
స్మార్ట్‌మీటర్లకు వ్యతిరేకంగా మరో ఉద్యమం
ఏలూరు (టూటౌన్): బషీర్‌బాగ్ విద్యుత్ అమరవీరులు రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్థన్ రెడ్డిలకు నివాళులర్పిస్తూ ఏలూరు పాత బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద గురువారం ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజాసంఘాల ఐక్య కార్యచరణ నాయకులు ఇఫ్టూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి, సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడారు. గద్దనెక్కక ముందు స్మార్ట్‌మీటర్ల వద్దు పాత మీటర్లే ముద్దు అని నినదించిన కూటమి నాయకులు ఇప్పుడు ప్రజలపై భారాలు మోపుతూ స్మార్ట్ మీటర్ల బిగించడానికి ముందుకు వచ్చారని, ఈ విధానాలకు నిరసనగా మరో బషీరాబాగ్ ఉద్యమాన్ని చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రంలో కూటమి సర్కారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, మోదీ తీసుకొచ్చిన నూతన విద్యుత్ సంస్కరణలు చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, ప్రజలపై భారం మోపుతూ బిగిస్తున్న అదానీ స్మార్ట్‌మీటర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భాన్ని ఉద్దేశించి ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. యర్రా శ్రీనివాసరావు, ఉప్పులూరు హేమ శంకర్, పంపన రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.