వృథా చేయని సమయమే ర్యాంక్‌ తెస్తుంది | Devdutta Majhi tops JEE Advanced in female category | Sakshi
Sakshi News home page

వృథా చేయని సమయమే ర్యాంక్‌ తెస్తుంది

Jun 4 2025 4:03 AM | Updated on Jun 4 2025 4:03 AM

Devdutta Majhi tops JEE Advanced in female category

ఐ.ఐ.టి. జె.ఇ.ఇ. అడ్వాన్స్డ్‌ పరీక్ష అంటే పరీక్షలకే పరీక్ష. అలాంటి పరీక్షను 2025లో లక్షా తొంభై వేల మంది రాస్తే వారిలో అమ్మాయిలు 43,000 మంది. ఆ మొత్తం అమ్మాయిల్లో ఫస్ట్‌ ర్యాంక్‌ తెచ్చుకుంది దేవదత్తా మాఝీ(Devdutta Majhi). బెంగాల్‌లోని చిన్న ఊర్ల విద్యార్థినుల విజయం ఇది. జె.ఇ.ఇ. మెయిన్  సీజన్  1, సీజన్  2లలో టాప్‌ 1 ర్యాంక్‌ సాధించిన దేవదత్తా కోచింగ్‌ లేకుండా సొంతగా చదువుకుంది. ‘మీరు వేస్ట్‌ చేసే ప్రతి నిమిషం మిమ్మల్ని ర్యాంక్‌కు దూరం చేస్తుంది’ అని హెచ్చరిస్తూ ఉంది ఆ చదువుల సరస్వతి.

ర్యాంక్‌ రావడం గురించి కోచింగ్‌ సెంటర్‌లకు ఒక వైఖరి ఉంటుంది. తల్లిదండ్రులకు ఒక వైఖరి ఉంటుంది. పిల్లలకు కూడా ఉంటుంది. మా దగ్గర కూచోబెట్టి రాత్రి తెల్లవార్లు చదివిస్తే ర్యాంకు వస్తుందని కోచింగ్‌ సెంటర్‌ వాళ్లూ, ఎయిత్‌ క్లాస్‌ నుంచే కోచింగ్‌లో పెడితే ఇంటర్‌ అయ్యే సరికి చచ్చుకుంటూ ర్యాంక్‌ వస్తుందని తల్లిదండ్రులూ, ఆపకుండా క్లాసులు విని మాక్‌ టెస్టులు రాస్తే ర్యాంక్‌ వస్తుందని విద్యార్థులు అనుకుంటూ ఉంటారు.

తీరా రిజల్ట్స్‌ వచ్చాక అంచనాలు తారుమారు అయి ఉంటాయి. బ్లేమ్‌ క్వశ్చన్‌ పేపర్‌ మీదకు వెళుతుంది. ‘పేపర్‌ చాలా టఫ్‌గా వచ్చింది కాబట్టే మా అబ్బాయికి ర్యాంక్‌ రాలేదు’ అనీ, ‘కెమిస్ట్రీ ఫిజిక్స్‌ బాగా చేసింది కాని మేథ్స్‌లో దెబ్బతింది మా అమ్మాయి’ అని కామెంట్లు వస్తుంటాయి. కోచింగ్‌ సెంటర్‌ వాళ్లు బాగా చెప్పలేదని తల్లిదండ్రులు, తల్లిదండ్రులు గట్టిగా హెచ్చరించి చదివించలేదని కోచింగ్‌ సెంటర్‌ వారూ అనుకుంటారు. మన తెలివితేటలకు ఇంకా మంచి ర్యాంక్‌ రావాలని విద్యార్థులు డిజ΄్పాయింట్‌ అవుతారు.

కాని జె.ఇ.ఇ. అడ్వాన్స్‌డ్‌కే కాదు ఏ పరీక్షకైనా ర్యాంక్‌ రావాలంటే మొదట పూనుకోవాల్సింది, సంకల్పించాల్సింది విద్యార్థే అంటోంది దేవదత్తా మాఝీ. లక్షా తొంభై వేల మంది రాసిన జె.ఇ.ఇ. అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో కామన్‌ ర్యాంక్‌ 16 సాధించిన దేవదత్తా అమ్మాయిలందరిలో టాప్‌ 1 ర్యాంకర్‌గా నిలిచింది.  అంతే కాదు జె.ఇ.ఇ మెయిన్స్‌లో 100 పర్సంటైల్‌ సాధించింది.

కోచింగ్‌ లేకుండానే...
‘నేను కోచింగ్‌ తీసుకోలేదు. కొన్ని ఆన్‌లైన్‌ క్లాసులు ఢిల్లీ లెక్చరర్ల నుంచి తీసుకున్నాను. మిగిలినదంతా సెల్ఫ్‌ స్టడీనే.పోటీ పరీక్షల్లో ర్యాంకు రావాలంటే ముందు నుంచి మనం క్రమశిక్షణతో ఉండాలి. టెన్త్‌ అయిపోయాక రెండేళ్లపాటు నేను నా ఫ్రెండ్స్‌ని, బంధువులను కలవలేదు. ఫంక్షన్స్‌కు అటెండ్‌ కాలేదు. కచ్చితంగా రోజుకు పది, పన్నెండు గంటలు చదివాను. ఏనాడూ డిసిప్లిన్‌ తప్పలేదు. మనం వేస్ట్‌ చేసే ప్రతి నిమిషం మనల్ని ర్యాంకుకు దూరం చేస్తుందని గ్రహించాలి’ అంది దేవదత్తా మాఝీ.

తల్లి మార్గదర్శనం
దేవదత్తా తల్లి ఫిజిక్స్‌ టీచర్‌. తండ్రి లెక్చరర్‌. వీరు ఉంటున్నది కోల్‌కతాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న కత్వా అనే చిన్న ఊరు. దేవదత్తా గవర్నమెంట్‌ హైస్కూల్‌లోనే టెన్త్‌ చదివి 2023లో స్టేట్‌ టాప్‌ 6వ ర్యాంకర్‌గా నిలిచింది. ‘అప్పటినుంచే నాకు ఐ.ఐ.టి. అడ్వాన్స్‌డ్‌ సాధించాలని కోరిక. అందుకు వేరెవరో కష్టపడితే నాకెలా ర్యాంక్‌ వస్తుంది. కష్టపడి చదవాల్సింది నేనే... ర్యాంక్‌ సాధించాల్సింది నేనే. కోచింగ్‌ సెంటర్లలో కష్టపడి లెక్చరర్లు చెప్పడం ద్వారా మనకు ర్యాంక్‌ వచ్చేయదు. నా చదువుకు అమ్మ కొంచెం గైడ్‌ చేసింది. నేను మొదట మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో థియరీ అంతా చదువుకున్నాను. తర్వాత ప్రాబ్లమ్స్‌ సాల్వ్‌ చేశాను. టెక్స్‌›్టబుక్స్‌ మాత్రమే కాకుండా చాలా పుస్తకాలు చదివాను’ అంటుంది దేవదత్తా.

ఏ.ఐ. చదవాలని...
దేవదత్తా ఖరగ్‌పూర్‌ ఐ.ఐ.టి. పరిధిలోకి వచ్చినా తాను మాత్రం ఐ.ఐ.ఎస్‌.సి. బెంగళూరులో ఏ.ఐ. అండ్‌ రోబోటిక్స్‌ చదవాలని అనుకుంటోంది. ‘నేను వయొలిన్‌ బాగా వాయిస్తాను. కాని పరీక్షల కోసం దానినీ పక్కన పెట్టేశాను. అయితే పరీక్షలయ్యాక ఇప్పుడు మళ్లీ వయొలిన్‌ వాయిస్తున్నాను. ఈ రెండేళ్లు నేను అమ్మతో మాత్రమే మాట్లాడుతూ రిలాక్స్‌ అయ్యాను. ఆమెతో మాటలు తప్ప మిగిలినదంతా పుస్తకాలతోనే’ అని ముగించింది దేవదత్తా.

Advertisement
 
Advertisement
Advertisement