే వెన్నెముకగా భావిస్తారు. పదవీవిరమణ తరువాత కూడా అవసరమైనప్పుడు వివిధ సంస్థలు ఆమె సలహాలు తీసుకుంటున్నాయి. వ్యక్తిగత గుర్తింపు కంటే పనికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు శుభా అయ్యంగార్.


