తీవ్ర వ్యసనం | Doomscrolling can send your mind racing and lead to burnout | Sakshi
Sakshi News home page

తీవ్ర వ్యసనం

Jun 29 2025 5:22 AM | Updated on Jun 29 2025 5:22 AM

Doomscrolling can send your mind racing and lead to burnout

రీల్స్‌

మొన్నటి మేలో కర్నాటకలోని ఉడిపిలో ఒక సంఘటన జరిగింది. రోడ్డు మీద తిరుగుతున్న ఒక పిచ్చివాణ్ణి ఒక స్వచ్ఛంద సంస్థ కార్యకర్త సంరక్షించి, వైద్యం చేయించి, తిరిగి మామూలు మనిషిని చేశాడు. మెల్లగా ఆ కోలుకున్న వ్యక్తి తమిళుడని, సొంత ఊరు కుంభకోణం అని తెలిసింది. అతని మనుషులు వెతుక్కుంటూ వచ్చారు. ‘ఇతను ఆరునెలలుగా కనిపించకుండా పోయాడు. దానికి ముందు ఫోన్‌లో రీల్స్‌ చూస్తూ కుటుంబంతో మాట్లాడక, స్నానం చేయక, తిండి తినక అదే లోకంగా ఉండేవాడు. ఆ తర్వాత ఈ స్థితిలో దొరికాడు’ అని చెప్పి తీసుకెళ్లారు. రీల్స్‌ను వరుసపెట్టి చూడటానికి ‘డూమ్‌ స్క్రోలింగ్‌’ అంటున్నారు నిపుణులు. రీల్స్‌ మనిషి మెదడును ఏ విధంగా ఆక్రమించగలదో ఇదొక  ఉదాహరణ.

ఇటీవలే గుజరాత్‌లోని వడోదరలో మరో ఘటన జరిగింది. అక్కడి ఒక కొడుకు తన భార్యతో కలిసి పోలీసుల సహాయం కోరుతూ ఫోన్‌ చేశాడు. దానికి కారణం ఆ ఇంట్లోని తల్లి రీల్స్‌లో పడి తిండి తినడం మానేసింది. కొడుకు, కోడలు డ్యూటీకి వెళుతుంటే ఆమెకు బోర్‌ కొట్టి రీల్స్‌ చూడటానికి అలవాటు పడిందట. ఆ రీల్స్‌లో కూడా ఒక ఇన్‌ఫ్లూయెన్సర్‌ పెట్టే రీల్స్‌ చూస్తుందట. వాటికింద కామెంట్స్‌ పెడుతుందట. ఆ కామెంట్స్‌కు ఆ ఇన్‌ఫ్లూయెన్సర్‌ రియాక్ట్‌ అయితే ఆమెకు సంతోషం. లేదంటే అప్‌సెట్‌ అయ్యి అన్నం తినదు. కొడుకు కోడలు ఆమె ఫోన్‌ నుంచి ఇన్‌స్టా యాప్‌ను తొలగించారు. దాంతో ఇంకా పెద్ద గొడవ జరిగి, ఆమె అన్నం తినడం మానేసింది. దాంతో ఇప్పుడా కొడుకు, కోడలు తల పట్టుకుని కూచుని ఉన్నారు.

అసలు రీల్స్‌ అంటే ఏమిటి? కొన్ని సెకన్ల విన్యాసం. 2020లో మన దేశంలో టిక్‌టాక్‌ను నిషేధించాక, ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ పేరుతో 90 సెకన్ల నుంచి 3 నిమిషాల వీడియోస్‌ను ప్రవేశ పెట్టింది. వీటిద్వారా గుర్తింపు, పేరు, ఫాలోయెర్సు తద్వారా డబ్బు... ఇవన్నీ వచ్చేసరికి కేవలం రీల్స్‌ మీద ఆధారపడినవారు కోకొల్లలుగా పెరిగారు. వీరు రకరకాల విన్యాసాలతో నిత్యం వేలకొద్దీ రీల్స్‌ వదులుతుంటారు. అవి చూడటానికి ఎవరికైనా, ఎన్ని సంవత్సరాలైనా సరిపోవు. ఆ సంగతి గ్రహించి ఎప్పుడైనా సరదాగా చూసి ఫోన్‌ కట్టేయాలి తప్పితే వాటిలోనే కూరుకుపోతే మెదడు ఆ రీల్స్‌కు బానిసవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చేయి విరగ్గొట్టుకున్న అమ్మాయి
అహ్మదాబాద్‌లో నర్సింగ్‌ కోర్సులో చేరిన ఒక అమ్మాయి హాస్టల్‌లో బోరు కొడుతున్నదని రీల్స్‌ చూడటానికి అలవాటు పడింది. పరీక్షలు వచ్చాయి. రీల్స్‌ చూడాలంటే పరీక్షలు రాయకూడదని ఆ అమ్మాయి తన కుడి చేతిని బల్ల మీద పదేపదే బాది విరగ్గొట్టుకుంది. ఇలా ఉంటాయి రీల్స్‌ ఉత్పాతాలు.

బి.పి. పెరుగుతుంది
చైనాలోని హైబె మెడికల్‌ యూనివర్సిటీ చేసిన అధ్యయనం ప్రకారం రీల్స్‌ వల్ల 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్నవారిలో బి.పి. పెరుగుతుందని నిరూపణ అయ్యింది. రీల్స్‌లోని కంటెంట్‌ ఒక్కోసారి ఎక్కువగా, మరోసారి తక్కువగా కొనసాగుతూ మూడ్స్‌ను హెచ్చుతగ్గులు తెచ్చిపెడుతుండటం వల్ల ఇలా జరుగుతుంది. రాత్రివేళ గంటలు గంటలు రీల్స్‌ చూస్తూ నిద్ర పాడుచేసుకుని ఉద్యోగాల్లో కునికిపాట్లు పడుతున్నవారు వేలమంది ఉన్నారు. ఇక దేహం కదల్చకుండా ఉండటం వల్ల వస్తున్న శారీరక సమస్యలు ఎన్నో.

టీవీ నయం
రీల్స్‌ చూడటం కన్నా టీవీ చూడటం నయం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే టీవీ చూస్తూ కనీసం ట్రెడ్‌మిల్‌ మీద వాకింగ్‌ చేయొచ్చు. లేదా పుస్తకాల ర్యాక్‌ సర్దుకోవచ్చు. లేదా బట్టలు మడతపెట్టడమో, కూరగాయలు తరగడమో... ఏదో ఒక పని టీవీ చూస్తూ చేయొచ్చు. రీల్స్‌ చూడాలంటే ఇలా చేయడానికి చేతులు ఖాళీ ఉండవు. ఒక చేతిలో ఫోన్‌ పట్టుకుని మరో చేత్తో స్క్రోలింగ్‌ చేస్తూ వెళ్లాలి. కాబట్టి శరీరం వేరే పని చేయలేదు.

కాపురాలలో చిచ్చు
రీల్స్‌ చూడటం భార్యాభర్తల మధ్య చిచ్చు తెస్తోంది. నాలుగురోజుల క్రితం కర్నాటకలోని మంగళూరు సమీపంలో రీల్స్‌ చూస్తున్న భార్యను కట్టడి చేయలేక భర్త ఆమెను చంపేశాడు. ఉత్తర ప్రదేశ్‌లో ఒక భార్య రీల్స్‌ చూడనివ్వడం లేదని, గిన్నెలు తోమమంటున్నాడని భర్త మీద కేసుపెట్టింది. వీటన్నింటికి విరుగుడు ఆరోగ్యకరమైన వ్యాపకాల్లో ఉండటమే అంటున్నారు నిపుణులు. హస్తకళలు, పుస్తకాలు చదవడం, క్రీడలు వీటిలో సమయాన్ని వెచ్చించడం మేలంటున్నారు. ముఖ్యంగా పిల్లల్ని రీల్స్‌ బారిన పడకుండా చూడమంటున్నారు.                                                  
 

Advertisement
 
Advertisement
Advertisement