
కలెక్టరేట్ తరలింపును అడ్డుకుంటాం
భీమవరం: భీమవరం నుంచి కలెక్టరేట్‌ను తరలించే ప్రయత్నాలను వైఎస్సార్‌సీపీ అడ్డుకుంటుందని, కలెక్టరేట్‌ను తరలించాలని చూస్తే ప్రజా ఉద్యమం చేపడతామని వైఎస్సార్‌సీపీ నాయకులు స్పష్టం చేశారు. మంగళవారం రాయలంలోని వైఎస్సార్‌సీపీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు నివాసంలో విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, వెంకటరాయుడు, పార్టీ నరసాపురం పార్లమెంట్ ఇన్‌చార్జ్ గూడూరి ఉమాబాల మాట్లాడారు. అప్పట్లో అన్ని నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల ఆమోదంతో భీమవరం జిల్లా కేంద్రంగా ఏర్పడితే నేడు తరలించే ప్రయత్నాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తాయన్నారు. కలెక్టరేట్ భవన నిర్మాణాలకు 20 ఎకరాల భూమి, రూ.100 కోట్ల నిధులు మంజూరు జరిగితే ఎందుకు మార్చాలని చూస్తున్నారో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతోనే మార్పు అంశం తెరపైకి తీసుకువచ్చారని ఆరోపించారు. కాళ్ల మండలం పెదఅమిరం గ్రామంలో ట్యాంక్ పోరంబోకు స్థలంలో కలెక్టరేట్ భవనాల నిర్మాణ ప్రతిపాదించడం నిబంధనలకు, సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. కలెక్టరేట్ తరలింపు వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యే నోరు మెదకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కామన నాగేశ్వరరావు, జెడ్పీటీసీ కాండ్రేగుల నర్సింహరావు, ఎంపీపీ పేరిచర్ల విజయనర్సింహరాజు, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.