
రూ. 47,000 కోట్ల ప్లాన్ సిద్ధం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ను పటిష్టం చేయడంపై కేంద్రం మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు రూ. 47,000 కోట్ల పెట్టుబడులతో మరో ప్రణాళికను సిద్ధం చేసినట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో టెలికం శాఖ వెల్లడించింది. 4జీ సేవలను విస్తరించేందుకు 1 లక్షకు పైగా టవర్లను ఏర్పాటు చేసేందుకు కంపెనీ గతేడాది రూ. 25,000 కోట్లు వెచి్చంచినట్లు కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ఉటంకిస్తూ పేర్కొంది.
వచ్చే ఏడాది నాటికి కస్టమర్లను పెంచుకుని, మొబైల్ సర్వీస్ వ్యాపారాన్ని 50 శాతం మేర పెంచుకోవాలని గత నెలలో బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులతో సమీక్షా సమావేశం సందర్భంగా మంత్రి సూచించారు. ఎంటర్‌ప్రైజ్ వ్యాపారాన్ని 25–30 శాతం, ఫిక్స్‌డ్ లైన్ విభాగాన్ని కనీసం 15–20 శాతం మేర పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. అలాగే ప్రతి యూజరుపై సగటున వచ్చే ఆదాయం (ఏఆర్‌పీయూ)ని మెరుగుపర్చుకోవాలని తెలిపారు. ప్రస్తుతం సర్కిల్‌ని బట్టి బీఎస్‌ఎన్‌ఎల్ ఏఆర్‌పీయూ సుమారు రూ. 40 నుంచి రూ. 175 వరకు ఉంటోంది. జూన్ త్రైమాసికంలో ప్రైవేట్ టెల్కోలు రిలయన్స్ జియో ఏఆర్‌పీయూ రూ. 208గా, ఎయిర్‌టెల్‌ది రూ. 250గా నమోదైంది.