కోర్టుకు హాజరై వెళ్తూ మళ్లీ చోరీ | Women stole silverware | Sakshi
Sakshi News home page

కోర్టుకు హాజరై వెళ్తూ మళ్లీ చోరీ

Oct 6 2024 4:41 AM | Updated on Oct 6 2024 4:41 AM

Women stole silverware

ముగ్గురు మహిళల అరెస్టు... రిమాండ్‌కు తరలింపు

మంచిర్యాలక్రైం: వివిధ దొంగతనాల కేసులో కోర్టులో హాజరయ్యేందుకు వచ్చి తిరిగివెళ్తూ మరోసారి చోరీకి పాల్పడి పోలీసులకు పట్టుబడ్డారు. మంచిర్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. 

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇస్పెట్‌ గ్రామానికి చెందిన మాసు అన్నపూర్ణ, రాధ, శనిగరం పూలమ్మ అనే ముగ్గురు మహిళలు గతంలో వరంగల్‌లోని మట్టెవాడ, బెల్లంపల్లి వన్‌టౌన్, జమ్మికుంట పోలీసుస్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడి జైలుకి వెళ్లారు. బెల్లంపల్లి వన్‌టౌన్‌ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో గత నెల 30న మంచిర్యాల జిల్లా కోర్టుకు హాజరయ్యారు.

తిరిగి వెళ్తూ మంచిర్యాలలోని శ్రీవైష్ణవి జువెల్లరీ షాపులో ఆభరణాలు కొనుగోలుదారులుగా వెళ్లారు. అక్కడ వెండిపట్టీలు చూస్తూ రూ.45వేల విలువైన పది జతలు దొంగిలించారు. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టి మహిళలు దొంగతనానికి పాల్పడినట్లుగా సీసీపుటేజీ ఆధారంగా గుర్తించారు. 

ప్రత్యేక బృందంతో ఇస్పెట్‌ గ్రామానికి వెళ్లి ముగ్గురిని అదుపులోకి తీసుకుని పట్టీలను రికవరీ చేశారు. ఈ మేరకు ఈ ముగ్గురిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు మీడియాకు వెల్లడించారు.  

Advertisement
 
Advertisement
Advertisement