అదే నా ఐడెంటిటీ! | Actress Varalaxmi Sarathkumar shares her Life journey | Sakshi
Sakshi News home page

అదే నా ఐడెంటిటీ!

Jun 21 2026 1:02 AM | Updated on Jun 21 2026 1:02 AM

Actress Varalaxmi Sarathkumar shares her Life journey

విలన్  పాత్రైనా సరే, తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకుల దృష్టి అంతా ఆమెపైనే! హీరోయిన్  ఇమేజ్‌ కంటే నటిగా గుర్తింపు ముఖ్యమని నమ్మే నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌. కెరీర్, వ్యక్తిత్వం, ఇష్టాలు, జీవిత తత్త్వం గురించి ఆమె చెప్పిన ఆసక్తికరమైన విషయాలు ఆమె మాటల్లోనే!

స్టార్‌ కిడ్‌ అయినా కష్టపడాల్సిందే!
స్టార్‌ కిడ్‌ని కాబట్టి నాకు అన్నీ ఈజీగా వచ్చేశాయని చాలామంది అనుకుంటారు. కానీ మా కుటుంబం నన్ను రెడీమేడ్‌ పీఠంపై కూర్చోబెట్టలేదు. ముందు చదువు పూర్తి చేయాలని నాన్న చెప్పారు. అందుకే బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ పూర్తి చేసి, ఆ తర్వాతే కెమెరా ముందుకు వచ్చాను. నాకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవడానికి ఎన్నో ఏళ్లు కష్టపడాల్సి వచ్చింది.

విలన్ గా ఉండటంలోనే కిక్‌!
నెగటివ్, అథారిటేటివ్‌ పాత్రలు చేయడం మొదలుపెట్టినప్పుడు ‘నీ హీరోయిన్  ఇమేజ్‌ పాడైపోతుంది’ అని చాలామంది హెచ్చరించారు. కానీ నాకు అలాంటి పాత్రల్లోనే అసలైన చాలెంజ్‌ కనిపించింది. గ్రే షేడ్స్‌ ఉన్న పాత్రలు నటిగా నా సామర్థ్యాన్ని చూపించే అవకాశం ఇస్తాయి.

నచ్చకపోతే చెప్పేస్తా!
నేను చాలా విషయాల్లో ఓపెన్ గా మాట్లాడతాను. తప్పు అనిపిస్తే మొహమాటం లేకుండా చెప్పేస్తాను. ఆ కారణంగా కొన్ని సినిమా అవకాశాలు కూడా కోల్పోయాను. కానీ నా ఆత్మగౌరవం, విలువల విషయంలో రాజీ పడలేను. అందుకే ఏ నిర్ణయం తీసుకున్నా ప్రశాంతంగా ఉంటాను.

గట్టిగా నవ్వుతా.. అదే నేను!
నేను చాలా లౌడ్, చాలా ఎక్స్‌ప్రెసివ్‌! జోక్స్‌ వేయడం, నవ్వుకోవడం అంటే భలే ఇష్టం. హీరోయిన్లు అంటే చాలా సైలెంట్‌గా, సాఫ్ట్‌గా ఉండాలనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. కానీ నేను అలాంటిదాన్ని కాదు. నేను ఎలా ఉంటానో అలాగే ఉంటాను. నటన కోసం వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని నమ్ముతాను.

ట్రోల్స్‌కి టైమ్‌ లేదు!
ప్రజలు పూర్తి విషయం తెలియకుండానే కామెంట్స్‌ చేస్తుంటారు. నికోలాయ్‌ సచ్‌దేవ్‌తో నా వివాహం తర్వాత కూడా ఎన్నో కామెంట్స్‌ చూశాను. కానీ అందరికీ నచ్చేలా జీవించడం అసాధ్యం. కాబట్టి మన సంతోషం మీదే ఫోకస్‌ చేయాలి.

నా నాన్ వెజ్‌ ప్రేమకు హద్దులే లేవు!
మా ఇంట్లో అందరూ ఫుడ్‌ లవర్స్‌. నేను కూడా. పీతలు, చేపలు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా రెడ్‌ స్నాపర్‌ చేప నా ఫేవరెట్‌. బిర్యానీ, మండీ అంటే ఎంత ఇష్టమో చెప్పలేను. అయితే ఒక ట్విస్ట్‌ ఉంది. నాకు స్పైసీ ఫుడ్‌ అస్సలు పడదు! ఎంత మంచి కబాబ్‌ అయినా తక్కువ మసాలాతోనే తినాలి.

ప్రభాస్‌కి స్పెషల్‌ ఫ్యాన్  గర్ల్‌!
ప్రభాస్‌ స్క్రీన్  ప్రెజెన్స్ నాకు చాలా ఇష్టం. ఆయన సింప్లిసిటీ మరింత ఆకట్టుకుంటుంది. ఇక నా జీవితంలో మొదటి హీరో మాత్రం మా నాన్న శరత్‌కుమారే. ఆయన క్రమశిక్షణ, అంకితభావం ఇప్పటికీ నాకు స్ఫూర్తి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement