
ఫ్రీ బస్సుతో మా జీవితాలు ఛిన్నాభిన్నం
కై కలూరు: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో తమ జీవితాలు ఛిన్నాభిన్నమయ్యా యని సీఐటీయూ ఆధ్వర్యంలో నియోజకవర్గం నాలుగు మండలాల ఆటో డ్రైవర్లు ర్యాలీ చేశారు. అనంతరం తహసీల్దారుకు వినతిపత్రం అందించారు. ఏలూరు జిల్లా ఆటో, ట్రాలీ డ్రైవర్స్ యూనియన్(సీఐటీయూ) ప్రధాన కార్యదర్శి జినగం గోపి మాట్లాడుతూ ఫ్రీ బస్సు పథకంతో నష్టపోయిన ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.25,000 అందించాలని డిమాండ్ చేశారు. కరోనా కారణంగా ఇప్పటికే డ్రైవర్లు నష్టపోయారని, ఫైనాన్స్ వాయిదాలు చెల్లించలేక అప్పులు పాలయ్యారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వాహన మిత్ర పథకంలో రూ.10 వేలు ఇవ్వగా తామొస్తే రూ.15 వేలు ఇస్తామని చెప్పిన కూటమి హామీ నెరవేర్చలేదన్నారు. ప్రభుత్వం స్పందించపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ మండలాలకు చెందిన ఫ్రెండ్స్, భరత్, కొండాలమ్మ, శ్యామలాంబ, ఆది వినాయక, భక్తంజనేయ ఆటో వర్కర్ల యూనియన్ల అధ్యక్షులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
ఏలూరు (టూటౌన్): విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఆపాలని, ప్రజల హక్కును కాపాడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి.బలరాం డిమాండ్ చేశారు. సీపీఎం పార్టీ జిల్లా విస్తృత సమావేశం కార్యదర్శి వర్గ సభ్యుడు తెల్లం రామకృష్ణ అధ్యక్షతన ఏలూరులో మంగళవారం జరిగింది. సమావేశంలో పలు ప్రజా సమస్యలపై తీర్మానాలు చేశారు. బలరాం మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని, కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు, ప్రతిపక్ష పార్టీ ముక్తకంఠంతో వ్యతిరేకించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రశ్నించడానికి జనసేన పుట్టిందన్న పవన్.. ప్రశ్నిస్తే అణచివేస్తామంటున్న బీజేపీతో కలిసి విశాఖ ఉక్కు పరిశ్రమకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యులు డీఎన్‌వీడీ ప్రసాద్, ఆర్.లింగరాజు, ఎం.నాగమణి, పి రామకృష్ణ, కే శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): అంతర్ జిల్లాల బదిలీల కోసం అభ్యర్థనలు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ప్రాసెస్ చేస్తామని, అర్హత, ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులు లీప్ యాప్‌లో అంతర్ జిల్లాల బదిలీల కోసం దరఖాస్తులు సమర్పించవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని దరఖాస్తు ఫారం ప్రింట్ సంబంధిత మండల విద్యాశాఖాధికారికి ఈ నెల 27వ తేదీ వరకూ సమర్పించవచ్చన్నారు.
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): గణేష్ మండపాలు, నిమజ్జనం రోజున విద్యుత్తు లైన్ల భద్రత, వినియోగంపై ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదాలు సంభవించవని విద్యుత్తు శాఖ ఎస్‌ఈ పీ.సాల్మన్ రాజు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అధికారిక విద్యుత్తు కనెక్షన్లు మండపాలకు విద్యుత్తు సరఫరా కోసం అధికారిక తాత్కాలిక కనెక్షన్లు మాత్రమే తీసుకోవాలని, అనధికారిక కనెక్షన్లు లేదా విద్యుత్తు దొంగతనంగా వినియోగించటం చట్టవిరుద్ధమన్నారు. అత్యవసర సమయాల్లో హెల్ప్‌లైన్ నెంబరు 1912కు ఫోన్ చేయాలన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో ఉపాధ్యాయులకు ప్రభుత్వం బకాయి పడ్డ అన్ని ఆర్థిక ప్రయోజనాలు వెంటనే చెల్లించాలని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్‌ఎస్ ప్రసాద్ డిమాండ్ చేశారు. స్థానిక యూటీఎఫ్ కేంద్ర కార్యాలయంలో నగర శాఖ అధ్యక్షురాలు షేక్ పర్వీన్ బేగం అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన నగర శాఖ కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రావలసిన ఆర్థిక ప్రయోజనాలు, పీఆర్సీ, డీఎల గురించి వివరించారు. సమావేశంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బీ సుభాషిణి, కోశాధికారి రంగమోహన్ పాల్గొన్నారు.

ఫ్రీ బస్సుతో మా జీవితాలు ఛిన్నాభిన్నం