కొన ఊపిరితో ఉన్నాడు.. చచ్చాకే తలుపులు తీస్తా... | Telangana: Son Killed His Father Due To Harassment In Medak - Sakshi
Sakshi News home page

కొన ఊపిరితో ఉన్నాడు.. చచ్చాకే తలుపులు తీస్తా...

Published Sun, Mar 17 2024 9:00 AM | Last Updated on Sun, Mar 17 2024 10:19 AM

father murdered by son - Sakshi

హీటర్‌తో కొట్టి.. చున్నీతో ఉరివేసి కన్న తండ్రిని 


దారుణంగా కడతేర్చిన కుమారుడు


మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలంలో ఘటన

పాపన్నపేట (మెదక్‌): వేధింపులతో విరక్తి చెంది కన్న తండ్రినే కిరాతకంగా చంపాడు ఓ కుమారుడు. ఈ ఘటన మెదక్‌ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని రామతీర్థం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన సంగం ప్రేమానందం (42), సుగుణమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు సందీప్‌ సిద్దిపేటలో డిగ్రీ చదువుతుండగా, కూతురు 9వ తరగతి, చిన్న కుమారుడు ప్రవీణ్‌ 7వ తరగతి చదువుతున్నారు. ప్రేమానందం మద్యానికి అలవాటు పడి, భార్యను అనుమానిస్తూ తరచూ కొడుతుండేవాడు. 10 రోజుల కిందట అల్లాదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులు సైతం ప్రేమానందంకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

 అయినా వారి కుటుంబంలో సఖ్యత కుదరలేదు. బుధవారం మళ్లీ గొడవ జరగడంతో తల్లి సుగుణమ్మ, పెద్ద కుమారుడు సందీప్‌ కలిసి రోకలి బండతో ప్రేమానందం మోకాళ్లు విరగ్గొట్టి నడవడానికి రాకుండా చేసి తల్లిగారింటికి వెళ్లిపోయారు. అయితే శనివారం మళ్లీ సందీప్‌ ఇంటికొచ్చేసరికి ప్రేమానందం తన తండ్రి ప్రసాద్, పక్కింటి వారితో మాట్లాడుతున్నాడు. వెంటనే సందీప్‌ తాత ప్రసాద్‌ను, పక్కింటి వారిని ఇంట్లో నుంచి బయటకు పంపి తలుపులు గడియపెట్టాడు.

 లేవలేని స్థితిలో ఉన్న తండ్రి ప్రేమానందంను కరెంట్‌ హీటర్‌తో విచక్షణా రహితంగా కొట్టడం మొదలుపెట్టాడు. చుట్టు పక్కలవారు తలుపులు తీయమని బతిమిలాడినా ‘కొన ఊపిరితో ఉన్నాడు.. ప్రాణం పోయాకే తలుపులు తీస్తానంటూ’ ఆగ్రహంతో ఊగిపోయాడు. కొద్దిసేపటి తర్వాత చున్నీతో ఉరి వేసి తండ్రిని హత్య చేశాడు. సమాచారం అందుకున్న ఎస్సై నరేశ్, క్లూస్‌ టీం తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదుచేసి, సందీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సందీప్‌ ఇటీవల పోలీస్‌ ఉద్యోగానికి ప్రయత్నించగా,కొద్ది తేడాతో అవకాశం పోయినట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement