
భయపెట్టి.. రూ.30.70 లక్షలు స్వాహా
నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన ఓ విశ్రాంత ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. విడతలవారీగా రూ.30.70 లక్షలను స్వాహా చేశారు. నూజివీడుకు చెందిన నీలపాల చిన్నిరాజు సింగరేణి కాలరీస్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పనిచేసి 2011లో రిటైరయ్యారు. నూజివీడులో నివసిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 17న సాయంత్రం 4.41 గంటలకు ఒక వ్యక్తి ఫోన్ చేసి తాను సబ్ ఇన్‌స్పెక్టర్ సందీప్‌రావునని చెప్పి మాట్లాడారు.
సుధాఖత్ ఖాన్ అనే నేరస్తుడిని తాము 2024 నవంబరు 2న ఢిల్లీలో అరెస్టు చేశామని, అతని వద్ద మీ ఆధార్ కార్డు ఉందని చెప్పాడు. ‘‘నేరస్తుడితో మీకు సంబంధాలు ఉండొచ్చుననే అనుమానం ఉంది. విచారణకు ఢిల్లీ రావాల్సి ఉంటుంది’’. అని ఫోన్‌లో ఒత్తిడి చేశాడు. ఆ తరువాత మరో వ్యక్తి ఫోన్ చేసి తాను సీబీఐ ఆఫీసర్ ఆకాశ్ కుల్హరినని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కొంత మొత్తం భద్రత డిపాజిట్ కింద జమ చేయాలని, తమకు సహకరించకపోతే అరెస్టు చేస్తామని హెచ్చరించాడు.
దీనికి భయపడిపోయిన చిన్నిరాజు తన ఇల్లు, బంగారం తాకట్టు పెట్టి విడతల వారీగా నిందితులు చెప్పిన బ్యాంకు ఖాతాల్లో రూ.30,70,450 జమ చేశారు. ఆగస్టు 14 నుంచి నిందితులు చిన్నిరాజుతో సంప్రదింపులు నిలిపివేయడంతోపాటు ఆయన నంబరును బ్లాక్ చేయడంతో అనుమానమొచి్చన చిన్నిరాజు తాను మోసపోయినట్టు గ్రహించి పోలీసులను ఆశ్రయించారు.