ఆన్‌లైన్ ఆర్థిక మోసాలను అరికట్టేందుకు ఉద్దేశించిన డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫాంలో 1,000కి పైగా బ్యాంకులు, థర్డ్ పార్టీ యాప్‌లు, పేమెంట్ టెక్నాలజీ సంస్థలు చేరినట్లు టెలికం శాఖ (డాట్) వెల్లడించింది. అవి అమలు చేస్తున్న ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్లతో (ఎఫ్‌ఆర్‌ఐ) బ్యాంకింగ్ వ్యవస్థలో కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఏకంగా రూ. 660 కోట్ల ఆర్థిక నష్టాలను నివారించడం సాధ్యపడిందని పేర్కొంది.
ఎఫ్‌ఆర్‌ఐ అమలుపై అవగాహన పెంచేందుకు సంబంధిత వర్గాల కోసం ప్రత్యేక సెషన్లను నిర్వహిస్తున్నట్లు వివరించింది. ఇప్పటివరకు 16 సెషన్లను నిర్వహించినట్లు డాట్ తెలిపింది. దేశీయంగా సైబర్‌నేరాల తీరుతెన్నులు నాటకీయంగా మారిపోయాయని పేర్కొంది. మోసగాళ్లు చట్టబద్ధమైన టెలికం మార్గాల కళ్లు గప్పి, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌ల్లాంటి అధునాతన నేరాలకు పాల్పడుతున్నారని వివరించింది.
ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు సంచార్ సాథీ ప్లాట్‌ఫాం ద్వారా ప్రజల భాగస్వామ్యం కూడా పెరగడం తోడ్పడుతోందని డాట్ తెలిపింది. ఈ పోర్టల్, మొబైల్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించింది.


