
ముసునూరు : కొద్ది రోజులుగా వేల్పుచర్లలో జ్వరాలు విజృంభిస్తుండడంపై గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. జ్వరాల బారిన పడిన కొందరు ఏలూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లగా నలుగురు చిన్నారులకు డెంగీ వ్యాధి సోకినట్లు నిర్ధారణ కావడంతో అక్కడే చేరి, చికిత్స పొందుతున్నారు. ఇద్దరికి నయం కావడంతో డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు. మరో ఇద్దరు చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ముసునూరు పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ షకీనా ఇవాంజిలిన్ ఆధ్వర్యంలో గురువారం వేల్పుచర్ల గ్రామంలో వైద్య శిబరం ఏర్పాటు చేసి, ఇంటింటా జ్వరాల సర్వే, పరీక్షలు నిర్వహిస్తున్నారు. సూపర్‌వైజర్ మురళీమోహన్, వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.