డిగ్రీ చదువుకు పెరుగుతున్న ఆదరణ | - | Sakshi
Sakshi News home page

డిగ్రీ చదువుకు పెరుగుతున్న ఆదరణ

Aug 27 2025 8:56 AM | Updated on Aug 27 2025 8:56 AM

డిగ్రీ చదువుకు పెరుగుతున్న ఆదరణ

డిగ్రీ చదువుకు పెరుగుతున్న ఆదరణ

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): చదువుకు అంతిమ లక్ష్యం మంచి ఉద్యోగాలు సాధించడమే అన్నట్టుగా యువత ఆలోచనా విధానం మారిపోయింది. ఏ కోర్సులు చేస్తే ఏ ఉద్యోగాలు వస్తాయో? ముందుగానే తెలసుకోవడానికి, అత్యధిక జీతాలు వచ్చే అవకాశాలు ఉన్న కోర్సులను ఎంపిక చేసుకోవడానికి యువత ఆసక్తి చూపుతున్నారు. ప్రధానంగా ఇంజనీరింగ్‌ కోర్సులతో తక్కువ సమయంలో ఉద్యోగావకాశాలు పొందుతున్న ట్రెండ్‌ ప్రస్తుతం నడుస్తోంది. అది కూడా కంప్యూటర్‌ ఆధారిత కోర్సుల వైపే ఎక్కువ మంది దృష్టి సారిస్తున్నారు. అయితే చదువులో వెనుకబడి, ఇంజనీరింగ్‌ కోర్సుల ప్రవేశ పరీక్షల్లో సరైన ర్యాంకులు సాధించలేకపోయిన వారు తప్పనిసరి పరిస్థితుల్లో డిగ్రీ కోర్సులవైపు వెళ్లక తప్పడం లేదు. అయితే డిగ్రీలో కూడా కొత్త కోర్సులను ప్రవేశపెట్టి డిగ్రీ కోర్సులతో కూడా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు సంపాదించేలా విద్యార్థులకు అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం డిగ్రీ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ జరుగుతుండడంతో విద్యార్థులు ఈ కోర్సుల వైపు కూడా అడుగులు వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. మంగళవారంతో వెబ్‌ ఆప్షన్ల గడువు ముగియగా, ఈ నెల 29న వెబ్‌ ఆప్షన్లు మార్చుకునే అవకాశం ఉంటుంది. కొత్త కోర్సుల గురించి తెలియని వారు వాటి గురించి ఆరా తీసి నిపుణుల సలహా మేరకు వెబ్‌ ఆప్షన్లు మార్చుకోవచ్చు.

అందుబాటులోకి ఆనర్స్‌ డిగ్రీ

సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో మార్పులు రావడంతో ఆనర్స్‌ డిగ్రీ కోర్సులు విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. మూడేళ్ల కాలానికి సాధారణ డిగ్రీ, నాలుగేళ్ల కాలానికి ఆనర్స్‌ డిగ్రీ సర్టిఫికెట్లు అందుబాటులోకి వచ్చాయి. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేసి, ఉపాధికి బాటలు వేసే విధంగా కోర్సులను రూపొందించారు. ఈ కోర్సుల్లో భాష, సాంకేతిక నైపుణ్యాలతో పాటు వృత్తి నైపుణ్యాలను పెంచేలా ఇంటర్న్‌షిప్‌, పారిశ్రామిక శిక్షణను అంతర్భాగం చేశారు. ఇవి గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు వరంగా మారాయి.

సెమిస్టర్‌ విధానంతో

ఎప్పటికప్పుడు పర్యవేక్షణ

ప్రభుత్వ కళాశాలల్లోనూ డిగ్రీ కోర్సులు ఆంగ్ల మాధ్యమంలో అందుబాటులో ఉన్నాయి. పదో తరగతి, ఇంటర్మీడియట్‌ స్థాయిల్లో ఆంగ్ల మాధ్యమంలో చదివిన విద్యార్థులు ఎలాంటి ఇబ్బందీ లేకుండా డిగ్రీలో అదే మాధ్యమాన్ని కొనసాగించవచ్చు. ఆ భాషా నైపుణ్యంతో పాటు భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని కార్పొరేట్‌ కొలువులు సాధించే స్థాయికి చేరుకోవచ్చని విద్యారంగ నిపుణులు తెలుపుతున్నారు. అలాగే సెమిస్టర్‌ విధానం అమలులోకి రావడం, పరీక్షలు, మూల్యాంకనం ద్వారా విద్యార్థి అభ్యసన స్థాయిని ఎప్పటికప్పుడు అధ్యాపకులు పర్యవేక్షించడం వల్ల విద్యార్థులు ఉత్తమ అవకాశాలను అందుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

కంప్యూటర్‌ ఆధారిత

కోర్సులతో కొత్త పుంతలు

డిగ్రీలో కంప్యూటర్‌ ఆధారిత కోర్సులను ప్రవేశపెట్టడంతో డిగ్రీ చదువులు సైతం కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సంప్రదాయ కోర్సులతో పాటు కంప్యూటర్‌ ఆధారిత కోర్సులనూ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కోర్సుల్లో చేరి విజయవంతంగా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే ఇంజనీరింగ్‌లా నాలుగేళ్ల వరకూ ఆగక్కరలేకుండానే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది.

ఈ మార్పులు గమనించాల్సిందే

సంప్రదాయ కోర్సులైన బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సుల్లో రాష్ట్ర ఉన్నత విద్యామండలి మార్పులు చేసింది. పీజీలోలా పూర్తిగా ఒక సబ్జెక్టు చదివేలా డిగ్రీ కరిక్యులమ్‌తోపాటు సిలబస్‌లో మార్పులు చేసింది.

బీఎస్సీ లైఫ్‌సైన్సెస్‌లో బోటనీ, జువాలజీ, ఆక్వా కల్చర్‌, బయోకెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, హోమ్‌ సైన్స్‌, న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్‌ కోర్సులతో పాటు బీఎస్సీ ఫిజికల్‌ సైన్సెస్‌లో మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, డేటా సైన్స్‌ వంటి ఆధునిక కోర్సులను అందుబాటులోకి తెచ్చింది.

బీఏలో ఫైనాన్షియల్‌ ఎకనామిక్స్‌, టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌, ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ లిటరరీ స్టడీస్‌, తెలుగు భాష–సాహిత్యం, పొలిటికల్‌ సైన్స్‌ కోర్సులను తీర్చిదిద్దింది.

బీకాంలో జనరల్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ అకౌంటింగ్‌ అండ్‌ ట్యాక్సేషన్‌, బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, బీబీఏ రిటైల్‌ ఆపరేషన్స్‌ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి.

నూతన కోర్సులతో లక్షల వేతనాలతో ఉద్యోగాలు

విద్యార్థులను ఆకర్షిస్తున్న వినూత్న కోర్సులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement