
సమ్‌థింగ్ స్పెషల్
డెబ్బై అయిదు రోజుల పాటు జరిగే దసరా పండగ ప్రాచీన సంప్రదాయం ఇప్పటికీ బస్తర్‌లో కొనసాగుతోంది. ‘జోగీ బిథాయి’ సంప్రదాయంలో భాగంగా హల్బా తెగకు చెందిన ఒక యువకుడు సాధువు వేషధారణతో దంతేశ్వరీ ఆలయంలో భూమికి ఆరు అడుగుల దిగువన, జ్యోతి ఎదురుగా తొమ్మిది రోజుల పాటు పీఠంపై కూర్చుంటాడు. ఈ యువకుడు ఎనిమిది రోజులు ఉపవాసం ఉంటాడు.
‘జోగి బిథాయి’ సంప్రదాయానికి 600 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇందులో పాత్ జత్ర, దేరి గడాయి, కాంచన గడాయి సంప్రదాయాలు ఉంటాయి. మవల్లి ఆలయంలో పూజారి దీపం వెలిగించడంతో దసరా ఉత్సవాలు మొదలవుతాయి. ఒక ఖడ్గాన్ని ఆలయంలో పెట్టి పూజలు చేస్తారు. ఈ పురాతన సంప్రదాయాన్ని ఇటలీకి చెందిన ఇద్దరు యువకులు డాక్యుమెంట్ చేశారు.
‘ఇక్కడి ప్రజలు నిరాడంబరం గా, స్నేహంగా ఉంటారు. ఇక్కడ దసరా పండగ రకరకాల సంప్రదాయలతో కన్నుల పండుగగా జరుగుతుంది’ అంటున్నాడు ‘జోగి బిథాయి’ సంద్రాయాన్ని వీడియో డాక్యుమెంట్ చేసిన యువకులలో ఒకరైన డేనియల్. ప్రపంచంలో జరిగే అతి పెద్ద దసరా వేడుకలలో ‘జోగి బిథాయి’కి ప్రత్యేక గుర్తింపు ఉంది.