యుద్ధం ఉన్నట్టా... లేనట్టా?! | Donald Trump surprised everyone by telling a big lie to the American Congress this time | Sakshi
Sakshi News home page

యుద్ధం ఉన్నట్టా... లేనట్టా?!

Jun 6 2026 3:34 AM | Updated on Jun 6 2026 3:34 AM

Donald Trump surprised everyone by telling a big lie to the American Congress this time

అయోమయాన్ని సృష్టించటానికీ, అవతలి పక్షంపై పైచేయి సాధించటానికీ ఎంతకైనా తెగించే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఈసారి అమెరికన్‌ కాంగ్రెస్‌కు పెద్ద అబద్ధం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇరాన్‌తో శత్రుత్వాన్ని ఆపి, అక్కడున్న సేనలనువెంటనే వెనక్కి పిలిపించాలని 215–208 ఓట్ల తేడాతో బుధవారం అమెరికన్‌ కాంగ్రెస్‌ తీర్మానించగా, ‘అసలు యుద్ధం ఎక్కడుంది? అది ఏప్రిల్‌ మొదటి వారంలోనే ముగిసి పోయింది. ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అది కొనసాగుతోంది’అంటూ ట్రంప్‌ లేఖ రాశారు. 

ఇజ్రాయెల్‌తో కుమ్మక్కై, ఫిబ్రవరి 28న ఇరాన్‌పై మొదలు పెట్టిన దండయాత్ర ఇప్పటికీ ఆగలేదు. హార్మూజ్‌ జలసంధి ఇంకా తెరుచుకోలేదు. తమ షరతులకు తలొగ్గితేనే ఒప్పందం సాధ్యమంటూ ఇరాన్‌కు ట్రంప్‌ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ తీర్మానానికి కొన్ని గంటలముందు కూడా అమెరికా దాడులకు ప్రతీకారంగా కువైట్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ దాడులు చేసింది. కానీ ఈ ఘర్షణల్ని యుద్ధంగా పరిగణించరాదని ట్రంప్‌ భాష్యం చెబుతున్నారు. 

నిజానికి యుద్ధం ఆపాలని ప్రతినిధుల సభ ఆదేశించినంత మాత్రాన ట్రంప్‌కొచ్చే నష్టమేం లేదు. ఆ తీర్మానం చట్టపరంగా కీలకమైన చర్యే కావొచ్చు, కానీ ఆచరణలో అదే మంత పనికొచ్చేది కాదు. నలుగురు రిపబ్లికన్‌ సభ్యులు డెమాక్రాట్లతో చేయి కలపటంతో తీర్మానం ఆమోదం పొందింది. 1973లో వచ్చిన యుద్ధ అధికారాల చట్టంకిందకాంగ్రెస్‌ అనుమతి లేకుండా అధ్యక్షుడు యుద్ధంలోకి దిగితే, రెండు నెలల్లో దాన్నిముగించాల్సి ఉంటుంది. 

ఒకవేళ యుద్ధం ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఉందని భావిస్తే మరో 30 రోజులు పొడిగించటానికి అధ్యక్షుడికి వెసులుబాటుంది. కానీ అటు తర్వాత మాత్రం అసాధ్యం. ట్రంప్‌ రాసిన లేఖ ప్రకారం నిండా నెలకుమించి యుద్ధం సాగలేదు! కాల్పుల విరమణ అమల్లో ఉందంటే యుద్ధం లేనట్టేననీ, ‘అవసరమైన’సందర్భాల్లో చేస్తున్న దాడుల్ని యుద్ధంగా పరిగణించరాదనీ యుద్ధ శాఖ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ వాదిస్తున్నారు. 

తలా తోకా లేకుండా మాట్లాడటంలో ట్రంప్‌ సిద్ధహస్తుడు. ఒకపక్క కాంగ్రెస్‌ చేసిన తీర్మానం దేశభక్తి రాహిత్యమంటూనే, అదే నోటితో అదెప్పుడో ముగిసిందని చెబు తున్నారు. ఆయన తర్కం ప్రకారం యుద్ధం చేయటమే దేశభక్తి అయితే, దాన్ని నిలి పేసిన తనకూ దేశభక్తి లోపించినట్టే. ఈ వాదప్రతివాదాల మాటెలావున్నా ఇలాంటి అధ్యక్షుణ్ణి నెత్తిన పెట్టుకున్నందుకు మున్ముందు ఆ దేశం భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఈ నెలాఖరుతో యుద్ధం వంద రోజులకు చేరుతుంది. 

యుద్ధం ఆగేందుకు ఇప్పటికి నాలుగుసార్లు ప్రతినిధుల సభలో డెమాక్రాట్లు తీర్మానాలు పెట్టారు. కానీ మొదటి మూడుసార్లూ అవి వీగిపోయాయి. మూడోసారి తీర్మానమైతే 212–212తో ఎటూతేలకుండా ముగిసింది. ఈసారి అది నెగ్గినా ట్రంప్‌ తన తర్కంతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. యుద్ధంవల్ల ఇరాన్‌లో ఇంతవరకూ 3,400 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, 13 మంది అమెరికన్‌ సైనికులు మరణించారు. 2,900 కోట్ల డాలర్లు ఖర్చయిందని పెంటగాన్‌ చెబుతుండగా, ఇదంతా ముగిసేసరికి లక్ష కోట్ల డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ట్రంప్‌ మూర్ఖత్వం ఇలాగే కొనసాగితే అమెరికా నిండా మునగటం ఖాయం. దాంతో పాటు డాలర్‌తో ముడిపడివున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ దివాలా స్థితికి చేరుకుంటాయి. ఇంధనం, ఎరువుల ధరలు ఆకాశాన్నంటి ఇప్పటికే ట్రంప్‌ రేటింగ్‌ నేల చూపులు చూస్తోంది. ప్రతినిధుల సభ చేసిన తీర్మానంవంటిదే రిపబ్లికన్ల ఆధిక్యతగల సెనేట్‌లో కూడా చేస్తే అమెరికా అధ్యక్షుడి సంతకం అవసరం లేకుండానే యుద్ధం ఆపాల్సి ఉంటుంది. అయితే అలాంటి సందర్భం ఎదురైనప్పుడు సైతం దాన్ని ట్రంప్‌ వీటో చేయొచ్చని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. 

మొత్తానికి అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్‌ తీర్మా నిస్తే తప్ప ఇవన్నీ పెద్దగా పనికొచ్చేవి కాదు. ఇప్పటికే మొత్తం ఓటర్లలో 64 శాతంమంది ట్రంప్‌ యుద్ధోన్మాదాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. తటస్థ ఓటర్లలో అయితే 73 శాతంమంది యుద్ధం ఆపాలని కోరుకుంటున్నారు. ఎవరెంతగా కోరుకున్నా ట్రంప్‌ మాత్రం స్వీయ వినాశనంవైపే అమెరికాను తీసుకుపోతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement