
అంగన్‌వాడీల సమస్యలు పట్టవా?
ఏలూరు (టూటౌన్): సమస్యలు పరిష్కరించాలని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అయినా పాలకులు పట్టించుకోకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, గత సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నారు. 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వం అంగన్‌వాడీలకు వేతనాలు పెంచలేదని గుర్తు చేస్తున్నారు. గత సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు తక్షణం అమలు చేయాలని కోరుతున్నారు.
పనిచేయని సెల్‌ఫోన్లతో ఎలా పనిచేయాలి?
పనిచేయని సెల్ ఫోన్లతో ఎలా విధులు నిర్వర్తించాలని ప్రశ్నిస్తున్నారు. పని భారం విపరీతంగా పెంచిన ప్రభుత్వాలు వేతనాలు మాత్రం పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచడానికి మీన మేషాలు లెక్కిస్తున్నాయని విమర్శిస్తున్నారు. గ్రాట్యుటీ కోసం ఇచ్చిన జీవోలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కనీస వేతనం నెలకు రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
సెల్‌ఫోన్ల అప్పగింత
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున అంగన్‌వాడీలు పనిచేయని తమ సెల్‌ఫోన్లను ఐసీడీఎస్ కార్యాలయాల్లో అప్పగించారు. కొత్త ఫోన్లు ఇవ్వాలని లేదంటే యాప్‌లు రద్దు చేయాలని వేడుకుంటున్నారు. యాప్‌లపై కనీస శిక్షణ ఇవ్వకుండా, యాప్‌లు సపోర్టు చేసే ఫోన్‌లు అందించకుండా మెడపై కత్తి పెట్టి పని చేయమంటే ఎలా చేసేదంటూ ఆక్రోశిస్తున్నారు. అంగన్వాడీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన రెండు యాప్‌లలో అప్‌లోడ్ చేయాల్సి ఉంది. సిగ్నల్స్ పనిచేయక, పాత ఫోన్లు కావడంతో అప్‌లోడ్ చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో 3,851 మంది అంగన్‌వాడీలు
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో మొత్తం 3,851 మంది అంగన్‌వాడీలు పనిచేస్తున్నారు. అదే సంఖ్యలో సహాయకులు పనిచేస్తున్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా పది ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 2,225 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 1,959 మెయిన్ సెంటర్లు, 206 మినీ సెంటర్లు ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఏడు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 1626 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా వీటిలో 1556 మెయిన్ సెంటర్లు, 70 మినీ సెంటర్లు పనిచేస్తున్నాయి.
లబ్ధిదారులకు ఇబ్బందులు
ఫేస్ క్యాప్చర్ అయితేనే లబ్ధిదారులకి ఆహారం ఇవ్వాలి. దీని వల్ల లబ్ధిదారులు నష్టపోతున్నారు. గతంలో కుటుంబంలో ఎవరు వచ్చినా ఇవ్వడానికి ఉండేది. ఇప్పుడు లబ్ధిదారురాలు మాత్రం వస్తేనే ఇవ్వాలి.. ఒకపక్క కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్‌కు నిధులు తగ్గించుకుంటూ పోతుంది. నాణ్యమైన ఆహారం ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు తగ్గించుకోవడం కోసం లబ్ధిదారులకు పౌష్టికాహారంపై కోత పెడుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి
పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలి
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీల ఆందోళన
కొత్త ఫోన్లు ఇస్తేనే పనిచేయగలమంటున్న అంగన్వాడీలు