ఒబామా జోస్యం: ‘ట్రంప్‌’ స్థానంలో మహిళా అధ్యక్షురాలు! | Barack Obama Predicts America Will Soon Have Its First Woman President Sparks Global Discussion, Read Story Inside | Sakshi
Sakshi News home page

ఒబామా జోస్యం: ‘ట్రంప్‌’ స్థానంలో మహిళా అధ్యక్షురాలు!

Jun 25 2026 8:33 AM | Updated on Jun 25 2026 9:49 AM

Obama Predicts First Female US President Sometime Soon

వాషింగ్టన్‌: అమెరికా రాజకీయాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చెరగని ముద్ర వేసిన మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మాజీ ప్రథమ మహిళ మిషెల్ ఒబామా తాజాగా ‘పీపుల్’ మ్యాగజైన్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. చికాగోలో త్వరలో ప్రారంభం కానున్న ‘ఒబామా ప్రెసిడెన్షియల్ సెంటర్’ నేపథ్యంలో సాగిన ఈ సంభాషణలో.. అమెరికా భవిష్యత్తు, వారి వ్యక్తిగత జీవితం, వైట్ హౌస్ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. త్వరలో అమెరికాకు మొదటి మహిళా అధ్యక్షురాలు రాబోతున్నారని ఒబామా వ్యాఖ్యానించడం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది.

త్వరలోనే మహిళా ప్రెసిడెంట్
అమెరికాకు మొదటి నల్లజాతీయుడిగా అధ్యక్షుడైన ఒబామా, రాబోయే రోజుల్లో దేశం మరింత ప్రగతి సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. తన పాలనలో యువతలో కొత్త ఆశలు రేకెత్తించిందని ఆయన అన్నారు. ‘నా జీవితకాలంలోనే అమెరికాకు ఒక మహిళా ప్రెసిడెంట్ రాబోతున్నారు, అది త్వరలోనే జరుగుతుందని నేను నమ్ముతున్నాను’ అని ఒబామా వ్యాఖ్యానించారు. విభిన్న నేపథ్యాలు ఉన్నవారు కూడా దేశ అత్యున్నత పదవిని చేపట్టవచ్చనే భావనను ఆయన వ్యక్తం చేశారు.

34 ఏళ్ల బంధం.. ఆ మొదటి ముద్దు
ఈ ఇంటర్వ్యూలో ఒబామా దంపతులు తమ 34 ఏళ్ల వైవాహిక జీవితంలోని మధుర క్షణాలను గుర్తుచేసుకున్నారు. చికాగోలో తాము మొదటిసారి కలుసుకున్న రోజులను మిషెల్ ఒబామా ప్రస్తావిస్తూ, అప్పట్లో ఒబామాకు ఏసీ కూడా లేని ఒక చిన్న అపార్ట్‌మెంట్ ఉండేదని చెప్పారు. వారి మొదటి డేట్‌లో భాగంగా బాస్కిన్-రాబిన్స్ ఐస్‌క్రీమ్ పార్లర్ వద్ద, రోడ్డు పక్కన కూర్చుని మొదటి ముద్దు పెట్టుకున్నట్లు ఒబామా నవ్వుతూ గుర్తుచేశారు. ఇప్పుడు ఆ ప్రదేశంలో ఒక స్మారక ఫలకం కూడా ఏర్పాటు కావడం విశేషం. తామిద్దరూ ఒకరికొకరు అండగా నిలుస్తూ జీవితంలో ఎదిగామని వారు చెప్పుకొచ్చారు.

వైట్ హౌస్ జ్ఞాపకాలు.. భవిష్యత్తు లక్ష్యాలు
వైట్ హౌస్ జీవితంపై ఒబామా స్పందిస్తూ, అది ఎంతో గౌరవప్రదమైనదైనప్పటికీ కొన్ని పరిమితులు ఉంటాయని, బిల్ క్లింటన్ చెప్పినట్లుగా అది ‘ఫెడరల్ జైలు వ్యవస్థ కిరీటం’ లాంటిదని వ్యాఖ్యానించారు. నిత్యం సూట్, టై ధరించాల్సిన అవసరం లేకపోవడాన్ని తాను ఇప్పుడు ఆస్వాదిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తాము రాజకీయాల కంటే ‘ఒబామా ఫౌండేషన్’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువ నాయకులను ప్రోత్సహించడంపైనే  దృష్టి పెట్టామని, అదే తమకు అత్యంత సంతృప్తిని ఇస్తోందని ఒబామా దంపతులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: ఇంటింటా ‘మా ఇంటి బంగారం’.. సీఎం విజయ్‌ భరోసా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement