
అదుపు తప్పి చేపల లారీ బోల్తా
దెందులూరు: జాతీయ రహదారి దెందులూరు మండలం సత్యనారాయణపురం– కొమురేపల్లి గ్రామాల మధ్య చేపల లారీ అదుపు తప్పి బోల్తా పడి ఘటనలో ఒకరు మృతి చెందగా ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వివరాల ప్రకారం బుధవారం గుడివాడ నుండి చేపల లోడుతో నారాయణపురం వైపు చేపల లారీ బయలుదేరింది. లారీ క్యాబిన్‌లో డ్రైవర్, క్లీనర్, గుమాస్తా ఉండగా, చేపల లోడుపై 9 మంది బీహార్‌కు చెందిన కూలీలు ప్రయాణిస్తున్నారు. లారీ దెందులూరు మండలం సత్యనారాయణపురం– కొమురేపల్లి గ్రామాల మధ్యకు వచ్చేసరికి ముందు వెళుతున్న కారు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ చేయడంతో లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బీహార్‌కు చెందిన సద్దాం హుస్సేన్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వీరు కూలి పనులు నిమిత్తం బీహార్ నుంచి వచ్చి ఉంగుటూరులో నివసిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే రోడ్డు సేఫ్టీ, పోలీస్ సిబ్బంది, హోంగార్డు యూనస్, కానిస్టేబుల్ ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పోలీస్ వాహనంలోనే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురికి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు.
ఘటనా స్థలంలో మృతి చెందిన సద్దాం హుస్సేన్ ఏలూరులో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
ఒకరు మృతి, 8 మందికి తీవ్ర గాయాలు

అదుపు తప్పి చేపల లారీ బోల్తా