
ఏజెన్సీలో పొంగిన వాగులు
బుట్టాయగూడెం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీలో వాగులు పొంగుతున్నాయి. బుధవారం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. వినాయకచవితి వేడుకలు ప్రారంభం కావడంతో వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొండప్రాంతంలో భారీగా వర్షం కురవడంతో వాగులు పొంగిపొర్లాయి. కేఆర్‌పురం సమీపంలో ఉన్న వాగు సుమారు 2 గంటలపాటు పొంగిపొర్లింది. గురువారం తెల్లవారుజామున కూడా భారీ వర్షం కురిసింది. తరువాత కాస్త శాంతించినా మళ్లీ సాయంత్రం నుంచి వర్షం కురుస్తూనే ఉంది.
లింగపాలెం: కుండపోతగా కురిసిన వానంతో లింగపాలెం మండలంలోని కొండవాగులు పొంగి గ్రామాల్లోకి వరదనీరు చేరుతోంది. కలరాయనగూడెంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లోకి వరద నీరు ప్రవేశించింది. నీరు బయటకు పోవడానికి కనీసం డ్రెయిన్ సౌకర్యం కూడా లేదు. ఫలితంగా పాఠశాల వర్షంలో నానుతోంది. పాఠశాలలో వరద నీరు చేరినా నాయకులెవరూ ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. భారీ వర్షం కారణంగా జిల్లా అధికారులు ముందుగానే గురువారం సెలవు ప్రకటించారు. చుట్టుపక్కల ఆక్రమణల కారణంగా వరద నీరు బయటకు వెళ్లే దారి లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని చెబుతున్నారు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వెంటనే జేసీబీతో తాత్కాలిక డ్రెయిన్ తీయించి, ఆక్రమణలు ఖాళీ చేయించి శాశ్వతంగా సీసీ డ్రెయిన్ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

ఏజెన్సీలో పొంగిన వాగులు