కాంగ్రెస్‌ ఒంటెత్తుపోకడ | Sakshi Editorial On Congress Party, Rahul Gandhi | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ఒంటెత్తుపోకడ

Oct 8 2026 1:27 AM | Updated on Oct 8 2026 1:27 AM

Sakshi Editorial On Congress Party, Rahul Gandhi

ఎన్నికల సంఘం(ఈసీ) స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) మాటున చేసిన నిర్వాకంపైనా, ఈ విషయంలో మరో ఇద్దరు కమిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను బేఖాతరు చేసినట్టు బయటపడిన వైనంపైనా నిరసనలు హోరెత్తుతున్నాయి. ఒకపక్క కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ), ఇతర సంఘాలు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కోరుతూ రోజూ ఆందోళన నిర్వహిస్తుండగా మంగళవారం ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన సుమారు 300మంది ఎంపీలు 9 గంటలపాటు సెంట్రల్‌ ఢిల్లీలోని పార్లమెంటు నుంచి ఈసీ ప్రధాన కార్యాలయం నిర్వాచన్‌ సదన్‌ వరకూ...ఆ తర్వాత ఆకాశవాణి భవన్‌ ప్రాంగణంలోనూ ర్యాలీ, ధర్నా నిర్వహించాయి. విపక్షాలన్నీ ఏకంకావటం ఇటీవల కాలంలో ఇది రెండోసారి. వ్యవస్థలు వ్యవహరించే తీరుపై కావొచ్చు, వాటి విధాన నిర్ణయాలపై కావొచ్చు... నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఆ కర్తవ్యాన్ని విపక్షాలు నిర్వర్తించటం హర్షించదగిందే. కానీ నిరుడు నిరసనల్లో పాల్గొన్న తమిళనాడుకు చెందిన డీఎంకే ఎందుకు దూరమైంది? మధ్యలో కొన్నాళ్లు ఇండియా కూటమితో చెలిమి చేసినట్టే కనిపించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) సైతం ఈసారి ఎందుకు మాయమైంది? ఆ రెండు పార్టీల వైఖరులూ మారడానికి కారణం ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్‌ వ్యవహార శైలే కారణమన్నది రహస్యమేమీ కాదు. ఎక్కడిదాకానో అవసరం లేదు. మంగళవారంనాటి నిరసనలో తొలుత ఉత్సాహంగా పాల్గొన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ), కొన్ని ఇతర పార్టీలు సైతం మధ్యలో హఠాత్తుగా అలిగి, దానికి దూరం కావటం కాంగ్రెస్‌ ఒంటెత్తు పోకడల పర్యవసానమే. 

పన్నెండేళ్లుగా కేంద్రంలో అధికారంలో కొనసాగుతూ, సంస్థాగతంగా పటిష్టంగా ఉన్న బీజేపీని ఢీకొనటం తనవల్లే సాధ్యమని కాంగ్రెస్‌ నమ్ముతోంది. మంచిదే. కానీ తాను బాధ్యతాయుతంగా మెలగాలని అది భావించటంలేదు. తమిళనాడు ఎన్నికల్లో ఇండియా కూటమి భాగస్వామ్యపక్షం డీఎంకేతో కలిసి పోటీచేసి, అది ఓడిపోగానే ప్లేటు ఫిరాయించి ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్‌ నాయకత్వంలోని టీవీకేతో చేతులు కలపటం సూత్రబద్ధ రాజకీయమేనా? తమకు మద్దతు పలికే వర్గాల ఓట్లు ఈసీ అక్రమంగా తొలగించటంవల్లే ఓడిపోయామని ఒకపక్క డీఎంకే చెబుతుండగా, మద్దతుగా నిలవాల్సిన మిత్రధర్మాన్ని కాంగ్రెస్‌ ఎలా విస్మరించింది? ఆప్‌ విషయంలోనూ అంతే. కేంద్రంలో తన పాలనలోని అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం నుంచి ఆప్‌ ఆవిర్భవించింది. కాంగ్రెస్‌కు లోలోన ఆ దుగ్ధ ఉంటే ఉండొచ్చు. పైగా ఢిల్లీలోనూ, పంజాబ్‌లోనూ తన వర్గాల ఓట్లే అది కొల్లగొడుతున్నదన్న ఆగ్రహం సరేసరి. అందుకే దాన్ని బీజేపీ–బీ టీంగా చిత్రిస్తోంది. మరి ఆంధ్రప్రదేశ్‌లో తాను చేస్తున్నదేమిటి? అక్కడ ఎన్డీయే కూటమిలోని టీడీపీతో లాలూచీ పడటాన్ని ఎలా చూడాలి? 2024 ఎన్నికలనాటి అవకతవకలపై పార్లమెంటులో రాహుల్‌ మాటమాత్రంగానైనా ప్రస్తావించారా? ఈ మౌనం సీఎం చంద్రబాబు కోసం కాదా?

ఒకపక్క ఇండియా కూటమికి నాయకత్వం వహించే అర్హత తనకే ఉన్నదంటూ ఇలాంటి తెరచాటు వ్యవహారాలు నడపటం అనైతికమని, తన ఏలుబడిలోని రాష్ట్రాల్లో ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్న తీరు కూడా ఈ కోవలోకే వస్తుందని అది గుర్తించటం లేదు. మంగళవారంనాటి ఉదంతంలో నిర్వాచన్‌ సదన్‌ దగ్గర ధర్నాకు ముందుగా నిర్ణయించుకున్నాక, చెప్పాపెట్టకుండా ఆకాశవాణి ప్రాంగణంలోకి దూసుకెళ్లటం, ఇతర పక్షాలకు చెప్పకపోవటం ఉద్దేశపూర్వకంగా చేసిందేనని టీఎంసీ, ఇతర పక్షాలూ భావించటంలో తప్పేం లేదు. తాను మాత్రమే బీజేపీపై పోరాడుతున్నానన్న అభిప్రాయం కలిగించటానికే ఇలా చేసిందని ఆ పార్టీలు అలిగాయి. ఈ దశలో చీలిక జాడలు కనబడకూడదని మళ్లీ సర్దుకున్నాయి. పుట్టింది కొన్ని నెలలే అయినా...సంస్థాగతంగా పటిష్టంగా లేకున్నా సీజేపీ పిలుపిస్తే వేలకొలదీ జనం రావటమైనా, ఆప్‌లో కొన్నాళ్లు పనిచేయటం మినహా పెద్దగా రాజకీయ నేపథ్యంలేని అభిజిత్‌ దీప్కేకు జనం నీరాజనాలు పలకడమైనా ఎందుకో రాహుల్‌ గ్రహించాలి. సూత్రబద్ధమైన రాజకీయానికి కట్టుబడకపోతే తన మాటెలావున్నా, విపక్షాల ఉద్యమస్ఫూర్తి దెబ్బతింటుందని గుర్తించాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement