
శ్రీ మహావిష్ణువు అవతారంగా, దేవతలకు వైద్యుడుగా, ఆయుర్వేద వైద్యానికి ఆది వైద్యుడిగా ప్రసిద్ధి చెందిన ధన్వంతరి క్షీర సాగర మథన సమయాన ఆశ్వయుజ శుద్ధ త్రయోదశి నాడు ఆవిర్భవించాడు. చతుర్భుజుడైన ధన్వంతరి నాలుగు చేతులలో శంఖం, చక్రం, జలౌకం (జలగ) అమృత తుల్యమైన పునరుజ్జీవన తేనె భాండం దర్శనమిస్తాయి.ధన్వంతరిని సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు అవతారంగా పూజిస్తున్నప్పటికీ, ధన్వంతరికి అంకితం చేయబడిన దేవాలయాలు భారతదేశంలో చాలా తక్కువ. ఆ ఉన్న కొద్ది ఆలయాలు కూడా దక్షిణ భారతదేశంలోనే దర్శనమిస్తాయి ఉత్తర భారతాన న్యూఢిల్లీలోని కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థ ప్రాంగణంలో ఒక విగ్రహం, హరిద్వార్‌లోని ఒక ఆశ్రమంలో మరొక విగ్రహం తప్ప ఉత్తర భారతాన ధన్వంతరికి ఆలయాలంటూ అసలేం లేవనే చెప్పాల్సి ఉంటుంది.
రంగనాథస్వామి ఆలయం వద్ద ధన్వంతరి ఆలయం
తమిళనాడులో శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో ధన్వంతరి మందిరం ఉంది. శ్రీ రంగనాథస్వామి ఆలయ ప్రాంగణంలో 12వ శతాబ్దానికి చెందిన పురాతన మందిరం ఉంది. ఇక్కడ స్వామికి ప్రతిరోజూ పూజలు నిర్వహిస్తారు. ఆరోగ్యాభిలాషులైన భక్తులకు ‘ప్రసాదం’గా మూలికలను అందిస్తారు.

కోయంబత్తూరు శ్రీ ధన్వంతరి ఆలయం
కోయంబత్తూరులోని శ్రీ ధన్వంతరి ఆలయం తమిళనాడులోని మరొక ప్రసిద్ధ ధన్వంతరి ఆలయం. కోయంబత్తూరు నగర నడిబొడ్డున ఆర్య వైద్య చికిత్సాలయం, పరిశోధనా సంస్థలో ఉన్న శ్రీ ధన్వంతరి మందిరం, జీవానికి, వైద్యానికి దేవుడు, ధన్వంతరిని ప్రధాన దేవతగా ప్రతిష్టించింది.
నెల్లువాయ భగవాన్ ధన్వంతరి ఆలయం
గురువాయూర్, త్రిసూర్ నుండి 20 కి.మీ దూరంలో ఉన్న నెల్లువాయ వద్ద ఉన్న లార్డ్ ధన్వంతరి ఆలయం కేరళలోని ముఖ్యమైన ధన్వంతరి ఆలయాలలో ఒకటి. ఆయుర్వేద వైద్యులు వైద్యం ్ర΄ారంభించే ముందు ఈ ఆలయాన్ని సందర్శించడం శుభప్రదంగా భావిస్తారు.
మలప్పురంలో రుద్ర ధన్వంతరి ఆలయం
మలప్పురంలోని పులమంథోల్ మధ్యలో ఉన్న శ్రీ రుద్ర ధన్వంతరి ఆలయం కేరళలోని మరొక ప్రసిద్ధ ధన్వంతరి ఆలయం. ఈ ఆలయం ప్రసిద్ధ అష్టవైద్య పులమంథోల్ మూస్ కుటుంబానికి చెందినది, అయితే అన్ని వర్ణాలకు చెందిన హిందువులు ఆలయంలో పూజలు చేసుకోవడానికి అనుమతి ఉంది.
శ్రీ ధన్వంతరి ఆలయం, పెరింగవు
కేరళలోని త్రిస్సూర్ పట్టణ శివార్లలో ఉన్న మరొక పురాతన ధన్వంతరి ఆలయం పెరింగావులోని శ్రీ ధన్వంతరి ఆలయం. ఈ ఆలయ గర్భగుడి రెండు అంతస్తులతో గుండ్రని ఆకారంలో నిర్మించబడింది, ఇది ఇతర కేరళ శైలి నిర్మాణ శైలికి భిన్నంగా అరుదైన డిజైన్. గణపతి, లక్ష్మీదేవి, అయ్యప్పన్ ఈ ఆలయంలో ప్రతిష్టించబడిన ఇతర దేవతలు.
వడక్కంచెరి ధన్వంతరి ఆలయం
వడక్కంచెరి ఆయుర్వేద ప్రభువుకు అంకితం చేయబడిన మరొక ప్రసిద్ధ ఆలయం. ఈ ఆలయం కేరళలోని త్రిస్సూర్‌కు ఉత్తరాన 18 కి.మీ దూరంలో వడక్కంచెరి నుండి 8 కి.మీ దూరంలో కున్నంకుళం – వడక్కంచెరి రహదారిపై ఉంది.
(అక్టోబర్ 18, శనివారం ధన్వంతరి జయంతి)