ఏలూరు (టూటౌన్): వీర పరివార్ సహాయత యోజన 2025 పథకం ద్వారా సైనికులు, మాజీ సైనికుల కుటుంబాలు ఉచిత సేవలు పొందాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి అన్నారు. స్థానిక శ్రీరామ్ నగర్ 6వ రోడ్డులోని జిల్లా సైనిక వెల్ఫేరు ఆఫీసులో లీగల్ సర్వీసెస్ క్లినిక్‌ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ సైనికులకు ఉచిత సేవలందించాలనే ఉద్దేశంతో అందుబాటులో ఉన్న ప్రతి న్యాయ సేవాధికార సంస్థ పరిధిలో లీగల్ సర్వీసెస్ క్లినిక్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ క్లీనిక్‌లో ప్యానెల్ న్యాయవాది, పారా లీగల్ వలంటీర్లను నియమించామన్నారు. కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనె సీతారాం తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (టూటౌన్): కృష్ణ జిల్లా మచిలీపట్నంలోని ఆంధ్రప్రదేశ్ మైనార్టీస్ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు అడ్మిషనన్లకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖాధికారి ఎస్.ఎస్.కృపావరం ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత వసతి సదుపాయం కల్పిస్తారని, ఇతర వివరాలకు 8712625035 నెంబర్‌లో సంప్రదించవచ్చన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఈ నెల 30న తలపెట్టిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశం తేదీ మార్చాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 1938 రాష్ట్ర అకడమిక్ కమిటీ కన్వీనర్ గుగ్గులోతు కృష్ణ, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈ.రామ్మోహన్ రావు, జీ.మోహన్ రావు ఒక ప్రకటనలో కోరారు. ఆగస్టు 30న ఎక్కువమంది ఉపాధ్యాయుల పదవీ విరమణ కార్యక్రమాలు ఉన్నాయని, ఈనెల చివరి పని దినం ఆగస్టు 30న జరిగే స్కూల్ కాంప్లెక్స్‌కు ఉపాధ్యాయులందరూ హాజరవడం ద్వారా పదవీ విరమణ పొందే ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించడానికి ఇబ్బంది ఏర్పడుతుందన్నారు.
ఏలూరు(మెట్రో): గిరిజన ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు గిరిజన ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధిని చివరి మైలు వరకు సేవలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకున్నామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆదికర్మయోగి అభియాన్ కార్యక్రమం అమలు తీరును కలెక్టర్ వివరించారు. నూజివీడు, చింతలపూడి, చాట్రాయి, టి.నరసాపురం మండలాలకు చెందిన బ్లాక్ మాస్టర్ ట్రైనర్‌లకు గత మూడు రోజులుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామన్నారు.
ఉండి: ఈ నెల 19వ తేదీన సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ఇదేనా పంటకాలువల ప్రక్షాళన అనే కథనానికి అధికారులు స్పందించారు. బుధవారం ఉండి పాములపర్రు పంటకాలువలో చెత్త, తూడును తొలగించి కాలువను ప్రక్షాళన చేశారు. దీంతో పాములపర్రు గ్రామ ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేశారు.
యలమంచిలి: వరుసగా రెండో రోజు కూడా కనకాయలంక కాజ్‌వే వరద నీటిలో మునిగింది. ధవళేశ్వరం వద్ద బుధవారం సాయంత్రం 8.08 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు వదలడంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. వరద ప్రభావానికి గురైన కనకాయలంకలో తహసీల్దార్ నాగ వెంకట పవన్‌కుమార్, ఇతర అధికారులు పర్యటించారు.