టోకు ద్రవ్యోల్బణం డౌన్‌  | WPI inflation eases marginally to 9. 78percent in July 2026 | Sakshi
Sakshi News home page

టోకు ద్రవ్యోల్బణం డౌన్‌ 

Aug 15 2026 6:38 AM | Updated on Aug 15 2026 6:38 AM

WPI inflation eases marginally to 9. 78percent in July 2026

జూలైలో స్వల్ప తగ్గుదల.. 9.78 శాతంగా నమోదు 

న్యూఢిల్లీ: ఇంధన, ఆహారోత్పత్తుల రేట్లు కొంత నెమ్మదించడంతో తొమ్మిది నెలల్లో తొలిసారిగా జూలైలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ (డబ్ల్యూపీఐ) స్వల్పంగా తగ్గింది. 9.78 శాతంగా నమోదైంది. జూన్‌లో ఇది 9.87 శాతంగా ఉంది. 2025 అక్టోబర్‌ తర్వాత నెలవారీగా చూసినప్పుడు డబ్ల్యూపీఐ తగ్గడం ఇదే తొలిసారి. తయారీ ఉత్పత్తులు మొదలైన వాటి రేట్లు పెరిగినప్పటికీ ఇంధనం, విద్యుత్‌ ధరల పెరుగుదల నెమ్మదించడం ఇందుకు కారణమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ తెలిపింది. 

శుక్రవారం విడుదల చేసిన డేటా ప్రకారం ఇంధన ద్రవ్యోల్బణం జూన్‌లో 27.41 శాతంగా ఉండగా జూలైలో 20.05 శాతానికి దిగి వచి్చంది. అలాగే, ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం 5.49 శాతం నుంచి స్వల్పంగా 5.44 శాతానికి తగ్గింది. అయితే, తయారీ ఉత్పత్తుల ధరలు మాత్రం 7.48 శాతం నుంచి 8.29 శాతానికి పెరిగాయి. అంతర్జాతీయంగా రేట్లు ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరినందున రాబోయే రోజుల్లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం ఇకపై క్రమంగా తగ్గు ముఖం పట్టొచ్చని బార్‌క్లేస్‌ ఒక నివేదికలో తెలిపింది. ఆగస్టులో ఇది 9.5 శాతానికి దిగి రావొచ్చని, అయితే, 2027 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద డబ్ల్యూపీఐ సగటున 8.5 శాతంగా ఉండొచ్చని ఇక్రా ప్రిన్సిపల్‌ ఎకానమిస్ట్‌ రాహుల్‌ అగ్రవాల్‌ పేర్కొన్నారు.

రిటైల్‌ ధరలు అక్కడక్కడే 
వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(సీపీఐ) గత నెల(జూలై)లో స్వల్పంగా పెరిగి 4.45 శాతానికి చేరింది. ఉల్లిపాయలు, అల్లం తదితరాల ధరలు పెరిగినప్పటికీ జూన్‌లో నమోదైన 4.38 శాతంతో పోలిస్తే నామమాత్రంగా బలపడింది. దీంతో ప్రభుత్వ గణాంకాల ప్రకారం వరుసగా రెండో నెలలోనూ ఆర్‌బీఐ పరపతి విధానాల లక్ష్యానికి ఎగువన నిలిచింది. 2024 ఏడాది(బేస్‌ ఇయర్‌) ఆధారం చేసుకుని జనవరి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త సిరీస్‌లో జూలై గణాంకాలే అత్యధికంకావడం గమనార్హం! గత నెలలో ఆహార ద్రవ్యోల్బణం 5.32 శాతం నుంచి 5.52 శాతానికి స్వల్పంగా పెరిగింది. ఉల్లి ధరల పెరుగుదల జూన్‌లో నమోదైన 4.73 శాతం నుంచి జూలైలో 22.54 శాతానికి, అల్లం ధర దాదాపు 84 శాతానికి ఎగసింది. అయితే మరోపక్క బంగళా దుంపలు, బెండకాయలు, టొమాటోలు, బఠాణీల ధరలు వెనకడుగు వేయడంతో రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement