బైక్‌ కొనలేదని విద్యార్థి ఆత్మహత్య | Student suicide In Pothinamallayya Palem | Sakshi
Sakshi News home page

బైక్‌ కొనలేదని విద్యార్థి ఆత్మహత్య

Oct 22 2024 11:31 AM | Updated on Oct 22 2024 12:45 PM

Student suicide In  Pothinamallayya Palem

పుట్టిన రోజు నాడు విషాదం

పీఎంపాలెం: పుట్టిన రోజు నాడు విషాద సంఘటన చోటుచేసుకుంది. తండ్రి బైక్‌ కొనలేదని కోపంతో ఓ ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు. ప్రాణస్నేహితులను దుఃఖ సాగరంలో ముంచెత్తాడు. పీఎంపాలెం గాయత్రీనగర్‌ జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో సోమవారం జరిగిన సంఘటనకు సంబంధించిన సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలు.. పేరిశెట్టి సూర్యనారాయణ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామం నుంచి సుమారు ఆరేళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు. ప్రస్తుతం ఓ కళాశాలలో హాస్టల్‌ కుక్‌గా పనిచేస్తూ పీఎంపాలెం గాయత్రీనగర్‌లో భార్య గంగ, పెద్ద కుమారుడు గణేష్‌ , 9వ తరగతి చదువుతున్న చిన్న కుమారుడు లోకేష్‌తో కలిసి నివసిస్తున్నాడు. 

పెద్ద కుమారుడు నగరంలోని ఓ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం పుట్టిన రోజు కావడంతో సాయంత్రం కేక్‌ కట్‌ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలో ఏమైందో ఏమో ఇంటి తలుపులు వేసుకుని ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్మకు పాల్పడ్డాడు. అనుకోని పరిణామంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, స్థానికులు వేలాడుతున్న గణేష్‌ను కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ బాలకృష్ణ తెలిపారు.

బైక్‌ కొనమని తండ్రితో గొడవ
విద్యార్థి గణేష్‌ ఎప్పటి నుంచో బైక్‌ కొనమని తల్లిదండ్రులను వేడుకుంటున్నాడు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. బైక్‌ కొనే స్థోమత ఆ కుటుంబానికి లేదు. ఇదే విషయం తల్లిదండ్రులు గణేష్‌ నచ్చచెప్పినప్పటికీ వినేవాడు కాదు. ఈ విషయంపైనే తండ్రితో గొడవ పడినట్టు స్థానికులు చెబుతున్నారు. బైక్‌ కొనే స్థోమత లేకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement