రికార్డు కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం
అక్టోబర్‌లో 0.25 శాతంగా నమోదు
న్యూఢిల్లీ: నిత్యావసర ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. అక్టోబర్ నెలలో వినియోగ ధరల ఆధారిత సూచీ (సీపీఐ/రిటైల్ ద్రవ్యోల్బణం) రికార్డు కనిష్ట స్థాయి 0.25 శాతానికి తగ్గుముఖం పట్టింది. కూరగాయలు, పండ్లు, గుడ్ల ధరలు శాంతించడానికి తోడు, జీఎస్‌టీలో 380 ఉత్పత్తుల రేట్ల తగ్గింపు ఇందుకు అనుకూలించింది. సీపీఐ డేటా 2014 నుంచి సమీకరిస్తుండగా, ఇంత కనిష్ట స్థాయికి రిటైల్ ద్రవ్యోల్బణం చేరడం ఇదే ప్రథమం. ఈ ఏడాది సెపె్టంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 1.44 శాతం కాగా, 2024 అక్టోబర్‌లో 6.21 శాతంగా ఉండడం గమనార్హం. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) ఈ వివరాలను విడుదల చేసింది.
మైనస్‌లో ఆహార ద్రవ్యోల్బణం
ఆహార విభాగంలో ద్రవ్యోల్బణం మైనస్ 5.02గా నమోదైంది. జీఎస్‌టీ రేట్లు తగ్గడం, సానుకూల బేస్ ప్రభావం, నూనెలు, ఫ్యాట్స్, కూరగాయలు, పండ్లు, గుడ్లు, పాదరక్షలు, తృణ ధాన్యాలు, రవాణా ధరలు తగ్గడం వల్లేనని ఎన్‌ఎస్‌వో తెలిపింది. జీఎస్‌టీ రేట్ల సవరణ సెపె్టంబర్ 22 నుంచి అమల్లోకి రావడం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం మైనస్ 0.25 శాతంగా ఉంటే, పట్టణ ప్రాంతాల్లో 0.88 శాతంగా ఉంది.
కేరళలో అత్యధికంగా 8.56 శాతం, తమిళనాడులో అత్యల్పంగా 1.29 శాతం ద్రవ్యోల్బణం కనిపించింది. అసోం, బిహార్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, యూపీలో మైనస్‌గా నమోదైంది. 2025–26 సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 2.6 శాతంగా ఉండొచ్చన్నది ఆర్‌బీఐ అంచనా. తాజా గణాంకాల నేపథ్యంలో దీన్ని మరింత దిగువకు సవరించొచ్చని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితినాయర్ పేర్కొన్నారు. డిసెంబర్ భేటీలో రెపో రేటును పావు శాతం తగ్గించొచ్చని అంచనా వేశారు. అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా తగ్గడానికి సెప్టెంబర్ చివర్లో అమల్లోకి వచి్చన జీఎస్‌టీ రేట్ల తగ్గింపు కారణమని కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ ముఖ్య ఆర్థికవేత్త రజని సిన్హా పేర్కొన్నారు.


