To day recipes :మోకాళ్ల నొప్పులకు బెస్ట్‌ ఇది, మరి జీర్ణశక్తికి! | To Day tip Nalleru Benefits (Pirandai) chutney best for Knee Pains | Sakshi
Sakshi News home page

To day recipes : మోకాళ్ల నొప్పులకు బెస్ట్‌ ఇది, మరి జీర్ణశక్తికి!

Jun 12 2025 12:16 PM | Updated on Jun 12 2025 2:18 PM

To Day tip Nalleru Benefits (Pirandai) chutney best for Knee Pains

మన పెద్దల నాటి వంటకం ఇది. ఇపుడంటే చాలామంది మర్చిపోయారు కానీ,  మన అమ్మమ్మలు తాతల కాలంలో బాగా ప్రాచుర్యం సంపాదించుకున్నదే. అదే నల్లేరు పచ్చడి. నల్లేరును సాధారణంగా  కూరగాయల పాదులపై వాడేవారు. ఉడతలు, తొండలు పూత , పిందెలను కొరికి పాడు చేయకుండా దీన్ని పాదులపై ఉంచేవారు.  అయితే నల్లేరు పచ్చడిని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నల్లేరు ప్రధానంగా పచ్చడి తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయనీ, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతారు. మరి టిప్‌ ఆఫ్‌ ది డేలో భాగంగా  ఈ రోజు  నల్లేరు కాడల పచ్చడి, పోషకాలు అందించే  వామ్ము ఆకు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామా.

నల్లేరు పచ్చడి 
కావలసిన పదార్థాలు:
నల్లేరు కాడలు (మరీ ఫ్రెష్‌గా కాకుండా, కాస్త వడిలితే దురదలు రావు)  మిర్చి, ఉల్లిపాయలు, టమోటా, పసుపు, కారం, నూనె, చింతపండు, ఉప్పు, తాలింపు కోసం ఆవాలు, శెనగపప్పు, మెంతులు, కరివేపాకు. 

తయారీ: ముందుగా నల్లేరు కాడలనును శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా కట్ చేయాలి.  కడిగేటపుడు చేతులకు గ్లౌజులు వాడటం మంచిది. లేదంటే  చేతులు దురదలొస్తాయి. 

ఎండుమిర్చి, ఉల్లిపాయ, టమోటా(ఇవి ఆప్షనల్‌) కూడా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.   ఇపుడు ఒక పాన్ లో నూనె వేసి,  మిర్చి, ఆవాలు, శెనగపప్పు, మెంతులు, కరివేపాకు వేసి వేయించాలి.  తాలింపు వేగిన తర్వాత, నల్లేరు ముక్కలు, ఉల్లిపాయలు, టమోటా ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. చిటికెడు పసుపు, కారం,  రవ్వంత చింతపండు ఉప్పు వేసి   మరికొద్దిసేపు మగ్గించాలి. చల్లారిన తరువాత మెత్తగా రోటిలో (మిక్సీ అయినా పరవాలేదు) దంచుకోవాలి. రుచిచూసుకొని, చివరగా ఇంగువ, ఎండుమిర్చితో పోపు వేసుకుంటే  కమ్మని నల్లేరు పచ్చడి రెడీ. దీన్ని వేడి వేడి అన్నంలో గానీ,  రాగి సంగటిలో గానీ కాస్తంత నెయ్యివేసుకుని తింటే ఆహా అనాల్సిందే.  రొట్టె, లేదా చపాతీతో  గానీ తినవచ్చు. 


 

ఇదీ చదవండి: Weight Loss వేగంగా బరువు తగ్గాలంటే..
 

వామ్ము ఆకు ఇడ్లీ పచ్చడి
కావలసిన పదార్థాలు: వామ్ము ఆకులు, పచ్చి మిరపకాయలు,పుట్నాల పప్పు కొద్దిగా,  వెల్లుల్లి రెబ్బలు, రుచికి  సరిపడా, ఉప్పు, చింతపండు, కొత్తిమీర పోపుదినుసులు,

తయారీ:  ముందుగా ప్యాన్‌ పెట్టుకుని, చింతపండు, పోపు దినుసులు వేసి వేగిన తరువాత పుట్నాల పప్పువేసి ,  ఆతరువాత శుభ్రవంగా కడిగిపెట్టుకున్న వామ్ము ఆకులువేయాలి. దీంతోపాటు శుభ్రం చేసుకున్న చింతపండు కూడా వేయాలి.   నిమిషంలో వామ్ము ఆకులు మగ్గిపోతాయి. దీన్ని చల్లారిన తరువాత పచ్చి వెల్లుల్లి, చిటికెడు పసుపు, ఉప్పు వేసి మెత్తగా  మిక్సీ పట్టుకోవాలి. పోపు గింజలువేసి, కొంచెం చిటపటలాడనిచ్చి వాము ఆకుల పచ్చడిని వేసుకోవాలి.  ఆపైన శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న  కొత్తమీర జల్లుకుంటే...నోరూరించే వామ్మాకు పచ్చడి రెడీ!  ఇది  జీర్ణ శక్తికి చాలామంచిది. 
 

Advertisement
 
Advertisement
Advertisement