అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
పశుమాంసం, కాఫీ, పండ్లు సహా 100కుపైగా ఉత్పత్తులు ఇక చౌక
వాషింగ్టన్: విదేశీ ఉత్పత్తులపై టారిఫ్‌లతో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్తంత కరుణ చూపారు. విదేశాల నుంచి తమ దేశంలోకి దిగుమతి అయ్యే పశుమాంసం(బీఫ్), కాఫీ, ఉష్ణమండల పండ్లతోపాటు ఇతర ఉత్పత్తులపై టారిఫ్‌లు రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అమెరికాలో ఆహార పదార్థాలు, నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోవడంతో జనం గగ్గోలు పెడుతున్నారు.
ట్రంప్ కఠిన విధానాలపై వారు దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రజాగ్రహం నానాటికీ తీవ్రమవుతోంది. ఆ ఒత్తిళ్లు తట్టుకోలేక ట్రంప్ దిగివచ్చినట్లు తెలుస్తోంది. అందుకే టారిఫ్‌ల రద్దు ప్రకటన చేసినట్లు సమాచారం. దీనివల్ల స్వదేశంలో ధరలు తగ్గుతాయి. అమెరికన్లకు ఊరట లభించనుంది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే టారిఫ్‌ల కొరడా అందుకున్న సంగతి తెలిసిందే.
ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం
బీఫ్, కాఫీ, అరటి పండ్లు, అవకాడో, టమాటాలు, కొబ్బరికాయలు, మామిడికాయలు, కోకోవా, బ్లాక్ టీ, గ్రీన్ టీ, వెనిల్లా బీన్స్, జామకాయలు, నిమ్మకాయలు, నారింజ, పైనాపిల్, జీడిపప్పు, గసగసాలు సహా 100కిపైగా ఉత్పత్తులపై సుంకాలు రద్దు చేస్తూ సంబంధిత కార్యనిర్వాహక ఉత్తర్వుపై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఈ టారిఫ్‌ల రద్దు ఆదేశాలు గురువారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చినట్లు అమెరికా ప్రభుత్వం వెల్లడించింది.


