
పంటు ప్రయాణికులపై బాదుడు
● చించినాడ వంతెన మూసివేతతో పంటుపై పెరిగిన రద్దీ
● జేబులు నింపుకుంటున్న కాంట్రాక్టర్
నరసాపురం: వశిష్ట గోదావరి రేవులో పంటు ప్రయాణికుల నుంచి ఇష్టానుసారం చార్జీలు వసూలు చేస్తున్నారు. పంటు ఎక్కిన ప్రయాణికుల జేబులు గుల్ల చేస్తున్నారు. పంటు కాంట్రాక్టర్ చార్జీలు పెంచి వసూలు చేస్తున్నా అధికారులు మౌనంగా ఉండడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాలను కలుపుతూ యలమంచిలి మండలంలో ఉన్న చించినాడ వంతెన మరమ్మతుల కారణంగా గత నాలుగురోజుల నుంచి మూసేశారు. దీంతో గోదావరి జిల్లాల మధ్య ప్రయాణించడానికి నరసాపురం వశిష్ట గోదావరి రేవు దాటడం తప్ప మరో మార్గం లేదు. దీంతో రేవు వద్ద నాలుగురోజులుగా రద్దీ పెరిగింది. దీనిని పంటు నిర్వాహకులు డబ్బులు దండుకోవడానికి మంచి అవకాశంగా మలుచుకున్నారు. మామూలుగా మోటార్‌సైకిల్‌కు రూ.30 వసూలు చేయాలి. నాలుగు చక్రాల వాహనానికి రూ.130 వసూలు చేయాలి. బైక్‌కు రూ.50 నుంచి రద్దీని బట్టి రూ.100 వరకూ వసూలు చేస్తున్నారు. కారుకు రూ.200 నుంచి రూ.300 వరకూ వసూలు చేస్తున్నారు. వినాయక విగ్రహాలు వంటివి లోడుతో తీసుకెళుతున్న వాహనాలకు రూ.500 వరకూ వసూలు చేస్తున్నారు.
రాత్రి 11 గంటల వరకూ పంటు నిర్వహణ
ప్రత్యామ్నాయ మార్గం లేక, ప్రయాణికులు పంటులోనే ప్రయాణించాల్సి వస్తోంది. వినాయకచవితి పండుగ నేపథ్యంలో రద్దీ పెరిగింది. దీంతో చార్జీలు పెంచి వసూలు చేస్తూ దండుకుంటున్నారు. రేవులో రెండు పంటులు మాత్రమే నడపడానికి అనుమతి ఉంది. రేవు నిర్వాహకులు ప్రమాదకర పరిస్థితుల్లో ఏకంగా మూడు పంటులు తిప్పుతున్నారు. పంటుపై పరిమితికి మించి జనాలను ఎక్కిస్తున్నారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా రాత్రి పూట పంటు తిప్పడానికి అనుమతిలేకున్నా, రాత్రి 11 గంటల వరకూ కూడా పంటు నడుపుతున్నారు. పంటుపై లైఫ్ జాకెట్లు లాంటి రక్షణ పరికరాలు సరిపడా లేకుండా ప్రయాణికుల భద్రతను గాలికొదిలేశారు. సొమ్ములు దోచుకుంటున్నా.. అధికారులు ఉలుకూపలుకూ లేకుండా ఉండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోజుకు ప్రయాణికుల నుంచి గత నాలుగు రోజులుగా రూ.10 లక్షల వరకూ అదనంగా దోచుకున్నట్లు సమాచారం. అధికారులకు ఈ మొత్తంలో 20 శాతం వరకూ ముట్టజెప్పుతున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.